Sports

మహిళా IPL ప్రారంభించాలి

Mithali Raj Wants BCCI To Begin Women IPL

మహిళల ఐపీఎల్‌ ప్రారంభానికి బీసీసీఐ ఎల్లకాలం వేచిచూడొద్దని టీమ్‌ ఇండియా మహిళ వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్‌ అభిప్రాయపడింది. పురుషులంత కాకపోయినా పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ప్రారంభించాలని కోరింది. ఇటీవల ఓ సందర్భంలో ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడిన మిథాలి ఇలా పేర్కొంది. ‘పరిమిత స్థాయిలోనైనా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్‌ ఆడించాలి. పురుషుల ఐపీఎల్‌తో పోలిస్తే కొన్ని నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలి. నలుగురు విదేశీ క్రికెటర్లే కాకుండా తొలి సీజన్‌లో ఐదు లేదా ఆరుగురితో ఆడించాలి’ అని మిథాలీ తెలిపింది. పూర్తిస్థాయి ఐపీఎల్‌ ఆడేందుకు భారత్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేకపోయినా ప్రస్తుత ఫ్రాంఛైజీలు జట్లను తీసుకుంటే ఆ సమస్యను అధిగమించొచ్చని టీమ్‌ఇండియా కెప్టెన్‌ అభిప్రాయపడింది. ‘దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేరనే విషయం నాకూ తెలుసు. అయితే, ఇప్పుడున్న ఫ్రాంఛైజీలు ఐదు లేదా ఆరు కొత్త జట్లను తయారు చేస్తే సరిపోతుంది. ఎలాగూ బీసీసీఐ వద్ద నాలుగు జట్లున్నాయి. ఈ విషయంపై ఎల్లకాలం వేచిచూడొద్దు. ఏదో ఒక సందర్భంలో ముందడుగు వేయాలి. ఏటా కొనసాగిస్తూ మెల్లమెల్లిగా నలుగురు విదేశీయుల సూత్రాన్ని అవలంబించాలి’ అని వివరించింది. అలాగే, టీ20 ప్రపంచకప్‌లో సత్తా చాటిన యువ సంచలన బ్యాటర్‌ షెఫాలీవర్మను వన్డేల్లో కొనసాగించాలని మిథాలీ పేర్కొంది. ప్రతిభకు వయసు అడ్డంకి రాకూడదని వెల్లడించింది.

Image result for mithali ipl