Editorials

మెక్సికోలో పూర్తిగా మారిపోయిన ఎమ్.ఎన్.రాయ్-Part 4

The life story of MN Roy-Roy In mexico-Innaiah narisetti

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే సమయానికి అమెరికా తన తటస్థ వైఖరిని మాని బ్రిటన్ వైపుకు మొగ్గు చూపింది. అంతటితో అమెరికాలో ఉన్న భారత విప్లవకారులకు, ముఖ్యంగా జర్మనీ సహాయంతో పోరాడాలనుకునేవారికి ఇబ్బందులు పెరిగిపోయాయి. అ తరుణంలో విచారణ జరిపి ఎమ్.ఎన్.రాయ్ ను మళ్లీ పిలుస్తామని, అప్పుడు హాజరు కావాలని, దేశం వదిలి వెళ్ళిపోవద్దని హెచ్చరించి మేజిస్ట్రేటు వదిలిపెట్టారు. అమెరికాలో వుండటం క్షేమం కాదని వెళ్ళిపోవాలని ఎమ్.ఎన్.రాయ్ దంపతులు నిర్ణయించుకున్నారు. పక్కనే వున్న కెనడాకు వెళ్ళడం సులభమే కాని, ఆ దేశం కూడా అమెరికాకు సన్నిహితం గనక, మెక్సికోకు వెళ్ళిపోవటం మంచిదని నిర్ణయించుకున్నారు. వారి వెంట తీసుకెళ్ళటానికి సామాన్లు ఏమీ లేవు. కేవలం స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యక్షుడు డేవిడ్ జోర్డాన్ స్టార్ ఇచ్చిన పరిచయ లేఖ మెక్సికోలో గవర్నర్ ను ఉద్దేశించి రాసినది మాత్రం ఉన్నది. అంతటితో న్యూయార్క్ నుండి మెక్సికోకు వెడుతున్న యామ్ ట్రాక్ రైలులో శాన్ ఆంటోనియో నగరానికి రెండు రోజులు ప్రయాణం చేసి వెళ్ళారు. అక్కడ నుండి రెండు గంటల ప్రయాణం చేసి, మెక్సికో సరిహద్దు చేరుకున్నారు. మెక్సికోకు వెళ్ళటానికి అవరోధాలేమీ లేవు. కనుక సులభంగానే వెళ్ళగలిగారు. తీరా మెక్సికోలో అడుగుపెట్టిన తరవాత వారికి అర్ధమయ్యింది ఏమంటే జనరల్ అల్వరాడో ఆధిపత్యం వహిస్తున్న యుకటాన్ రాష్ట్రం వెళ్ళాలంటే వెయ్యిమైళ్ళు పయనించవలసి వుంటుంది. కనుక అతనికి జోర్డాన్ ఇచ్చిన లేఖను అందజేసే ప్రయత్నం విరమించుకుని రాజధాని నగరం మెక్సికో సిటీకి వెళ్ళారు. ఎటుచూసినా అందరూ స్పానిష్ భాష మాట్లాడేవారు. రాయ్ దంపతులకు ఆ భాష రాదు. ఎలాగో తిప్పలు పడి హోటల్ జనీవాకు వెళ్ళి బస చేసారు. అక్కడ విదేశస్థులు ఎక్కువగా వస్తూ పోతూ వుంటారు. మొదటి రోజున భోజనం చేయటానికి సిద్ధపడి మెక్సికోలో మంచి వంటకాలు తెచ్చిపెట్టమని కొన్ని పేర్లు చెబితే, సరేనని అమెరికా ముద్ర వున్న టిన్నులు తెచ్చి ఇచ్చారు. అదేమంటే మంచి మెక్సికో ఆహారం అమెరికాలోనే దొరుకుతున్నదని చెప్పారు. అంతటితో ఆశ్చర్యపడి, బీఫ్ అడిగి తిన్నారు. అలా మొదలైంది వారి మెక్సికో వాసం మొదటినాడు.
అమెరికా నుండి తప్పించుకుని మెక్సికో వచ్చిన రాయ్ దంపతులకు కొత్తగా తెలిసిన వార్త ఏమంటే శాన్ ఫ్రాన్సిస్కోలో విచారణ జరిపి రాయ్ కు కోర్టు శిక్ష విధించింది. ఇండియా నుండి డెన్ హమ్ అనే పోలీసు అధికారి వచ్చి ఫిర్యాదు ఇచ్చి విచారణ జరిపించి శిక్షపడేటట్లు చేశారు. ఈ డెన్ హమ్ అధికారి కలకత్తాలో గుర్రపు స్వారీ ప్రాక్టీసుకు వచ్చేవారు. ఎమ్.ఎన్.రాయ్ కూడా అప్పట్లో నరేంద్రనాథ్ గా అదే గుర్రపు స్వారీ ప్రాక్టీసుకు వెళ్ళేవాడు. డన్ హమ్ పోలీసు అధికారని తెలిసి అక్కడికి వెళ్ళటం మానేశాడు రాయ్. అతనినే అమెరికా పంపించారన్నమాట. అయితే అమెరికాలో విధించిన శిక్ష అమలు జరగలేదు. గనుక చేసేది లేక డన్ హామ్ మెక్సికో కూడా వచ్చి అక్కడ ఏమీ చేయలేమని తెలుసుకుని వెళ్ళిపోయాడు.
ఎమ్.ఎన్. రాయ్ తన వద్ద వున్న లేఖను యుకటన్ గవర్నర్ అల్వారాడోకు అందజేయడం ఎలాగని అధికారులని అడిగాడు. ఆ విషయం తెలుసుకున్న గవర్నర్ బంధువు, త్వరలో అల్వరాడో రాజధానికి వస్తున్నాడని స్వయంగా లేఖ అందజేయడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పడంతో రాయ్ సంతృప్తి చెందాడు. గవర్నర్ పక్షాన ఆశ్చర్యకరంగా ప్రభుత్వ ఆర్ధిక శాఖ నుండి ఖర్చుల నిమిత్తం రాయ్ కు కొంత డబ్బు పంపిచారు. అది స్థానికంగా హోటల్ ఖర్చులకు తోడ్పడింది.
రాయ్ కలుసుకుందామనుకున్న జనరల్ అల్వరాడో రాష్ట్ర గవర్నరుగా కొన్ని పరిపాలనా ప్రయోగాలు చేశాడు. అవి జనాకర్షణకు గురయ్యాయి. తీరా పరిశీలిస్తే అన్ని విషయాల్లో ప్రభుత్వ గుత్తాధిపత్యం వహించడం ప్రధాన లక్షణంగా కనిపించింది. నాటి మెక్సికోలో అదే పెద్ద సంస్కరణగా జనానికి అనిపించి దానిని సోషలిజం అని పిలిచారు.
మెక్సికో రాజధానిలో రక్షణ శాఖామంత్రి నాటి దేశ అధ్యక్షుని బావమరిది. అతనితో ఇంటర్వ్యూ అడిగి జోర్డాన్ ఇచ్చిన లేఖ సంగతి రాయ్ తెలియపరిచారు. రాయ్ ను సగౌరవంగా మర్యాద చేసి ఆహ్వానించి కూచోపెట్టారు. తన దగ్గర వున్న లేఖను అతడికి అందజేయగా, వెంటనే లేఖను చింపి చదివి సంతృప్తిగా రాయ్ తో యుకటాన్ గవర్నర్ తో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాయ్ ప్రభుత్వ అతిథి అని మెక్సికోలో ఉన్నంతకాలం క్షేమసమాచారాలు చూసే బాధ్యత తమదేనని వెల్లడించారు. అదంతా రాయ్ దంపతులకు సంతోషాన్నిచ్చింది. అంతేగాక హోటల్ రూముకు కొంత డబ్బు కూడా పంపించారు.
ఈలోగా మెక్సికో స్థానిక దినపత్రిక ఎడిటర్ రాయ్ దంపతులను వారి కార్యాలయానికి రావలసిందిగా ఆహ్వానించారు. ఆ పత్రిక పేరు ది ప్యూపిల్. అది స్థానికంగా బహుళ ప్రచారంగల పత్రిక. తమ పత్రికకు ఇండియాను గురించి వ్యాసాలు రాయవలసిందిగా ఎడిటర్ కోరారు. అంతేకాక హోటల్ లో ఎక్కువ రోజులు వుండవద్దని అదేమంత క్షేమకరమయిన ప్రదేశం కాదని హెచ్చరించారు. ఆ ప్రకారమే రాయ్ దంపతులు ఒక ఇల్లు తీసుకుని తమ నివాసం మార్చారు. కలోనియా రోమా అని వారి ఇంటిపేరు. ఉత్తరోత్తరా సుప్రసిద్ధంగా మారింది. హోటల్ నుండి మారకముందు ఒక వ్యక్తి రాయ్ ని కలుసుకుని, వారి కోసం ఎదురు చూస్తున్న ఇరువురు మిత్రులు ఉన్నారని వారిని కలుసుకోవడానికి రమ్మని పిలిచారు. ఎందుకైనా మంచిదని రాయ్ జాగ్రత్తవహించారు. తరువాత బయటపడిందేమంటే రాయ్ ను రహస్యంగా అక్కడ నుండి తీసుకువెళ్ళటానికి కుట్ర పన్ని ఇరువురు వ్యక్తులు వచ్చారని, దేశం నుండి రాయ్ ను పట్టుకెళ్ళాలని పన్నాగంతో ప్రవేశించారని తెలిసింది. అయితే రాయ్ వెళ్ళలేదు గనక ప్రమాదం జరగలేదు.
జావాలో ఆయుధాలు, డబ్బు సేకరించటానికి రాయ్ లోగడ రెండు పర్యాయాలు వెళ్ళారు. జర్మనీవారు అక్కడ రాయ్ కు అందిస్తామన్న ఆయుధాలు ఇవ్వలేకపోయారు. వారే మళ్ళీ మెక్సికోలో రాయ్ ని కలిసి తమ హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. దానికి గాను రాయ్ తీరానికి వెళ్ళవలసి వుంటుందని ఆయన్ను తీసుకువెళ్ళటానికి వస్తున్న ఓడ వివరాలు చెప్పారు. విరమిద్దామనుకున్న ప్రయత్నాన్ని మళ్ళీ చేపట్టవలసిన పరిస్థితి వచ్చింది. రాయ్ ని కలిసిన జర్మనీ వారు కొంత డబ్బును అప్పగించి రేవుపట్టణానికి వెళ్ళటానికి సిద్ధపడమని చెప్పారు. రాయ్ పథకం తెలుసుకుని, అంతమంచి పథకాన్ని చైనాలో జర్మన్ అధికారులు ఎందుకు స్వీకరించలేదో ఆశ్చర్యపోయారు. మొత్తం మీద కథ మొదటికి వచ్చింది. ఇండియాలో మొదలైన ఆయుధ సేకరణ ప్రయత్నం తిరిగి చేపట్టడానికి అయిష్టంగానే రాయ్ అంగీకరించాడు. మెక్సికోలో వున్న ఒక రేవు పట్టణానికి వెళ్ళి ఓడ ఎక్కి చైనా పయనించవలసి వున్నది. అందుకు సిద్ధపడి బయల్దేరాడు.
పసిఫిక్ సముద్ర తీరాన ఉన్న గాడల్ జరా నగరానికి రైల్లో బయల్దేరారు. అక్కడ ఒక హోటల్ లో బస చేసి మర్నాడు అర్ధరాత్రి మరో చిన్న రైల్లో ప్రయాణించారు. తోవలో దోపిడీదారులు దండయాత్ర చేశారు. కాల్పులు జరిగాయి. సద్దుమణిగిన తర్వాత మంజానిల్ లో రేవు పట్టణానికి చేరారు. దాని పేరు సాలీనా క్రూజ్. త్వరలో పసిఫిక్ సముద్ర తీరానికి జపాను ఓడ వస్తుందని దానిలో బయల్దేరి వెళ్ళవలసి వుంటుందని చెప్పారు. కొద్దిరోజులు అక్కడ వేచి వున్నారు. ఒకనాడు సందేశం వచ్చింది. అక్కడికి రావలసిన ఓడ చిలీ నుండి హోనోలులుకు వెళ్ళిపోయిందని చెప్పారు. మరొక నెల రోజులకు గాని ఇంకొక ఓడ రాదన్నారు. అంతటితో చైనా వెళ్ళే ప్రయత్నం విరమించి రాయ్ దంపతులు మళ్ళీ మెక్సికో చేరుకున్నారు. జర్మన్ ఆయుధాలు, డబ్బుతో ఇండియాలో తిరుగుబాటు చేయించాలనే ప్రయత్నానికి స్వస్తి పలికారు.
మెక్సికోలో రాయ్ దంపతులను సెనోరిటా, సెనోరా అని పిలిచేవారు. వారివద్ద వున్న ధనం కారణంగా ఇంటికి కాపలా నిమిత్తం ఒక జర్మన్ అల్సేషన్ కుక్కను పెంచుకున్నారు. ఇల్లు పెద్దది కావడం ఊరి వెలుపల వుండడం వలన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ కుక్క ఒక సంవత్సరానికే నిమోనియాతో చనిపోయింది. రాయ్ తన దగ్గర ఎప్పుడూ పిస్టల్ అట్టిపెట్టుకునేవాడు.
మెక్సికోలో స్పానిష్ భాష అవసరం గనుక ఒక యూనివర్సిటీ టీచర్ ని రాయ్ దంపతులు భాషాబోధనకై నియమించారు. ఆ టీచరు పేరు గార్డియోలా. అతడు చాలా సమర్ధవంతంగా చెప్పినందున త్వరగానే వారికి భాష పట్టుబడింది. ఆ టీచరు ఆనాడు మెక్సికోలో ఛెస్ ఛాంపియన్ కూడా. రాయ్ అతనితో ఆట నేర్చుకుని ఆశ్చర్యకరంగా అతన్ని కొన్నిసార్లు రాయ్ ఓడించాడు కూడా. గుర్రపు స్వారీ స్పెయిన్ లో సర్వసాధారణం. రాయ్ కూడా తరచు స్వారీ చేసేవాడు, ఈత కొట్టేవాడు కూడా.
రాయ్ ను వ్యాసాలు రాయవలసిందిగా ది ప్యూపిల్ పత్రిక వారు, విమెన్ పత్రిక వారు అడిగారు. రాయ్ రాసిన వ్యాసాలు పాఠకులను ఆకట్టుకున్నాయి. ఎల్ హెరాల్డో పత్రికలో రాయ్ రాసిన వ్యాసాలు నాటి మెక్సికో అధ్యక్షుడు కరంజాకు నచ్చాయి.
అప్పుడే రష్యాలో కమ్యూనిస్టులు విప్లవ పోరాటాలు చేయడం, ఆ విషయాలు మెక్సికోలో తెలిసి చాలామందిని ఆకట్టుకోవడం ఆనాటి పెద్ద మార్పు. మెక్సికో ఒకవైపున సోషలిస్టు భావాలకు ఆకర్షితమవుతుండగా మరొకవైపు అమెరికాతో సత్సంబంధాలు లేకుండా పోయాయి. ఎమ్.ఎన్.రాయ్ దంపతులు మెక్సికోలో సోషలిస్టు పార్టీని బలపర్చాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఛాంబర్ ఆఫ్ డిప్యూటీ అధ్యక్షులు డాన్ మాన్యువల్ రాయ్ పట్ల ఆకర్షితులై మెక్సికో అధ్యక్షుడికి పరిచయం చేశాడు. అది సోషలిస్టు పార్టీ స్థాపించడానికి, బలపర్చడానికి తోడ్పడింది. రాయ్ పథకాలను అధ్యక్షుడు కరంజా మెచ్చుకున్నాడు. సోషలిస్టు పార్టీ ద్వారా ఎలా సంస్కరణలు తీసుకురావాలో రాయ్ వివరంగా చెప్పారు. అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే తీరు కూడా వివరించారు. ఇదంతా అధ్యక్షుడికి నచ్చగా, సోషలిస్టు పార్టీ స్థాపనకు తొలి అంతర్జాతీయ సమావేశానికి దారితీసింది. మెక్సికో సోషలిస్టు పార్టీ మహాసభ జరపటానికి నిర్ణయించి కేవలం మెక్సికో నుండే కాక, దక్షిణ అమెరికా దేశాల నుండి ప్రతినిధులను ఆహ్వానించారు. ఆ సమావేశం జయప్రదంగా జరగటమే గాక రాయ్ ను పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. మెక్సికో బయట వ్యక్తిని పార్టీ ప్రధాన కార్యదర్శిని చేయటం చారిత్రాత్మక పరిణామం. ఇది ఆనాటి రష్యా దృష్టికి వెళ్ళింది. రాయ్ ప్రతిష్ఠ బాగా పెరిగిపోయింది. రాయ్ కు అండగా మెక్సికోలోని సొనొరా రాష్ట్ర నాయకుడు తోడ్పడ్డాడు. రాయ్ రాష్ట్రంలో పర్యటించి సోషలిస్టు భావాలు వివరించాడు. ఈ వార్తలన్నీ రష్యాకి చేరగా వారు రాయ్ దంపతుల పట్ల ఆసక్తి కనబరిచారు.
కాథలిక్ బిడ్డకు కమ్యూనిస్టు నామకరణం
మెక్సికోలో సోషలిస్టు పార్టీ బలపడుతుండగా మరొకవైపు కాథలిక్ మతం చాలా ప్రభావంతో వున్నది. పార్టీలో శక్తివంతమైన జాన్ బాప్టిస్టా ఫ్లోస్ సోషలిస్టు నాయకుడిగా కుమారుణ్ణి కన్నాడు. అతనికి పేరుపెట్టవలసిన సమయం వచ్చింది. సోషలిస్టు నాయకుల పేర్లు కావాలని తండ్రి, కాథలిక్ మత సంబంధమైన పేరు కావాలని తల్లి కోరుకున్నారు. వారి మధ్య వచ్చిన తగాదా తీర్చడానికి సోషలిస్టు పార్టీ పూనుకొన్నది. రాయ్ ఉంటున్న ఇల్లు మధ్య హాలులో చర్చి వలె ఏర్పాటు చేసి నామకరణ ఉత్సవాన్ని జరపదలిచారు. అక్కడ తాత్కాలిక క్రైస్తవ పురోహితుడుగా సోషలిస్టు ప్రముఖుడైన చార్లీని పెట్టారు. కాథలిక్ చర్చి వాతావరణంలో కొవ్వొత్తులు వెలిగించి, మార్క్స్ రాసిన కాపిటల్ గ్రంథానికి ఎర్ర రిబ్బను చుట్టి దానినే బైబిలు వలె పీఠం పై పెట్టారు. పేరు పెట్టవలసిన సమయం ఆసన్నమయింది. అటు కమ్యూనిస్టులకు ఇటు కాథలిక్ లకు తృప్తినిచ్చే పోరు కావాలి. మానవేంద్రనాథ్ రాయ్ అని పెట్టడానికి అధికసంఖ్యాకులు అంగీకరించారు. క్రైస్తవ పీఠాధిపతిగా చార్లీ పేరుని నిర్ధాకరిస్తూ కారల్ మార్క్స్ ఫ్లోర్స్ అని ఉభయకుశలోపరిగా పెట్టాడు. రాయ్ దంపతుల ఇంట్లో జరిగిన ఈ రెడ్ బాప్టిజాన్ని స్థానిక పత్రిక హెల్ హెరాల్డో మర్నాడు ప్రముఖంగా ప్రచురించింది.
మొత్తం మీద ఎమ్.ఎన్. రాయ్ దంపతులు మెక్సికో సమాజంలో సోషలిస్టు నాయకులుగా, పత్రికా రచయితలుగా అచిరకాలంలోనే పేరు తెచ్చుకున్నారు. రాయ్ దంపతులు స్పానిష్ లో రాయటం, మాట్లాడటం సమాజంలో కీలక పాత్ర వహించటం గమనార్హం. ఇదంతా రష్యాలో ప్రముఖంగా వ్యాపించి కమ్యూనిస్టులను దృష్టి పెట్టేటట్లు చేసింది. రాయ్ వ్యాసాలు రచనలు జనాన్ని ఆకర్షించేటట్టు ఉండటమే గాక ఆలోచింప చేయటం ముఖ్యాంశం. మన్రో సిద్ధాంతంపై రాయ్ విశ్లేషణ రాజకీయ పరిశీలకులకు పరిశోధనాంశమైంది. ఇర్విన్ గ్రెన్ విచ్ అనే రచయిత రాయ్ భావాలను ఇష్టపడి ఇండియాలో రాయ్ జీవితంపై ఒక కథ కూడా రాశాడు. అమెరికా అధ్యక్షుడు కరంజాతో, ఉత్తరోత్తరా అధ్యక్షుడు కాబోయే కాలెస్ తో రాయ్ దంపతులు సన్నిహితులయ్యారు. అనేక సభలలో రాయ్ స్పానిష్ లో ఉపన్యాసాలు చేసేవాడు. ఈ పరిణామాలతో రాయ్ కు భారతదేశ సంబంధాలు తెగిపోయాయి. అక్కడి వార్తలేమీ తెలిసేవి కావు. జర్మనీ ఆయుధాలు సేకరించాలనే ప్రయత్నం వృధా అని రాయ్ భావించాడు. ఇండియాలో స్వాతంత్ర్య పోరాటంలో ఎవరు పనిచేస్తున్నారో, అందులో విప్లవకారులెవరో రాయ్ కు సమాచారమేమీ లేదు. ఆ దశలో అతని జీవితంలో కొత్త మలుపులు వచ్చాయి. అవి అనూహ్యంగా అతనిని అంతర్జాతీయ స్థాయికి పెంచాయి. మెక్సికోలో అమలు జరుగుతున్న జాతి విచక్షణ నీగ్రోల పట్ల దారుణంగా ఉండటాన్ని రాయ్ దంపతులు కళ్ళారా చూశారు.
ఇండియాకు స్వాతంత్ర్యం తీసుకురావటంలో జర్మనీవారి ఆయుధాలు, డబ్బు సహాయపడతాయని ఆశించి విఫలప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి ఎమ్.ఎన్.రాయ్ కాగా తరువాత 27 సంవత్సరాలకు సుభాస్ చంద్రబోసు అలాంటి తలపుతో జర్మనీ, జపాను వారి అండతో బ్రిటీషు వారిని వెళ్ళగొట్టాలని ప్రయత్నించి దారుణంగా విఫలమయ్యాడు. వీరిద్దరి నుండి నేర్చుకోవలసిన చరిత్ర చాలా వున్నది.