* కరోనా(కొవిడ్-19) మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ చేస్తున్న పోరులో భాగమయ్యేందుకు ప్రముఖ ఔషధ తయారీ సంస్థ సన్‌ఫార్మా ముందుకు వచ్చింది. రూ.25 కోట్ల విలువ చేసే హైడ్రాక్సీ క్లోరోక్వీన్(హెచ్‌సీక్యూఎస్), అజిత్రోమైసిన్ సహా ఇతర మందులు, శానిటైజర్లను విరాళంగా అందజేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కరోనా వైరస్‌ను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. వైరస్ బారిన పడ్డవారికి నిరంతరాయంగా మందులు అందేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యల్ని తీసుకుంటామంది. ఈ మేరకు ఓ టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వైరస్ బాధితుల్ని రక్షించడంలో నిరంతరాయంగా శ్రమిస్తున్న వైద్య సిబ్బందిని ప్రశంసించిన సన్ ఫార్మా వారి కోసం నాణ్యత కలిగిన శానిటైజర్లు తయారు చేస్తున్నామని తెలిపింది. భారత్‌లో ఉన్న ఓ తయారీ కేంద్రాన్ని పూర్తిగా దానికోసమే కేటాయించామని పేర్కొంది. అలాగే సంస్థకు చెందిన కొంతమంది ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు కల్పించామని వెల్లడించింది.
* అత్యవసర సేవలకు, పౌరులను చేరవేసేందుకు తమ విమానాలతో పాటు కాక్‌పిట్-క్యాబిన్ క్రూ సిబ్బందిని కూడా అందచేస్తామని గో ఎయిర్ సంస్థ పౌర విమానయాన శాఖకు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు తెలియ చేసింది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో, ఏప్రిల్ 14 వరకు దేశీయంగా విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి విదితమే. ఫలితంగా దేశీయంగా అన్ని సంస్థలవి కలిపి 650 విమానాలు కార్యకలాపాలు సాగించకుండా నిలిపేశారు. 56 విమానాలు కలిగిన గో ఎయిర్‌కు 5,500 మంది సిబ్బంది ఉన్నారు.
* ప్రభుత్వం సరైన సమయంలో ఉపశమన ప్యాకేజీ ప్రకటించిందని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ రజనీశ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు వచ్చే కొన్ని వారాల్లో మరిన్ని సాహసోపేత చర్యలు ప్రకటించాలని కోరారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీ వెనుక మంచి ఉద్దేశం ఉందని, వచ్చే మూడు నెలల పాటు బలహీన వర్గాలకు నగదు బదిలీ, ప్రాథమిక ఆహార అవసరాలు తీర్చే విధంగా చర్యలు హర్షణీయమని వెల్లడించారు. కరోనా వ్యాప్తి అరికట్టడానికి లాక్ డౌన్ సరైన నిర్ణయమేనని తెలిపారు.
* నిత్యావసరాల ఆర్డర్లు మాత్రమే తీసుకుంటున్నామని, ఇతర వస్తువుల ఆర్డర్లు తీసుకోవడం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇ-కామర్స్ కంపెనీలైన పేటీఎమ్ మాల్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రకటించాయి. లాక్‌డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఉన్నప్పటికీ.. డెలివరీ సిబ్బందిని స్థానిక పోలీసులు అడ్డుకుంటుడం తమ దృష్టికి వచ్చిందని కంపెనీలు చెబుతున్నాయి. ‘వెచ్చాలు, ఆరోగ్య సంరక్షణ, వ్యక్తిగత భద్రత ఉత్పత్తుల వంటి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తున్నట్లు పేటీఎమ్ మాల్ నిర్ణయించింది. ఇతర వస్తువుల విభాగంలో మాత్రం ఆర్డర్లను ప్రస్తుతానికి తీసుకోవడం లేద’ని పేటీఎమ్ మాల్ వెల్లడించింది. కొత్త ఆర్డర్లు కేవలం నిత్యావసర ఉత్పత్తుల (ప్రీపెయిడ్ చెల్లింపులకే) విభాగంలోనే తీసుకుంటున్నాం. డెలివరీలను తిరిగి ప్రారంభించడానికి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామ’ని అమెజాన్ ఇండియా తెలిపింది. ‘కిరాణా సామాన్లకు ప్రాధాన్యతనిస్తూ.. వీలైనంత త్వరగా వాటిని డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇతర వస్తువుల ఆర్డర్లను తీసుకోవడం లేద’ని ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. స్థానిక అధికారులు సహాయం చేస్తుండడంతో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించామని గ్రోఫర్స్ తెలిపింది.బిగ్‌బాస్కెట్ కొత్త వినియోగదార్లకు సేవలు అందించడం లేదు.
* నమోదిత కంపెనీలకు సెబీ ఊరటనిచ్చింది. వార్షిక సాధారణ సమావేశాల(ఏజీఎమ్)ను నిర్వహించుకోవడానికి మరింత సమయాన్ని ఇచ్చింది. మార్కెట్ విలువ విషయంలో అగ్రగామి 100 నమోదిత కంపెనీలకు 2019-20కి సంబంధించి ఏజీఎమ్‌లను నిర్వహించుకోవడానికి ఒక నెల పాటు అంటే సెప్టెంబరు 30 వరకు గడువునిస్తున్నట్లు ఒక సర్క్యులర్‌లో పేర్కొంది. నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగిసిన అయిదు నెలల్లోపు అంటే ఆగస్టు 31లోగానే ఏజీఎమ్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. నామినేషన్, రెమ్యూనిరేషన్, వాటాదార్ల సంబంధాలు, రిస్క్ మేనేజ్‌మెంట్‌కు సంబంధించి కమిటీల వార్షిక సమావేశాలను నిర్వహించడానికి కూడా జూన్ 30 వరకు సడలింపునిచ్చింది. ఇప్పటికే జూన్ 30 వరకు నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించడానికి నమోదిత కంపెనీలకు వెసలుబాటు కల్పించిన సంగతి తెలిసిందే.