* ఈ రోజు అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. రానున్న 21 రోజుల పాటు ఈ లాక్‌డౌన్ కొనసాగుతుందని ప్రధాని స్పష్టం చేశారు. సంకట సమయంలో దేశమంతా ఒక్కటిగా నిలిచిందని.. భారతీయులు జనతా కర్ఫ్యూని విజయవంతం చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలందరూ సామాజిక దూరం పాటించాలి. ఒకరికొకరు దూరంగా ఉంటూ ఇళ్లలోనే ఉండాలి. ఈ విధంగా ఉంటే తప్ప ఈ గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు. అభివృద్ధి చెందిన దేశాలు కూడా నిస్సహాయ స్థితిలో నిలిచిపోయాయి. కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సవాలు విసురుతూనే ఉంది. కరోనా వ్యాప్తి ఎలా విస్తరిస్తుందో వార్తల్లో చూస్తున్నాం’ అని ప్రధాని మోదీ వివరించారు.
* రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్చ్ అయ్యారని చెప్పారు. మరో 114 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రగతిభవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష, జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్మీని రంగంలోకి దించడం, 24 గంటల కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేతలాంటి ఉత్తర్వులు అవసరమా? అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని.. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా వైరస్ నిరోధానికి కట్టుబడి ఉండాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
* ఊహించినట్టే జరిగింది. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ‘‘ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాను. ఐఓసీ అధ్యక్షుడు బాచ్ దీన్ని అంగీకరించారు’’అని షింజో మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ భయంతో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే.
* కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న 21 రోజులు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.
* పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో ముగ్గురు చేరారు. తెలంగాణకు చెందిన ఓ పోలీసు అధికారి కుమారుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. ఈనెల 18న పశ్చిమ గోదావరి జిల్లా రాఘవాపురానికి చెందిన ఓ చిన్నారి పుట్టినరోజు వేడుకకు ఆ యువకుడు హాజరయ్యాడు. అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయిన ఆ యువకుడి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా ఈ నెల 22న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయం తెలియడంతో పశ్చిమ గోదావరి జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
* విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చేవాళ్లు అధికారులకు సహకరించాలని.. లేకపోతే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. కరోనా నివారణకు విశాఖ జిల్లాలో 20 కమిటీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. మంగళవారం విశాఖలో మరో ఇద్దరు మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. నగరంలోని సీతమ్మధార, గాజువాక, అనకాపల్లి ప్రాంతాలను హైరిస్క్ జోన్లగా గుర్తించినట్లు ఆయన వివరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలకు చేపడుతున్నామన్నారు. విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1470 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. కరోనా నివారణపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.
* తిరుమలలో జనసంచారం లేకపోవడంతో శేషాచల అటవీ ప్రాంతంలోని జంతువులు తిరుమలలోకి ప్రవేశిస్తున్నాయి. రాత్రి సమయంలో చిరుతలు, ఎలుగుబంట్లు బయటకు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పులులు, జింకలు కూడా తిరుగుతున్నట్లు సమాచారం. కల్యాణవేదిక, ముల్లగుంటలో చిరుత సంచారం ఉండగా, నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు రాత్రి వేళల్లో ఘాట్‌రోడ్డులో వాహనాలను నిలిపివేశారు. స్థానికులు ఇళ్లకే పరిమితం కావాలని పోలీసులు సూచించారు. మరోపక్క తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అక్టోపస్ బృందాల పహారా కొనసాగుతోంది. ఉన్నతాధికారులు నిత్యం భద్రత, ఇతర కార్యకలాపాలు, స్వామివారికి కైంకర్యాలు పర్యవేక్షిస్తున్నారు.
* ప్రపంచమంతా కరోనా వైరస్‌ను ఎలా కట్టడి చేయాలా అని బాధపడుతోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్ అవుతున్నాయి. మూడో దశలోకి చేరితే పరిస్థితేంటా అని భయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చైనాలో మరో వైరస్‌తో ఓ వ్యక్తి మృతిచెందడం అందరినీ కలవపరుస్తోంది. ఆ వైరస్‌కు టీకామందు ఉండటం ఊరట కలిగించే అంశం. చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి హంటా వైరస్‌తో మృతిచెందాడు. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ మీడియా సంస్థ ‘గ్లోబల్ టైమ్స్’ ట్విటర్ ద్వారా తెలియజేసింది. సోమవారం షాండోగ్ ప్రావిన్స్‌లో బస్సులో ప్రయాణిస్తుండగా అతడు చనిపోవడం గమనార్హం. ఈ వైరస్ లక్షణాలు సైతం ఫ్లూ, కరోనాని పోలివుండటం గమనార్హం.