Sports

సరదా ట్వీట్ కొంప ముంచింది

Tennis Star Bombarded With Dating Resumes

ట్విటర్‌లో చేసిన సరదా వ్యాఖ్యల నేపథ్యంలో ఓ టెన్నిస్‌ తారకు వింత అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనేక మంది క్రీడాకారులు తమ ఇళ్లకే పరిమితమై స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. ఇక ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలీక కొందరు సామాజిక మాధ్యమాల్లో అభిమానులతో ముచ్చట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే కెనడాకు చెందిన టెన్నిస్‌ తార, 2014 వింబుల్డన్‌ రన్నరప్‌ గినీ బౌచర్డ్‌ చేసిన ఒక సరదా ట్వీట్‌కు విచిత్రమైన స్పందన వచ్చింది.

నెటిజెన్లతో చాటింగ్‌ చేద్దామని భావించిన గినీ శుక్రవారం ట్విటర్‌లో ఎవరున్నారో చెప్పండి అంటూ సంభాషణ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే శనివారం మరో సరదా ట్వీట్‌ చేసింది. ‘ఎవరినీ ఉద్దేశించట్లేదు కానీ, క్వారెంటైన్‌లో బాయ్‌ఫ్రెండ్‌తో ఉంటే మరింత బాగుంటుంది’ అని పోస్టు చేసింది. దీంతో నెటిజెన్లు పెద్ద ఎత్తున స్పందించారు. ఆమె చేసిన ట్వీట్‌లోని ఈమెయిల్‌కు ఎక్కువ సంఖ్యలో ‘డేటింగ్‌ రెజ్యూమేలు’ పంపించారు. ఈ విషయాన్ని తన మేనేజర్‌ చెప్పాడని, ఇకపై తనకు అలాంటి రెజ్యూమేలు పంపొద్దని మరో ట్వీట్‌లో కోరింది. ఇదిలా ఉండగా, వైరస్‌ మహమ్మారి కారణంతో టెన్నిస్‌ రంగంలో ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీలు రద్దయ్యాయి. అంతకుముందు ఫ్రెంచ్‌ ఓపెన్‌ కూడా వాయిదా పడింది. దీంతో టెన్నిస్‌ క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.