ప్రేక్షక లోకాన్ని అలరించే సినీతారలు క్లిష్ట పరిస్థితుల్లోనూ మేమున్నామంటూ ముందుకు వస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుండటంతో పలువురు సెలబ్రిటీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్‌ఖాన్ చిత్రపరిశ్రమలో పనిచేసే చిన్నాచితకా ఆర్టిస్టులకు ఆపన్నహస్తం అందించనున్నాడు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో పనిచేసే కళాకారుల పరిస్థితి కూడా దయనీయంగా మారింది. అలాంటి వారికి సహాయం అందించేందుకు సినీ ప్రముఖులు ముందుకు రావాలని ఎఫ్‌డబ్ల్యూఐసిఈ (ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్) అధికార ప్రతినిధి బీఎన్ తివారీ కోరాడు.
దీంతో తాప్సీ పన్ను, కరణ్ జోహార్ వంటి ప్రముఖులు మేము సైతం సాయం అందించేందుకు అంటూ ప్రతిజ్ఞ పూనారు. సల్మాన్‌ఖాన్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా 25 వేల మందికి ఆర్థిక చేయూతనివ్వడానికి సిద్ధఫడిపోయాడు. ఈ మేరకు బీఎన్ తివారీ మాట్లాడుతూ.. సల్మాన్ తన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ ద్వారా దినసరి వారీగా పనిచేసే కళాకారులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించాడు. అందులో భాగంగా 25 వేల మంది కళాకారులకు నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయనున్నాడని తెలిపాడు. ఈ మేరకు వారి అకౌంట్ల వివరాల లిస్టును పంపించనున్నట్లు పేర్కొన్నాడు.