* కరోనావైరస్ చికిత్స కోసం మలేరియా నిరోధక ఔషధమైన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడిన డాక్టర్ గుండెపోటుతో చనిపోయాడు. అస్సాం గువహతిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుడుగా పనిచేస్తున్న ఉత్పాల్జిత్ బర్మన్ శనివారం గుండెపోటుతో మరణించాడు. సీనియర్ అనస్థీటిస్ట్ అయిన 44 ఏళ్ల బర్మన్ కరోనా సోకకుండా ముందుజాగ్రత్తగా ఈ మలేరియా మందును తీసుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా.. ఈ ఔషధం వల్ల గుండెపోటు వస్తుందో లేదో ఇంకా నిర్ధారణ చేయలేదు. కానీ.. దీన్ని తీసుకున్న తర్వాత తనకు నీరసంగా ఉందంటూ బర్మన్ తన సహోద్యోగికి వాట్సాప్ మెసెజ్ చేశాడు. అలా మెసెజ్ చేసిన కాసేపటికే బర్మన్ మృతిచెందాడు.
* ఢిల్లీలోని వెస్ట్ నిజాముద్దీన్ ప్రాంతం ఇప్పుడు పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన వారే కరోనా వ్యాప్తికి కారణం అయ్యారన్న కారణంగా మర్కజ్ మౌలానాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. మర్కజ్ కు వచ్చిన వారి వివరాలను వెల్లడించాలని కోరినా, ఆయన వెల్లడించలేదని ఆరోపించారు. ఈ ప్రార్థనలకు వచ్చిన వారే, కరోనా వైరస్ ను అంటించుకుని, తమతమ ప్రాంతాలకు వెళ్లారని, దేశంలో నమోదైన కాంటాక్ట్ కేసులన్నీ వీరి నుంచి వ్యాపించినవేనని తేలడంతో కేజ్రీవాల్ ఆదేశాల మేరకు, ఢిల్లీ జాయింట్ సీపీ డీసీ శ్రీవాత్సవ నేతృత్వంలోని టీమ్, నిజాముద్దీన్ ప్రాంతానికి వెళ్లి, ఆ ప్రాంతంలోని దాదాపు 1200 మందిని క్వారంటైన్ చేసింది. మర్కజ్ మౌలానాపై కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు.
* వుహాన్‌లో కనీసం 26-40 వేల మంది మరణించి ఉంటారని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఇక ఆ నగరంలోని ఏడు శ్మశాన వాటికలు మార్చి 23 నుంచి ఏప్రిల్ 4 మధ్య సగటున 3500 చితాభస్మం కుండలను పంపిణీ చేస్తాయని అంచనా. ఎందుకంటే చనిపోయిన వారి స్మారకార్థం అక్కడ కింగ్మింగ్ అనే పండుగ జరుపుకొంటారు. అంటే ఈ 12 రోజుల కాలంలో దాదాపు 42వేల కుండలను పంపిణీ చేస్తారు. చైనాలో ఏటా మరణాల రేటు ప్రకారం లెక్కిస్తే గత రెండున్నర నెలల్లో వుహాన్‌లో 16,000 మంది చనిపోతారని అంచనా. మొత్తం 42,000ల్లో ఈ సంఖ్యను తీసేస్తే 26,000. అంటే చిన్న తర్కంతోనే ఇంతమంది కొవిడ్-19తో చనిపోయారని తెలుస్తోంది. అక్కడి ప్రజలైతే ఇంకా ఎక్కువమంది చనిపోయారని అంటున్నారు.
* ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని అధిపతి టెడ్రోస్ అధానోమ్, జిన్‌పింగ్ పాత్రలపై సర్వత్రా అనుమానమే ఉంది. గతేడాది నవంబర్‌లో వైరస్ ప్రబలితే జనవరి 10న మొదటి రోగికి చికిత్స అందించినట్టు రికార్డుల్లో రాసుకోవడం చైనా వంచనకు ఉదాహరణ. ముందు ఇది జంతువుల నుంచి సంక్రమిస్తుందని ఆ దేశం చెప్పింది. దానినే అధానోమ్ వల్లెవేశారు. మనుషుల నుంచి మనుషులకు వచ్చినట్టు ఆధారాలే లేవని మరోసారి పేర్కొన్నారు. అంతర్జాతీయ విమాన సేవలను నిలిపివేయాల్సిన అవసరం లేదని నమ్మబలికారు. చైనాలో లాక్డౌన్ పెట్టగానే మనుషుల నుంచి మనుషులకు వస్తుందని అంటువ్యాధిగా ప్రకటించారు. మహమ్మారిగా ప్రకటించేందుకు ఆలస్యం చేశారు. చివరికీ ప్రకటించారు. అధానోమ్ స్వదేశమైన ఈజిప్టులో చైనా పెట్టుబడులు పెట్టింది. అసలు అధానోమ్ ఎంపిక వెనక చైనా ఉందని తెలుస్తోంది. అందుకే ఆయన దాని మాటలకు లొంగి సత్యాన్ని దాచారని అనిపిస్తోంది. ఇప్పుడిక మరణాలు, కేసుల నమోదులోనూ చైనా పచ్చి అబద్ధాలు చెప్పిందని బయటపడుతోంది.
* ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటివరకు 200 దేశాలకు విస్తరించిన కొవిడ్ 19.. భారత్‌లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1418 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, మృతుల సంఖ్య 45కి చేరినట్టు తెలిపింది. ఇవాళ ఒక్కరోజే 167 కేసులు నమోదవ్వగా.. 13 మరణాలు చోటుచేసుకున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి కోలుకొని 123 మంది డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. మరోవైపు తెలంగాణలో 77 మందికి ఈ వైరస్ సోకగా 14 మంది కోలుకున్నారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ 40 మందికి ఈ వైరస్ సోకగా.. ఇద్దరు కోలుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
* దేశ రాజధాని నగరంలో గత రెండు రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా పెరిగినట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటివరకు దిల్లీలో 97 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరిలో 41 మంది విదేశాల నుంచి వచ్చినవారేనన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘24 మంది కరోనా బాధితులు మర్కజ్ సమావేశంలో పాల్గగొన్నవారు. మర్కజ్ భవనం నుంచి 1548 మందిని బయటకు తీసుకొచ్చాం. అందులో 441 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయి. వారిని ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. 1107 మందిని మర్జ్భవనం నుంచి క్వారంటైన్‌కు తరలించాం. మర్కజ్ విషయంలో నిర్లక్ష్యంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాశాం’’ అని వివరించారు.
* మహమ్మారి కరోనా ప్రభావం కారాగారాలపైనా పడింది. ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
* తెలంగాణలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చిందని డీఎంహెచ్‌వో సుధాకర్లాల్ వెల్లడించారు. దిల్లీ నిజాముద్దీన్‌లో ప్రార్థనలకు జిల్లా నుంచి 11 మంది వెళ్లినట్లు గుర్తించి వారి నమూనాలను పరీక్షలకు పంపించామని చెప్పారు. 10 మంది వైద్య పరీక్షల రిపోర్టులు రాగా.. వారిలో తొమ్మిది మందికి నెగటివ్ రాగా.. ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. మరొకరి నివేదిక రావాల్సి ఉందని డీఎంహెచ్‌వో సుధాకర్ లాల్ తెలిపారు.
* దేశంలో మొత్తం మీద కరోనా కేసులు 1430 నమోదు అయ్యాయి. అయితే కేవలం ఆరు రాష్ట్రాలలో మాత్రమే ఇంకా ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. వాటిలో అస్సాం కూడా ఒకటి. అస్సాంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మోడీ ఆదేశాల మేరకు 21 రోజుల లాక్ డౌన్ ను కచ్చితంగా పాటిస్తున్నారు. లాక్ డౌన్ లో ఉండి తమ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకుండా జాగ్రత పడుతున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి సమీర్ సిన్హా తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు మేరకు.. తమ రాష్ట్రంలో స్క్రీనింగ్ మరియు పరీక్షలపై దృష్టిపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ఒక వేళ పాజిటివ్ కేసులు వచ్చినా ఎదుర్కొవడానికి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలను సిద్ధం చేసుకున్నట్లు కూడా ఆయన తెలిపారు.
* విజయనగరం జాయింట్ కలెక్టర్ చేసిన సర్ ఫ్రైజింగ్ పనికి అందరూ మెచ్చుకుంటున్నారు. సినిమా స్టైల్లో మారు వేశంలో వచ్చి కూరగాయల మార్కెట్ లో తనిఖీ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. విజయనగరం జిల్లాలో లాక్ డౌన్, 144 సెక్షన్ కారణంగా నిత్యావసర వస్తువులు, కొరగాయలు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కాకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్ దీనిపై దృష్టి సారించారు.
* కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడడంతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశంలో జరిగింది. చట్ట సభ్యులు మొదలు ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల వరకు కోత విధించాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.
జీతంలో కోతలు ఇలా..
ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత
ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత
మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం తగ్గింపు
నాలుగో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కుదించి చెల్లింపులు
అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కటింగ్
నాలుగో తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 10 శాతం కోత
అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత ఉంటుందని సీఎంవో ప్రకటించింది.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సాలరీలను రెండు విడతల్లో చెల్లిస్తామని ఆ రాష్ట్ర సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సీఎంతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈ నెలలో సగం జీతం చెల్లిస్తామని… నిధులు సర్దుబాటు అయ్యాక మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఆయన అన్నారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా సాలరీ తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు చెప్పారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని… ఆ తర్వాత నుంచి యథావిథిగా మొత్తం ఒకే సారి ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారన్నారు.
* ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు 40కి చేరాయి. కేవలం 12 గంటల్లో 17 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నిన్నటి(సోమవారం) వరకూ రాష్ట్రంలో 23 కేసులు నమోదుగా కాగా ఇవాళ 40కి చేరుకున్నాయి. వీరిలో ఎక్కువ మంది ఢిల్లీలోని మత ప్రార్థనలకు హాజరైన వారు, మక్కాకు వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్ లో ఉన్న వాళ్లే.
* ఢిల్లీ నిజాముద్దిన్ ప్రాంతంలో జరిగిన మతపరమైన ప్రార్ధనల్లో రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున హాజరైనట్లు సమాచారం. ఈ ప్రార్ధనల్లో పాల్గొన్న ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు కరోనా వైరస్ సోకడంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని జిల్లాల నుంచి ప్రార్ధనల్లో పాల్గొన్న వారి వివరాల్ని సేకరించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రార్ధనల్లో పాల్గొన్న ప్రజలు తక్షణమే ప్రభుత్వానికి సహకరించి కరోనా వైరస్ టెస్ట్ లు చేసుకోవాలని కోరారు. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లా – 0, విజయనగరం జిల్లా – 3, విశాఖపట్నం రూరల్ – 1, విశాఖపట్నం సిటీ- 41, తూర్పు గోదావరి జిల్లా- 6, పశ్చిమ గోదావరి జిల్లా-16,రాజమండ్రి-21,కృష్ణ జిల్లా-16, విజయవాడ సిటీ-27, గుంటూరు అర్బన్-45, గుంటూరు రూరల్-43, ప్రకాశం జిల్లా -67, నెల్లూరు జిల్లా – 68, కర్నూల్ జిల్లా-189, కడప జిల్లా-59, అనంతపూర్ జిల్లా- 73, చిత్తూరు జిల్లా-20,తిరుపతి- 16 మంది పాల్గొన్నారు. వారు తక్షణమే కరోనా టెస్ట్ లు చేయించుకొని ప్రభుత్వానికి సహకరించాలని వైద్య శాఖ అధికారులు కోరుతున్నారు.