కొబ్బరి బొండాంలోకి నీళ్లెలా వచ్చాయో ఎప్పుడైనా ఆలోచించారా? చెట్లు పెరిగేందుకు గాలి, సూర్యరశ్మిలతో పాటు నీరు కూడా అవసరమే. వీటితో చెట్లు బీజ పోషకం (ఎండో స్పెర్మ్) అనే ద్రవ పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. కాయలు ఏర్పడటంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. కొబ్బరి చెట్లలో బీజోత్పత్తి కోసం ఇలా ఏర్పడిన ద్రవమే కొబ్బరినీళ్లు. సాధారణంగా చాలా చెట్లలో ఫలాలు ఏర్పడేటప్పటికే బీజ పోషక ద్రవం ఇంకిపోతుంది. కొబ్బరి చెట్లలో మాత్రం అలాగే ఉంటుంది. తర్వాత దశలో కొబ్బరి కాయ పరిమాణం పెరిగేటప్పటికి చిప్ప ఏర్పడి, దాని గోడలపై బీజ పోషక ద్రవం పలుచగా తెల్లటి పొరలుగా పేరుకోవడం ప్రారంభిస్తుంది. అదే లేత కొబ్బరన్నమాట. ఆ తర్వాత కాయ పెరిగే కొద్దీ కణ విభజన జరగటం వల్ల బీజ పోషక ద్రవ పరిమాణం పెరుగుతూ, కొన్నాళ్లకు పాలలాగా చిక్కగా మారుతుంది. ఈ దశలో కొబ్బరికాయ నీళ్లలో ఆవుపాలలో కంటే ఎక్కువగా ప్రొటీన్లు, పోషక పదార్థాలు ఉంటాయి. చక్కెర శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. లేత కొబ్బరికాయలో కొబ్బరి కంటే కొబ్బరి నీరే ఎక్కువగా ఉంటుంది. ఈ కొబ్బరినీళ్లలో పొటాషియం, ఆస్కార్బిక్ ఆమ్లం లాంటి పదార్థాలు కలిసి ఉంటాయి. కాబట్టి లేత కొబ్బరి నీరు తాగటం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాయ ముదిరే కొద్దీ నీరు తగ్గిపోతుంటుంది.
బోండంలోకి నీరు ఎలా వచ్చింది?
Related tags :