DailyDose

ఏపీలో అర్బన్‌లోనే కొరోనా-తాజావార్తలు

AP Health Minister Alla Nani Claims Corona In Urban Areas Only

* రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులన్నీ అర్బన్‌ ప్రాంతాల్లోనే నమోదయ్యాయని మంత్రి ఆళ్లనాని చెప్పారు. ఇప్పటి వరకు నమోదైన 13 పాజిటివ్‌ కేసుల్లో 12 అక్కడివేనని తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి కూడా చర్చించామని వివరించారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్‌రెడ్డితో సమీక్ష అనంతరం మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గనతో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చర్చించాం. నిత్యావసరాల కొనుగోలు సమయం గురించి చర్చించాం. పలు చోట్ల దుకాణాలు, మొబైల్‌ దుకాణాలు ఏర్పాటుచేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు, కార్మికుల విషయమై కూడా చర్చించాం. వారి కోసం ప్రత్యేక అధికారిని నియమిస్తాం. సరిహద్దుల్లో ఉన్న వారికి ఆహారం, దుస్తులు అందించేందుకు యోచిస్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో ఇప్పటికే మాట్లాడాం. ఏపీలో 13 కేసులు నమోదు కాగా.. 12 పాజిటివ్‌ కేసులు అర్బన్‌ ప్రాంతాల్లో నమోదైనవే. దీనిపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు. పట్టణాలు, నగరాల్లో మరిన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అవసరమైన వారిని ఐసోలేషన్‌ వార్డులకు తరలించాలని సూచించారు. ప్రతి 10 మందికి ఒక వైద్యుడి, నిపుణుడిని కేటాయిస్తాం. విదేశాల నుంచి 29,264 మంది వచ్చినట్లు గుర్తించాం. ఇంకా ఎవరైనా ఉన్నారో తెలుసుకునేందుకు మరోసారి సర్వే చేస్తున్నాం’’ అని నాని వివరించారు. 14 రోజుల క్వారంటైన్‌కు ఒప్పుకుంటే రాష్ట్రంలోకి వచ్చేందుకు అంగీకరిస్తామని మరో మంత్రి బొత్స చెప్పారు. నిత్యావసరాలు సరఫరా చేసేందుకు సంచార దుకాణాలు ఏర్పాటు చేస్తామని, రైతు బజార్లు మరిన్ని పెంచుతామని తెలిపారు.

* కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా ఈ మహమ్మారి బారిన పడి చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అమెరికా టెక్‌ దిగ్గజం యాపిల్‌.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పరిపాలనా విభాగం, ఫెడరల్‌ ఏజెన్సీలతో కలిసి మొబైల్‌ యాప్‌, వెబ్‌సైట్‌లను ప్రారంభించినట్లు శ్వేతసౌధం వెల్లడించింది.

* కరోనా బాధితుల వైద్య సేవల కోసం తమ భవనాలను ఉపయోగించుకోవచ్చని ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, సద్గురు జగ్గీ వాస్‌దేవ్‌ తమిళనాడు ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే ఇషా వాలంటీర్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తారని వెల్లడించారు. ఆహారం దొరక్కపోవడం, ఆకలితో ప్రజల్లో అశాంతి చెలరేగే అవకాశాలున్నాయని సద్గురు అన్నారు. లాక్‌డౌన్‌ వల్ల రోజువారీ కూలీలు, కుటుంబాలకు ఉపాధి లేకపోవడంతో పస్తులు ఉండాల్సి రావొచ్చని పేర్కొన్నారు.

* కరోనా మహమ్మారి విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో ఆందోళనలో ఉన్న ప్రజానీకానికి అండగా నిలవడమే మన ధర్మం అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యం విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, నాయకులతో ఆయన శనివారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడారు.

* కరోనా వైరస్‌ నియంత్రణకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రజలకు ఓ చిట్కా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అలవాటుగా ఉపయోగించే చేతిని ఎక్కువగా వాడకపోవటంతో కరోనాను కొంతమేర నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కుడిచేతి వాటం వాళ్లు ఎడమచేతితో.. ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేత్తో తలుపులు తియ్యడం లాంటి పనులు చేయాలని సూచించారు. తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిన్న జాగ్రత్త కొంత వరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందని చెప్పారు. ఇది కేవలం ఒక చిట్కా మాత్రమేనని.. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కొన్ని దేశాలు తలలుపట్టుకుంటుంటే కొరియాలాంటి దేశాల్లో ఈ తరహా చిన్న చిట్కాలతో కరోనాకి చెక్ పెట్టారని ఈ సందర్భంగా లోకేశ్‌ వివరించారు.

* కరోనా విస్తృతి దృష్ట్యా ఈసారి పదో తరగతి పరీక్షలు వాయిదా వేసి విద్యార్థులకు నేరుగా ఇంటర్‌లో ప్రవేశాలు కల్పించాలని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధుయాదవ్‌ డిమాండ్‌ చేశారు. అవసరమైతే ఇంటర్‌లో చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కింది తరగతుల్లో వచ్చిన మార్కులు, పదో తరగతి హాజరు ప్రాతిపదికగా విద్యార్థులను ప్రమోట్‌ చేయాలని శుక్రవారం ప్రకటనలో కోరారు.

* కరోనా వల్ల ఆక్వారంగం ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఏపీ మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం ఆయన ఆక్వా రంగానికి సంబంధించిన అసోసియేషన్, సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విదేశీ మారక ద్రవ్య ఆర్జనలో ఏపీ ఆక్వా రంగానిది కీలక పాత్ర అని అన్నారు. కరోనా వల్ల ఆక్వా పరిశ్రమ దెబ్బతినకుండా,ఎగుమతులు ఆగకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

* కరోనా వైరస్‌ నియంత్రణకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రజలకు ఓ చిట్కా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. అలవాటుగా ఉపయోగించే చేతిని ఎక్కవగా వాడకపోవటంతో కరోనాను కొంతమేర నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కుడిచేతి వాటం వాళ్లు ఎడమచేతితో.. ఎడమచేతి వాటం వాళ్లు కుడిచేత్తో తలుపులు తియ్యడం లాంటి పనులు చేయాలని సూచించారు. తద్వారా ఆ చేతితో ముఖాన్ని తాకడం తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ చిన్న జాగ్రత్త కొంత వరకూ కరోనా బారిన పడకుండా ఆపుతుందని చెప్పారు.

* రాష్ట్రంలో పాడి రైతులు, డెయిరీ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న తరుణంలో హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌ పశుసంవర్థక శాఖ కార్యాలయంలో డెయిరీ యజమానులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు నిత్యావసర వస్తువైన పాలను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్విగ్గీ, బిగ్ బాస్కెట్‌ల ద్వారా పాలను సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పాల సరఫరాలో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

* భాగ్యనగరంలో ఇప్పటివరకూ ఎలాంటి రెడ్‌జోన్లు లేవని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టంచేశారు. విదేశాల నుంచి వచ్చినవారు ఈ మహమ్మారిని కుటుంబ సభ్యులకు అంటగట్టారన్నారు. గచ్చిబౌలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ గాలితో వచ్చే రోగం కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వ్యక్తులతో వస్తోంది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సోకుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు ఏ ఒక్క బాధితుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా లేదు. అనవసర సమాచారంతో ప్రజల్ని భయాందోళనలకు గురిచేయవద్దని ప్రసార మాధ్యమాలను కోరుతున్నా. ’’ అని వివరించారు.

* ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దగ్గినా..తుమ్మినా భయపడే పరిస్థితి ఏర్పడింది. సాధారణ జలుబు చేసినా.. కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతోంది. ఈనేపథ్యంలో కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో స్పష్టం చేస్తూ కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచారపత్రాన్ని విడుదల చేసింది.

* కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచమంతా వణికిస్తోంది. దేశాలన్నీ క్రమంగా లాక్‌డౌన్‌ అయిపోతున్నాయి. వైరస్‌పై సమగ్ర సమాచారం ఇవ్వలేదని ప్రపంచ దేశాలన్నీ చైనాపై విమర్శలు గుప్పిస్తున్నాయి. భూ మండలమంతా విస్తరించిన కొవిడ్‌-19ను చైనా కేవలం వుహాన్‌ లాక్‌డౌన్‌తో కట్టడి చేసింది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు చైనా వైరస్‌ను చైనా పద్ధతుల్లోనే కట్టడి చేయాలని భారత వైద్యులు, నిపుణులు అంటున్నారు. అప్పుడే 21 రోజుల లాక్‌డౌన్‌ విజయవంతం అవుతుందంటున్నారు.

* గుంటూరు ఆస్పత్రి నుంచి పారిపోయిన కరోనా అనుమానితుడిని పట్టుకున్నట్లు గుంటూరు రేంజ్‌ ఐజీ ప్రభాకర్‌ తెలిపారు. అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేలిందని చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా చేపట్టిన లాక్‌డౌన్‌ అమలు తీరును శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చిన వారి వాహనాలను మూకుమ్మడిగా ఆపడం సరికాదన్నారు. లాక్‌డౌన్‌ పాటించకుండా ఎందుకు బయటకు వచ్చారో వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాత వారిని వెనక్కు పంపాలని సూచించారు.

* ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ కట్టడికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. కొవిడ్‌ నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజులపాటు బయటకు రాకుండా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచిస్తోంది. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. క్వారంటైన్‌లో ఉండాల్సిన వారు యథేచ్ఛగా రోడ్లపై తిరుగుతూ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో పోలీసుల తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల చేతులపై క్వారంటైన్‌ ముద్రలు ఉండటం ఆందోళనకు గురి చేసింది.

* కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా దేశంలో విధించిన 21రోజుల లాక్‌డౌన్‌ సత్ఫలితాలిస్తున్నప్పటికీ కొందరికి మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన మురకీం అనే ఓ 25ఏళ్ల యువకుడు రాయ్‌పూర్‌లో పనిచేస్తున్నాడు. తాజాగా ఈ నెల 25న తన తల్లి మరణించిందనే వార్త తెలిసింది. దీంతో రాయ్‌పూర్‌ నుంచి స్వస్థలం వారణాసికి కాలినడకన వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాయ్‌పూర్‌ నుంచి దాదాపు 654కి.మీ దూరం ఉన్న వారణాసికి తన ఇద్దరు మిత్రులతో కలిసి బయలుదేరాడు.

* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. భారత్‌లో రోజు రోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వంతో పాటు, అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 21రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండటం ద్వారా కరోనా వ్యాప్తిని నిరోధించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనాపై అవగాహన కల్పించేందుకు పలువురు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్నారు. ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న సామాజిక మాధ్యమం ‘టిక్‌టాక్‌’. ఇప్పటివరకూ ఫన్నీ వీడియోలను, పంచ్‌డైలాగ్‌లను, చేసిన ప్రజలు కరోనాపై అవగాహన వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు.