Kids

పిల్లలకు సంకల్ప బలాన్ని నేర్పండి

Teach Girt Confidence And Integrity To Kids-Telugu Kids News

నీ సంకల్పం గొప్పదైతే ఎటువంటి కటిన పరిస్థితులనైనా అవలీలగా అధికమించ వచ్చు అనడానికి ఒక మంచి ఉదాహరణను మీకందిస్తున్నాను.

ఒక అడవిలో ఒక జాతికి చెందిన ఓ ఆడ పక్షి ఓసారి గుడ్లు పెట్టే సమయం ఆసన్నమైంది. అది ఒక సముద్రతీరంలో గుంపుగా ఉన్న చెట్లలో తీరానికి దగ్గరగా ఉన్న ఒక చెట్టును ఎంచుకొని దానిపైన ఒక గూడును ఏర్పాటు చేసుకొని అందులో గుడ్లు పెట్టింది. సముద్రతీరంలో చల్లటి గాలులు వీస్తున్నాయి. అందుకే ఆ చెట్టును ఎంచుకొని ప్రతిరోజూ వాటిని పొదిగే కార్యక్రమంలో ఉంటూ అవి బిడ్డలుగా మారాలని ఎంతో ఆశతో, ఆతురతతో ఎదురుచూస్తోంది..

ఒకరోజు ఆ పక్షి తన ఆహారం కోసం బయటకు వెళ్ళింది. ఇంతలో ఉద్ధృతంగా వచ్చిన తుఫాను కారణంగా అల్లకల్లోలం అయిన సముద్రం తన అలలతో తీరానికి దగ్గరగా ఉన్న చెట్లను పడగొట్టింది. పక్షి గుడ్లు పెట్టుకొన్న ఆ చెట్టు కూడా కూలిపోయింది. అలల తాకిడికి పక్షి గూడు, అందులోని గుడ్లు సముద్రంలోకి కొట్టుకెళ్ళి పోయాయి. తుఫాను తగ్గింది, ఆ పక్షి తిరిగొచ్చింది.. చూస్తే గూడు లేదు, గుడ్లు లేవు. ఆ పక్షి ఎంతో ఆశతో కట్టుకొన్న గూటితోపాటు, తను కన్న కలలన్నీ ఛిన్నాభిన్నమయ్యాయి. తీవ్రంగా ఆవేదన చెందిందా పక్షి..

బాగా ఏడ్చింది, బాధపడింది. కానీ తన బిడ్డలకు ఎలాగైనా ఈ లోకం వెలుగు చూపించాలి. ఈ అందమైన ప్రపంచానికి పరిచయం చేయించాలి అనుకుంటూ సముద్రం నుంచి తన గుడ్లను ఎలాగైనా బయటకు తీసుకు రావాలనుకుందా పక్షి. కానీ తాను చూస్తే నేమో గుప్పెడంత.. ఆ సముద్రాన్ని చూస్తే నేమో అనంతం. అయినా కూడా తన మొక్కబోని సంకల్పంతో పోరాడాలని అనుకుంటూ, తన ముక్కుతో సముద్రపు నీటిని పీల్చి ఒడ్డున వదిలిపెట్టడం ప్రారంభించింది. ఇలా సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ తోడేస్తే తన గుడ్లు బయటకు వస్తాయని ఆ పిట్ట ఆలోచన‌. ఓ బుల్లి పిట్టకు సముద్రపు నీరంతా తోడటం సాధ్యమయ్యే పనేనా? కానీ ఆ పిట్టకు మాత్రం ఈ సందేహం రానేలేదు. దానికి ఎంతసేపూ దాని మనసులో ఉన్నది ఒకే ఒక లక్ష్యం. తన బిడ్డలను లోకానికి పరిచయం చేయడం, అంతే అలా నీరు తోడుతూనే ఉంది.

సాటి పక్షులు ఇదంతా చూశాయి. కొన్ని పక్షులు దాని దగ్గరకు వచ్చి ఇది సాధ్యం అయ్యేదేనా నీ పిచ్చి గాని అంటూ నిరాశ పరిచాయి. మరికొన్ని పక్షులు తోటి పిట్టకు సాయం చెయ్యాలని తామూ కూడా నీరు తోడటం ప్రారంభించాయి. క్రమంగా వేలాది పక్షులు ఈ పనికి జతకూడాయి. క్రమంగా ఈ విషయం పక్షిరాజు గరుత్మంతుడి వరకూ వెళ్ళింది. దాని పట్టుదలకు ముగ్ధుడైన ఆ పక్షిరాజు తన రాజాజ్ఞతో లక్షలాది పక్షులు సముద్రపు నీరు తోడటం ప్రారంభించాయి. తన తీరంలో జరుగుతున్న ఈ అల్లకల్లోలాన్ని సముద్రుడు కూడా గుర్తించాడు. విషయం తెలుసుకుని, ఆ పక్షి సంకల్పానికి, దాని ధైర్యానికి మెచ్చుకొన్న సముద్రుడు తానే స్వయంగా తన గర్భంలో ఉన్న గుడ్లను తానే స్వయంగా తీసుకువచ్చి ఆ బుల్లి పిట్టకు అందించాడు. చూశారా పిట్ట చిన్నదే కానీ దాని సంకల్ప బలం గొప్పది. ఆ సంకల్ప బలానికి సముద్రుడే తలవంచి దిగి వచ్చాడు.”