ఆమె నటన భారత చలనచిత్ర చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ తగినది. ఆమె నటించిన ‘బైజు బావరా’, ‘పరిణీత’, ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’, ‘పాకీజా’ సినిమాలు బాలీవుడ్ చిత్రాలు వున్నంతకాలం చరిత్రలో నిలిచిపోయేవే. తనకు నచ్చిన, తాను మెచ్చిన, చాలా కష్టం అనిపించిన పాత్ర సాహిబ్ బీబీ అవుర్ గులామ్‌లోని ‘చోటీ బహు’ అని ఆమే స్వయంగా చెప్పుకుంది. ఆ మహానటే వెండితెర విషాద రాణి… మరో సావిత్రి … మీనాకుమారి. భర్తను ప్రేమించి, అతని కోసం చివరకు మద్యం తీసుకునేందుకైనా వెనుకాడని భార్యగా ‘సాహిబ్ బీబీ అవుర్ గులామ్’లో, అచ్చమైన బెంగాలీ యువతిలా కనపడే ‘పరిణీత’ లోని లలిత పాత్రలో ఆమె చూపిన భావోద్వేగాలు నటనకు పరాకాష్ట అని చెప్పవచ్చు. తన ముఖ లాలిత్యంతో, నటనా కౌశలంతో ఇలాంటి ఎన్నో పాత్రలకు జీవం పోసి, మరెందరో నిర్మాతలకు విజయాలను అందించి, అజరామరమైన కీర్తి ప్రతిష్టలను మాత్రం తనకు మిగుల్చుకొని 38 ఏళ్లకే నూరేళ్లు నింపుకొని ఇహలోకాన్ని విడిచివెళ్లింది ఈ మహానటి మీనాకుమారి. సెయింట్ ఎలిజెబత్ ఆసుపత్రిలో తన ప్రాణాలను విడిచిపెడుతూ ‘‘నాకింకా బ్రతకాలని ఉంది’’ అంటూ ఆక్రోశించింది. తన సమాధిమీద ‘విరిగిన వాయులీనంలో, తెగిన పాటతో, పగిలిన గుండెతో సెలవు తీసుకుంటున్నా’అని రాయించుకుంది. నేడు ఈ బహుముఖ ప్రాజ్ఞి (మార్చి 31, 1972) వర్థంతి.
వెండితెర విషాద రాణి మీనాకుమారి-TNI కథనం
Related tags :