ఒకప్పుడు ప్రతినాయకులుగా నటించిన వారు ఆ తర్వాత కథానాయకులుగా మారిన సందర్భాలు కోకొల్లలు. ఎంతో మంది నటులు మొదట్లో దుష్ట పాత్రలు వేసి, ఆ తర్వాత హీరో స్థాయికి ఎదిగారు. అదే విధంగా ఒకప్పుడు హీరోగా నటించిన వారు ఇప్పుడు ప్రతినాయకులుగానూ రాణిస్తున్నారు. అయితే, కొందరు హీరోలు మాత్రమే విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోతారు. అలా కాకుండా ప్రతినాయక పాత్రలు చేయడానికి సై అంటూ రంగంలోకి దిగితే, ప్రేక్షకులు ఆదరించకపోవచ్చు.
అప్పట్లో దాదాపు అందరూ రెండు పాత్రలూ ధరించారు. ‘పరివర్తన’ (1954)లో నాగేశ్వరరావు హీరో అయితే, ఎన్టీఆర్ విలన్. అక్కినేని మాత్రం విలన్‌గా నటించలేదు. ‘నా పర్సనాలిటీ, కంఠం దుష్టపాత్రలకి సరిపోవు’ అని చెప్పేవారు. కృష్ణంరాజు, జగ్గయ్య, కాంతారావు, మోహన్‌బాబు, అంతకుముందు సీహెచ్. నారాయణరావు, ఎల్.వి. ప్రసాద్ మొదలైనవారు రెండు పాత్రలూ ధరించారు.
మహిళల్లో కూడా కన్నాంబ దగ్గర్నుంచి చాలామంది రెండు పాత్రలు వేశారు. కన్నాంబ అటు శోకరసం, ఇటు దుష్టపాత్రలు వేసి రాణించారు. జి.వరలక్ష్మి, ఎస్.వరలక్ష్మి, సావిత్రి, షావుకారు జానకి, అంజలీదేవి, భానుమతి, జమున మొదలైనవారు నాయికలుగానూ చేశారు.. వాంప్ పాత్రలూ వేశారు. ‘రెండు రకాల పాత్రల్లోనూ రాణించడం కష్టం. ముఖం, పర్సనాలిటీ సహకరించాలి. వెయ్యగలిగితే, విభిన్నమైన నటన సాధ్యపడుతుంది. హీరోయిన్‌గా స్థిరపడిన తర్వాత, నిర్మాతలు సాధారణంగా దుష్టపాత్రలకు పిలవరు. శ్రీరంజనిని, దుష్ట పాత్రధారిగా ఊహించుకోలేం, సూర్యకాంతాన్ని హీరోయిన్‌గానూ ఊహించుకోలేం’’ అని ‘మహానటి’ సావిత్రి అంటుండేవారు.