* రాష్ట్రంలో ఇప్పటి వరకు 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న 11మంది కరోనా బాధితులు వైరస్ నుంచి కోలుకున్నట్లు తెలిపారు. 58 మంది పరిస్థితి నిలకడగా ఉందని, వారిని కూడా పరిస్థితులను బట్టి విడతల వారీగా డిశ్చార్జి చేస్తామని వివరించారు. చికిత్స పొందుతున్న వారందరూ బాగానే కోలుకుంటున్నారని తెలిపారు. మొత్తం 25,935 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వారిలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని అన్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిని 5,742 బృందాలు పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు.
* పొట్టకూటి కోసం ఊరు కాని ఊరు వచ్చాడు. కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్నాడు. దేశ రాజధాని చేరుకుని ఓ కంపెనీలో డెలివరీ ఏజెంట్‌గా జీవితం మొదలు పెట్టాడు. ప్రతి నెలా ఇంటికి డబ్బు పంపుతున్నాడు. జీవితం సాఫీగా సాగిపోతోంది. అయితే, కాలం ఎప్పుడు.. ఎవరిని.. ఎలా.. పరీక్షిస్తుందో తెలియదు కదా. దేశాన్ని కరోనా కారు మేఘాలు కమ్ముతున్న వేళ ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. దీంతో సొంతూరు చేరుకునేందుకు రవాణా లేక నడిచి ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. అడుగులో అడుగు వేసుకుంటూ కంటితో దూరాన్ని, కాళ్లతో కాలాన్ని కరిగించాలనుకున్నాడు. అయితే, తానొకటి తలిస్తే దైవమొకటి తలచాడు. ఏ గుండె ధైర్యంతో నడక ప్రారంభించాడో ఆ గుండె చప్పుడు ఆగిపోయింది. తన స్వగ్రామానికి కాలినడన బయల్దేరి మధ్యమార్గంలో గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడు. దేశాన్ని కరోనా పట్టి పీడిస్తున్న వేళ ఇదొక హృదయ విదారక ఘటన.
* దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చిన వలస కూలీలంతా దిల్లీలోని వసతి శిబిరాల్లో ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. షెల్టర్లుగా క్రీడా మైదానాలు, పాఠశాలలు కేటాయించినట్లు వెల్లడించారు. 4 లక్షల మంది వలస కూలీలకు తాత్కాలిక వసతి, భోజనం అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడి వారు అక్కడే ఉండటం లాక్‌డౌన్ నినాదమని, దానిని విజయవంతం చేస్తే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
* దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతమవుతున్న నేపథ్యంలో వివిధ చోట్ల చిక్కుకుపోయిన వలస కూలీలను ఆదుకోవాలని స్వచ్ఛంద, సామాజిక సంస్థలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు లాక్‌డౌన్ కారణంగా ఎక్కడికీ వెళ్లలేక.. కనీస భోజన వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వెంకయ్యనాయుడు స్పందించారు. వలస కార్మికుల విషయంలోనూ స్థానికులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారికి కూడు, గూడు కల్పించి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ఈ విషయంపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి శ్రీ సంతోష్ కుమార్ గంగ్వార్, కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా తదితరులతో ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వలస కార్మికుల విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
* కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా పనులు లేక తమ సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్న వలస కూలీలను ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా వివిధ రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం నిర్వహించారు. లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తూ, కూలీలు రాష్ట్రాలు, నగరాలు దాటకుండా సరిహద్దులను మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
* కరోనా వ్యాప్తి నివారణ కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు. పట్టణ ప్రాంతాల్లో వ్యాధి ఎక్కువగా ప్రబలుతున్న దృష్ట్యా ప్రజలు బయట తిరిగేందుకు ఇచ్చిన సమయాన్ని తగ్గించారు. ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 11 గంటలలోపే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలని నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు ఇచ్చిన అనుమతి కొనసాగుతుంది. వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తికి అడ్డంకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
* కరోనావైరస్‌పై పోరాటంలో దేశానికి మద్దతుగా ఉండేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రంగంలోకి దిగింది. తేలిగ్గా ఆపరేట్ చేసే విధంగా ఉండే వెంటిలేటర్లు, ఆక్సిజన్ కెనిస్టర్లు, మాస్కుల తయారీకి సహకరించనుంది. ప్రస్తుతం దేశంలో అత్యవసరమైన పరికరాల తయారీకి తోడ్పాటునందించనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ డైరెక్టర్ ఎస్.సోమ్‌నాథ్ వెల్లడించారు. ప్రస్తుతం విక్రమ్‌సారాభాయ్ స్పేస్‌సెంటర్‌లోని ఏ వ్యక్తి కూడా కొవిడ్ బారిన పడలేదని ఆయన పేర్కొన్నారు. ‘‘మేం దాదాపు 1,000 లీటర్ల శానిటైజర్లను తయారు చేశాం. మా ఉద్యోగులు మాస్కులను తయారు చేస్తున్నారు. మా కమ్యూనికేషన్స్ కంప్యూటర్లు అత్యంత సురక్షితమైనవి. అవసరమైతే మా ఉద్యోగులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తారు. అవసరమైనప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లు పెడతాం’’ అని సోమ్‌నాథ్ అన్నారు.
* ప్రస్తుత పరిస్థితుల్లో సరైన జాగ్రత్తలు పాటించడమే కరోనా వైరస్ నివారణకు సరైన మార్గమని ‘ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ’ ఛైర్మన్, ప్రముఖ వైద్య నిపుణులు జి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి పరిశోధనలు జరుగుతున్నాయని నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ‘‘ప్రాథమిక స్థాయి వ్యాక్సిన్లు ఇప్పటికే తయారయ్యాయి. ఆర్‌ఎన్‌ఏతో తయారు చేసే వ్యాక్సిన్ కావడం వల్ల ఎక్కువ సమయం పడుతోంది. దీన్ని వెంటనే విచ్చల విడిగా ప్రజల్లో ఉపయోగించలేం. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిర్ధారించుకుని.. నయం చేయగలిగే సామర్థ్యాన్ని బట్టి వినియోగంలోకి తెస్తాం. కచ్చితంగా వ్యాక్సిన్ వచ్చి తీరుతుంది’’ అని వివరించారు.
* యువ కథానాయకుడు నితిన్ పెళ్లి వాయిదా పడింది. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ఏప్రిల్ 16న జరగాల్సిన తన వివాహాన్ని వాయిదా వేసుకుంటున్నట్లు ఆయన ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇటీవల తన ప్రేయసి షాలినితో నితిన్ నిశ్చితార్థం జరిగింది. దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి ఆయన సన్నాహాలు చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రపంచమంతా విస్తరించడంతో పెళ్లికి సరైన సమయం కాదని నిర్ణయించుకున్నారు.
* ‘రాష్ట్రాన్ని వదిలి వెళ్లకండి..’ అంటూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వలస కార్మికులకు విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న ఈ సమయంలో ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. వలస కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే రెవెన్యూ, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. వలస కార్మికులకు ఏదైనా సహాయం అవసరమైతే.. స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు.
* వీరేందర్ సెహ్వాగ్.. టీమ్‌ఇండియా ఓపెనింగ్ స్థానానికి వన్నె తెచ్చిన బ్యాట్స్‌మన్. ముల్తాన్‌లో పాకిస్థాన్ బౌలర్లకు దడపుట్టించినా.. చెన్నైలో దక్షిణాఫ్రికా బౌలర్లను బెంబేలెత్తించిన అది అతడికే చెల్లింది. భారత జట్టు తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించడమే కాక రెండుసార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్. ఈ రెండు ట్రిపుల్ శతకాలు సరిగ్గా నాలుగేళ్ల వ్యవధిలో ఒకే రోజు నమోదవ్వడం విశేషం. అది కూడా ఈ రోజే.
* తాను కథానాయకుడిగా నటించిన ‘మహానుభావుడు’ స్టిల్స్‌తో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వినూత్నంగా సందేశాన్నిచ్చారు. ఆదివారం ట్విటర్‌లోకి అడుగుపెట్టిన శర్వానంద్.. తన అధికారిక ఖాతా నుంచి కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తూ పలు ట్వీట్లు పెట్టారు. అయితే ఆయన చెప్పాలనుకున్నా విషయాన్ని తన ‘మహానుభావుడు’ సినిమాలోని స్టిల్స్‌ను పోలిన కార్టూన్స్‌తో చాలా విభిన్నంగా చెప్పారు. ‘మన ప్రపంచం, మన దేశం, మన ప్రజల కోసం ప్రతి ఒక్కరం ‘మహానుభావుడు’గా మారదాం’ అని శర్వా పేర్కొన్నారు.
* ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా వైరస్ బారిన పడిన మొట్టమొదటి పేషెంట్‌గా భావిస్తున్న వ్యక్తి ఆచూకీని ఎట్టకేలకు కనుగొన్నారు. ఈ వైరస్ ఇప్పుడు మహమ్మారిగా మారి దాదాపు 30వేల మంది ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన ఆంగ్ల పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈమె ఆచూకీని కనుగొంది. నెలరోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆమె ప్రాణాలతో బయటపడ్డారు.
* దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయినా ప్రజలు మాత్రం దీని తీవ్రతను గుర్తించడం లేదు. కొందరు బాధ్యతగా వ్యవహరించినా చాలామంది ఇష్టారాజ్యంగా వీధుల్లో తిరుగుతున్నారు. బయటకు వచ్చినా సరిగా సామాజిక దూరం పాటించడం లేదు. ప్రజలు గుంపులుగా ఉండొద్దని వైరస్ వ్యాప్తిపై ఎంత అవగాహన కల్పించినా ఇంకా భయం లేనట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. మాకు ఎందుకొస్తుందనే ధీమాలో ఉన్నారు.