కుబేరులు దానం చేయడం గొప్ప కాదు. ఓ సామాన్యుడు చేయడమే గొప్పవిషయం. కరోనా నేపథ్యంలో ఎందరో సినీ తారలు, వ్యాపార ప్రముఖులు విరాళాలు ఇస్తున్నారు. ఆ సహాయం మరవలేనిది. కానీ ఒక సాధారణ రైతు తన పంటను అమ్మితే వచ్చినడబ్బంతా సాయం చేయడం మెచ్చదగిన విషయం. నలుగురిలో స్ఫూర్తి నింపే ఈ కథనం తప్పక చదవాలి…
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గడగడలాడిస్తున్నది. ఈ నేపథ్యంలో కొవిడ్-19 ప్రబలకుండా పలు దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. దీంతో రోజువారీ కూలీలు, పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఇలాంటివాళ్లను ఎవరు ఆదుకుంటారు? వారికి చేతనైన సాయం చేయడం ఆపత్కాలంలో తన బాధ్యతగా గుర్తించాడు ఆదిలాబాద్‌కు చెందిన ఓ రైతన్న.ఆదిలాబాద్ జిల్లాలోని లాండసాగ్వీ గ్రామానికి చెందిన సాధారణ రైతు… మోర హన్మండ్లు. ఈయనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. భార్య, ఇద్దరు కొడుకులతో కలిసి సేద్యం చేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ గురించి ఎన్నో కథలు విన్నాడు. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోవడంతో రోజువారీ కూలీలు, పేదలు పడుతున్న ఇబ్బందులూ తెలుసుకున్నాడు. వీరి కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. కానీ ఏం చేయగలడు? రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. పంట డబ్బే జీవనాధారం. ఈసారి తన పొలంలో సోయాబీన్, శనగ పంటలు వేశాడు. కాలం కలిసొచ్చింది. మంచి దిగుబడే వచ్చింది. పంట అమ్మితే వచ్చిన డబ్బులో పెట్టుబడి సొమ్ము తీసేశాడు. ఎక్కడ తెచ్చిన డబ్బు అక్కడ ఇచ్చేశాడు. అన్నీపోగా 50 వేల రూపాయలు మిగిలాయి. ఆ డబ్బు బ్యాంకులో ఉంది. ఆ సొమ్మును విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. కానీ నిర్ణయం తన ఒక్కనిదే కాదుగా. భార్యా పిల్లలున్నారు. వారి పరిస్థితి ఏంటి? వారి కోసమే కదా కష్టపడి సంపాదించింది. అందుకే పిల్లలను అడగాలనుకున్నాడు. వారేమంటారో అని సందేహించాడు. కానీ బిడ్డల్లో ప్రవహిస్తున్నది కూడా ఆ తండ్రి రక్తమే కదా. సంతోషంగా ఒప్పుకున్నారు. అనుకున్నదే తడవుగా రూ.50 వేల చెక్కును తన కొడుకులతో కలిసి కలెక్టర్ శ్రీదేవసేన, ఎస్పీ విష్ణువారియర్‌లకు అందజేశాడు హన్మండ్లు.