కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావమే చూపుతోంది. ఈ విషయాన్ని అనేక అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు సైతం ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో అమెరికాలో ఉన్న హెచ్-1బీ వీసాదారుల్లో ఆందోళన మొదలైంది. అగ్రరాజ్యంలో అనేక కంపెనీలు ఆర్థికంగా తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొనే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో నష్టాల్ని పూడ్చుకునేందుకు ఆయా సంస్థలు రానున్న కొన్ని వారాల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోత విధించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఉద్యోగాలు కోల్పోయిన తర్వాత అమెరికాలోనే నివాసం ఉండేందుకు ఉన్న గడువు నిబంధనల్లో సవరణలు చేయాలని హెచ్-1బీ వీసాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గడువును 180 రోజులకు పెంచాలని వేలాది మంది హెచ్-1బీ వీసాదారులు శ్వేతసౌధానికి లేఖ పంపేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇప్పటికే 20 వేల మంది సంతకాల చేశారు. వీరి విజ్ఞాపనను శ్వేతసౌధం పరిగణనలోకి తీసుకోవాలంటే లక్ష మంది సంతకాలు అవసరం. ‘‘హెచ్-1బీ వీసాదారుల్లో అత్యధిక మంది భారత్‌కు చెందినవారే. వీరిలో చాలా మంది పిల్లలు అమెరికా పౌరులుగా ఉన్నారు. ఆయా దేశాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లడం వీలుకాదు. పన్నుల రూపంలో హెచ్-1బీ వీసాదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో తోడ్పాటునందిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో విశేష కృషి చేస్తున్నారు’’ అని లేఖలో పేర్కొన్నారు. కఠిన ఆంక్షల నేపథ్యంలో గత రెండు వారాల్లో అమెరికాలో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. ఈ ప్రభావం హెచ్-1బీ వీసాదారులపైనే అధికంగా ఉండే అవకాశం ఉందని సమాచారం. కొన్ని సంస్థలైతే ఎవరెవరి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయో కూడా ముందుగానే సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో సుమారు 4.7 కోట్ల మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. అమెరికాలో ఇప్పటి వరకు లక్షా 54 వేల మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో 3,146 మంది మృత్యువాత పడ్డారు. కరోనా ప్రభావం రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే అమలులో ఉన్న ఆంక్షల్ని మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ ట్రంప్ సర్కార్ నిన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కొరోనా దెబ్బకు H1B ఉద్యోగస్థుల్లో గుబులు
Related tags :