DailyDose

జులుం ప్రదర్శించిన ఎస్ఐని సస్పెండ్ చేసిన డీజీపీ-తాజావార్తలు

AP DGP Gautam Sawang Suspends SI For Beating Individuals-Telugu Breaking News

* స్వీయ నిర్బంధం కాలేదని ఇద్దరిని చితక్కొట్టిన ఎస్ఐని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే… పశ్చిమగోదావరి జిల్లా పెరవలిలో ఓ యువకుడు స్వీయ నిర్బంధం కాలేదని పెరవలి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ లాఠీ ఛార్జి చేశారు. అక్కడే ఉన్న అతని తండ్రిని కూడా విచక్షణారహితంగా కొట్టారు. ఎస్‌ఐ లాఠీతో విచక్షణా రహితంగొ కొడుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం డీజీపీ దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. పెరవలి ఎస్‌ఐపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలి కానీ దాడిచేయడం కరెక్ట్‌ కాదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

* రాష్ట్రంలో ఇప్పటి వరకు 59 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఒకరు పూర్తిగా కోలుకుని వెళ్లారని.. ప్రస్తుతానికి 58 మందికి చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. హోం క్వారంటైన్‌తో పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్లలో సుమారు 20వేల మంది పర్యవేక్షణలో ఉన్నారు. ఈ ఒక్కరోజే 10 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని సీఎం తెలిపారు. ప్రగతిభవన్‌లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు.

* వచ్చే ఆర్థిక సంవత్సరం 2020-21లో 3 నెలలకు సంబంధించిన బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. సీఎం జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా నివారణకు ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేస్తోంది. దాదాపు 28వేల మంది విదేశీయులు రాష్ట్రానికి వచ్చారు. 104 హెల్ప్‌లైన్‌ నంబర్‌ ఏర్పాటు చేశాం… 24గంటలు పనిచేస్తుంది. కరోనా బాధితుల కోసం ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేటెడ్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశాం. జిల్లా స్థాయిలో 200 పడకల ఆసుపత్రిని సిద్దంగా ఉంచాం.’’ అని మంత్రి వివరించారు.

* రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లోనూ వైద్య సదుపాయాలు ఉన్నాయని రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన కోఠిలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో వైద్య శాఖ ఉన్నతాధికారులు, వైద్య కళాశాలల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 26 రోజుల్లో 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని, కొందరిని రెండు..మూడు రోజుల్లో డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

* మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ సినిమా నుంచి స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ‘ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్లు ఉంటది.. కలబడితే యేగు సుక్క ఎగబడినట్లు ఉంటది. ఎదురుబడితే సావుకైనా చెమట ధార కడతది. బాణమైనా, బందూకైనా ఆనికి బాంచన్‌ ఐతది. ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు’’ అంటూ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తూ, ఎన్టీఆర్‌ వాయిస్‌తో విడుదల చేసిన వీడియో అదిరిపోయింది. ముఖ్యంగా నేపథ్యంలో ఎన్టీఆర్‌ తన గంభీరమైన వాయిస్‌ వింటుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

* భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) చికిత్స కోసం వాడుతున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ప్రభుత్వం షెడ్యూల్‌ హెచ్‌1 ఔషధాల జాబితాలోకి చేర్చింది. ఈ మేరకు కేంద్రం గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ కలిగిన ఔషధాలను సాధారణంగా మలేరియా చికిత్సలో ఉపయోగిస్తారు. కాగా, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నయం చేయటానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ఇటీవల ప్రకటించింది.

* ఇప్పటికే దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. రాష్ట్రంలో ఈ మహమ్మారి కారణంగా నలుగురు మరణించారు. ఇప్పటికే అక్కడ 130 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా తాజాగా మరో ఐదు కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో నాలుగు కేసులు నాగ్‌పూర్‌లో, మరోకేసు గోండియాలో నమోదయ్యాయి. ఇదిలా ఉంటే వేలకొద్దీ మాస్కులను నల్లబజారులో అమ్మడానికి ఉంచిన గోదాంపై దాడిచేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

* కాల పరిమితితో కూడిన రుణ వాయిదాల చెల్లింపులపై భారతీయ రిజర్వు బ్యాంకు మూడు నెలల పాటు మారటోరియానికి అనుమతి ఇచ్చింది. మార్చి 1, 2020 నుంచి మూడు నెలల వరకు ఇది వర్తిస్తుంది. జాతీయ, ప్రాంతీయ, గ్రామీణ, సహకార బ్యాంకులు, గృహ రుణాలు అందజేసే సంస్థలు, ఎన్‌బీఎఫ్‌సీలు దీని పరిధిలోకి వస్తాయి. కాగా, ఈ ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ చేయాలా? లేదా అని నిర్ణయించుకొనేది బ్యాంకులే. ఆ సంస్థలు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే చాలామందికి మారటోరియం వార్త తెలిసినప్పటి నుంచి కొన్ని సందేహాలు కలిగాయి. ఈ నెల వాయిదాను బ్యాంకు పరిగణించిందో లేదో ఎలా తెలుస్తుంది? క్రెడిట్‌కార్డు రుణ వాయిదాలకు ఇది వర్తిస్తుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి.

* ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై దేశం చేస్తున్న పోరాటానికి భారత ఆర్మీ కూడా సిద్ధమైంది. ఈ పోరాటంలో ప్రభుత్వానికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవణే ప్రకటించారు. ‘ఆపరేషన్‌ నమస్తే’ పేరుతో కొవిడ్‌-19కు వ్యతిరేకంగా జరిగే పోరులో తాము భాగస్వాములౌతామని వెల్లడించారు. గతంలో ఆర్మీ చేపట్టిన అన్ని ఆపరేషన్లలో విజయం సాధించామని..ఈ ఆపరేషన్‌లో కూడా తాము తప్పక విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

* ఆర్థిక వ్యవస్థ, సామాన్య ప్రజలపై కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్‌బీఐ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను పలువురు ప్రముఖులు స్వాగతించారు. మధ్య తరగతి, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్‌బీఐ నేడు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. దీంతో ద్రవ్య లభ్యత పెరుగుతుంది. రుణాలు చౌకగా లభిస్తాయి. ఇది మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

* ప్రపంచమంతా ఇప్పుడు కరోనా వైరస్‌తో అల్లాడిపోతుంటే.. 1992 ప్రపంచకప్‌ ఫైనల్‌ల్లో తనకు గుర్తు తెలియని వైరస్‌ సోకిందని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ మియాందాద్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో తలపడిన నాటి ఫైనల్లో తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు చాలా నీరసించిపోయానని చెప్పాడు. ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలో పాకిస్థాన్‌ ఇంగ్లిష్‌ జట్టును ఓడించి తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ జరిగి బుధవారం నాటికి 18 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మియాందాద్‌ నాటి అనుభవాల్ని గుర్తు చేసుకున్నాడు. ఆ వైరస్‌ వల్ల తనకు చెమటలు పట్టేవని, తన శరీరం శక్తిని కోల్పోయిందని తెలిపాడు.