ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర సర్వే చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంట్లో ఉన్నవారి ఆరోగ్య వివరాలను నమోదు చేయాలని నిర్దేశించారు. వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లను దీని కోసం వినియోగించాలని సూచించారు. గురువారంలోగా ఈ సర్వే పూర్తి చేయాలని తెలిపారు. తర్వాత కూడా తాజా వివరాలను ఎప్పటికప్పుడు పొందుపరచాలని పేర్కొన్నారు. సర్వే సమగ్రంగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించగలమని చెప్పారు. కరోనా వ్యాప్తి- నియంత్రణ చర్యలపై మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
* ఇప్పటివరకూ విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చినవారు, వారితో కలిసిన వ్యక్తుల గురించే కాకుండా ప్రజలందరిపై దృష్టిపెట్టాలి.
* ప్రజలంతా ఇళ్లలోనే ఉంటూ లాక్‌డౌన్‌కు సహకరించాలి.
* ఇళ్లలో ఉండటం వల్ల సర్వేకు సహకరించిన వారవుతారు
* రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రజల నుంచి పూర్తి సహకారం ఆశిస్తున్నాం.
* కరోనా వ్యాప్తిని నిరోధించాలి. ఈ వైరస్ లక్షణాలున్నవారు ఎవరైనా ఉంటే వారికి సత్వరమే వైద్యసాయం అందించాలి.
* రాష్ట్రంలో ఇప్పటివరకూ పాజిటివ్‌గా తేలిన కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారితో సన్నిహితంగా ఉన్నవారివే.
* ఇది సామాన్య ప్రజలకు వ్యాపించకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్య శాఖ, ప్రభుత్వం ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించాలి
* రెండోసారి సర్వే ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించుకుని ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుంది.
* కరోనా లక్షణాలు ఉన్నవారు విధిగా హోం ఐసోలేషన్ పాటించాలి.
ఏపీలో సమగ్ర సర్వే
Related tags :