బియ్యం కడిగిన నీటిని మొక్కలకు పోయడమో, వృథాగా పారబోయడమో చేస్తుంటాం. అలా కాకుండా ఈ నీటిని కేశ, చర్మ సంరక్షణకూ ఉపయోగించవచ్చు.
జుట్టు పెరగాలంటే…
బియ్యం కడిగిన నీటిలో విటమిన్ – బి, సి, ఇ, అమైనో ఆమ్లాలుంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి.
నిర్జీవంగా మారితే…
జుట్టు పొడిబారి జీవం లేనట్టుగా కనిపిస్తుంటే బియ్యం కడిగిన నీటిని పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికోసారి చొప్పున కొన్ని వారాలపాటు ఇలాచేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
మెరవాలంటే…
బియ్యం కడిగిన నీటిని రాత్రంతా అలాగే ఉంచి మర్నాడు జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మెరుస్తూ ఉంటుంది.
మాడు ఆరోగ్యానికి…
ఈ నీటితో జుట్టును శుభ్రం చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. చుండ్రు, దురద లాంటి సమస్యలుంటే క్రమంగా తగ్గిపోతాయి.
ముఖం మెరవాలంటే…
జుట్టుకే కాదు చర్మ సౌందర్యానికీ ఈ నీళ్లు ఉపయోగపడతాయి. ఈ నీటిని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడుక్కుంటే చర్మం మెరుస్తుంది. ముఖం మీద మచ్చలుంటే క్రమంగా తగ్గుతాయి. చర్మం సున్నితంగా మారడమే కాకుండా మోము కాంతిమంతమవుతుంది.