దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది… నూటొక్క జిల్లాలకి అందగాడిని… దేవుడో దేవుడా… వంటి తన మార్క్ సంభాషణలతో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుడు నూతన్‌ప్రసాద్. హాస్యనటుడిగా, ప్రతినాయకుడిగా, సహ నటుడిగా పలు రకాల పాత్రల్లో ఒదిగిపోయి తన శైలిని చాటుకొన్న నటుడీయన. ఎంతోమంది నటులకి గాత్రం కూడా అందించారు. నూతన్ ప్రసాద్ అసలు పపేరు తడినాధ వరప్రసాద్. 1945, డిసెంబరు 12న కృష్ణాజిల్లా, కైకలూరులో జన్మించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వోద్యోగం చేస్తున్న ఆయన 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘అందాల రాముడు’ చిత్రంతో చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘నీడలేని ఆడది’లో నటించారు. కానీ ఈయనకి మంచి గుర్తింపు అంటే ‘ముత్యాల ముగ్గు’లో రావు గోపాలరావుతో కలిసి నటించిన ప్రతినాయక పాత్రతోనే లభించింది. ఆ తర్వాత వరుసగా ఆ తరహా పాత్రలే లభించాయి. తనదైన శైలిలో సంభాషణల్ని పలకడం, ప్రతినాయక పాత్రలకి హాస్యంతో వన్నె అద్దం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి తదితర అగ్ర కథానాయకుల సరసన నటించి ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ఒక చిత్రంలో కథానాయకుడిగా కూడా నటించారు. 1970, 80వ దశకంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కీలక నటుడుగా ఎదిగారు. ‘రాజాధిరాజు’ చిత్రంలో సైతాన్‌గా ఆయన నటన ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించింది. సుందరి సుబ్బారావు చిత్రంలో నటనకిగానూ నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పుస్కారం అందుకొన్నారు. ‘బామ్మ మాట బంగారు మాట’ చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన కొంతకాలం సినిమా రంగానికి దూరమయ్యారు. ఆ తర్వాత కోలుకొని కాళ్లు సహకరించకపోయినా పలు చిత్రాల్లో నటించారు. 365కిపైగా సినిమాల్లో నటించిన ఆయనకి ఆర్య ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కొన్నిరోజులపాటు రవీంద్రభారతికి ఇన్‌చార్జిగా కూడా పనిచేశారు. ఈటీవీ2లో ప్రసారమైన ‘నేరాలు ఘోరాలు’ కార్యక్రమానికి వాఖ్యాతగా కూడా వ్యవహరించి తన గాత్రంతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అనారోగ్యంతో మార్చి 30, 2011న హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు.
నూటొక్క జిల్లాల అందగాడు నూతన్‌ప్రసాద్‌పై TNI కథనం
Related tags :