Politics

సరుకులు అందించే బాధ్యత మాది

KTR Reviews COVID19 Shelters

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వసతిలేని వారికి నైట్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కరోనా కంట్రోల్‌ రూమ్‌లో పురపాలక శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వసతి లేని వారికి నైట్‌షెల్టర్లలో భోజన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వసతి గృహాల్లో నైట్‌షెల్టర్లకు ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ ఆదేశించారు. భోజనాన్ని రూ.5కే పగలూ, రాత్రి అందించాలని సూచించారు. అత్యవసర వైద్యానికి ఎవరైనా సాయం కోరితే ప్రత్యేక చొరవ తీసుకోవాలని.. ప్రస్తుతం ఉన్న 150 కేంద్రాలకు అదనంగా నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. నిత్యావసరాలతో పాటు ఔషధాలు, పాలు, కూరగాయలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చని ప్రజలకు కేటీఆర్‌ సూచించారు. అధికారులతో సమీక్షకు ముందు గోల్నాకలో నైట్‌షెల్టర్‌ను మంత్రి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు.