‘కరోనా లైవ్’ సినిమా రివ్యూ
జాన్రా: థ్రిల్లర్ / హారర్ / సందేశాత్మకం
తారాగణం:
హీరో: ‘కరోనా’ (కొత్త పరిచయం)
హీరోయిన్: ప్రకృతి మాత (ప్రతిరోజూ మన ద్వారా వేధింపబడుతున్న కారెక్టరే)
విలన్: మానవజాతి
దర్శకుడు: కలికాల ఖర్మ
బాగా ఫేమస్ అయిన హీరో డైలాగ్:
కంటికి కనబడకుండానే దుమ్మురేపుతా!
కథ సారాంశం:
విలన్ (మానవాళి) రోజూ ఎన్నోరకాలుగా
హీరోయిన్ (ప్రకృతి మాత) ని హింసిస్తూ ఉంటాడు.
విసిగిపోయిన హీరోయిన్ విలన్ కి బుద్ధి
చెప్పాలనుకుంటుంది. కరోనా అనే సరికొత్త వైరస్ ని
వదిలి విలన్ని ముప్పుతిప్పలు పెడుతుంది.
ఆ మధ్య హిట్ అయిన ‘ఈగ’ సినిమాలో
ఈగ పాత్రను గుర్తుచేస్తుందీ కరోనా క్యారెక్టర్.
నేనే గొప్ప అని అప్పటివరకూ కాలరెగరేసిన
విలన్, కంటికి కూడా కనబడని ఆ కరోనా సృష్టించే
ఉత్పాతానికి బెంబేలెత్తిపోతాడు. భయంతో విలన్
వణికిపోయే సన్నివేశాలు చాలా సహజంగా
చిత్రీకరించబడ్డాయి. భవిష్యత్ దర్శనాన్ని తలపించే
ఆ దృశ్యాలు ఆలోచనాపరులకు కంటతడి పెట్టిస్తాయి.
కరోనా ధాటికి పిట్టల్లా రాలిపోతున్న దృశ్యాలు
చూసినప్పుడు…ఏందుకో తెలీదు…మనం ఇష్టంగా
కాల్చుకు తినే పిట్టలు గుర్తొచ్చాయి.
సందేశం:
1. ప్రకృతికి అనుగుణంగా జీవించరా పాడు మానవా!
2. బతుకు, బతకనివ్వరా బరితెగించిన మనిషీ!
3. అనవసరపు వినియోగం, ఆర్భాటం తగ్గించరా వెర్రి వెధవాయ్!
సినిమాలో చాలా సటుల్ గా, అంతర్లీనంగా ఉంది ఈ ‘ఆదేశం’.
క్లైమాక్స్ (స్పాయిలర్!):
విలన్ అష్టకష్టాలు పడతాడు, ఎలాగోలా
తప్పించుకుంటాడు. క్లైమాక్స్‌లో వాడి మొహం
చూస్తే ఇంకా బుద్ధి వచ్చినట్లు కనిపించదు,
కుక్క తోక వంకరలా. అందుకే సీక్వెల్
ఉంటుందేమో అంటున్నారు విమర్శకులు!
ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది?:
తొలి టీజర్ చైనా వుహాన్‌లో విడుదలైనప్పుడు
అందరూ మామూలు సినిమానే అనుకున్నారు.
అయితే, రెండు నెలలు తిరిగేలోపే ప్రపంచవ్యాప్తంగా
ఎన్నో దేశాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది.
ప్రేక్షకులు విరగబడి చూస్తుండటంతో దేశదేశాలు
ఈ సినిమాను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.
రేటింగ్: ఫైవ్ స్టార్స్!!