కరోనా వైరస్ చికిత్సలో అత్యంత ప్రధానమైన, కీలకమైన పరికరం ‘వెంటిలేటర్’. ప్రాణాపాయ స్థితిలో వాడే వెంటిలేటర్ కరోనా పీడితులలో ఎవరికి అవసరం ఎవరికి? ఎంతమేరకు? దీని ప్రభావం ఎంత? పని చేసే తీరు ఏంటి?
*శ్వాసకోశ వ్యవస్థను పరిరక్షించుకోలేకపోతే శ్వాస అందక, రక్తంలో సరిపడా ఆక్సిజన్ కలవదు. ఫలితంగా ఊపిరితిత్తులతో పాటు అంతర్గత అవయవాలు ఒక్కొక్కటిగా పని చేయడం మానేస్తాయి. ఫలితంగా, అంతిమంగా మరణం సంభవిస్తుంది. కరోనా వైరస్ మరణాలకు మూల కారణం ఇదే! కాబట్టి శ్వాసకోస వ్యవస్థను రక్షించుకునే చర్యల్లో భాగంగా గొంతులో నుంచి నేరుగా ఊపిరితిత్తుల్లోకి గాలిని పంప్ చేసే వెంటిలేటర్లను వాడవలసి ఉంటుంది.
***ఎవరికి అవసరం?
రోగి ప్రాణాలను కాపాడడం కోసం వైద్యులు చేసే చివరి ప్రయత్నం వెంటిలేటర్ అమర్చడం! రోగి తనంతట తాను గాలి పీల్చుకోలేని దశలో వెంటిలేటర్ అవసరం. సాధారణంగా ఊపిరితిత్తులు గాలిని పీల్చుకుని, దాన్లోని ఆక్సిజన్‌ను సంగ్రహించి, రక్తంలో కలిసేలా చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్‌ను తిరిగి ముక్కు ద్వారా బయటకు పంపిస్తూ ఉంటాయి. కరోనా వైరస్ ప్రభావంతో ఊపిరితిత్తుల సామర్థ్యం కుంటుపడినప్పుడు, రోగి తనంతట తాను గాలి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు వెంటిలేటర్ మీద ఆధారపడక తప్పదు. ఈ పరికరం ఆస్పత్రిలో బెడ్ పక్కనే ఏర్పాటై ఉంటుంది. ఇది రోగి ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను పంపించడంతో పాటు, కార్బన్ డయాక్సైడ్‌ను సేకరించి, వెలుపలికి వదులుతుంది. అయితే రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి, అందుకు తగినట్లు వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ఒత్తిడి, పరిమాణాలను సరిచేయవలసి ఉంటుంది.
***వెంటిలేటర్ అమరిక ఇలా…
గొంతులో నుంచి స్వరపేటిక మీదుగా ఊపిరితిత్తుల్లోకి ‘ఇంట్యుబేషన్’ ట్యూబ్‌ను అమర్చే క్రమం కొంత క్లిష్టమైన ప్రక్రియ. దీన్ని అమర్చే సమయంలో పొరపాట్లు జరగకుండా ఉండడం కోసం సాధారణంగా వైద్యులు రోగులను మెలకువగానే ఉంచుతారు. రోగి మెలకువగా ఉన్న పక్షంలో, ఆరోగ్య పరిస్థితి గురించి రోగిని ఆరా తీయడం కోసం మత్తు ఇవ్వరు. అయితే వెంటిలేటర్ అమర్చే సమయంలో రోగికి మాట్లాడే వీలు ఉండదు కాబట్టి ప్రశ్నలు అడుగుతూ, రోగి సంజ్ఞల ద్వారా అతని స్థితిని అంచనా వేస్తూ వెంటిలేటర్ అమరిక కొనసాగుతుంది. వెంటిలేటర్ మీద ఉన్న రోగికి నొప్పి తగ్గించే మందులు కొన్ని సందర్భాల్లో వైద్యులు అందిస్తారు. అలాగే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవడం కోసం అవసరాన్ని బట్టి రోగికి ఇచ్చే మత్తు మందు మోతాదునూ తగ్గిస్తారు.
**ఇతర రుగ్మతల్లో కూడా….
కేవలం శ్వాసకోశ సమస్యల్లోనే కాకుండా కొన్ని ఇతర ఆరోగ్య సమస్యల్లో కూడా వెంటిలేటర్ అవసరం పడుతూ ఉంటుంది. నాడీకండర వ్యాధులు, అమియోట్రోఫిక్ లేటరల్ స్క్లెరోసిస్, బ్రెయిన్ డ్యామేజ్ మొదలైన సందర్భాల్లో రోగి ప్రాణాలు కాపాడడం కోసం వెంటిలేటర్ అమరుస్తారు.
***వెంటిలేటర్ల కొరత!
ప్రస్తుతం మన దేశంలో దాదాపు లక్ష వెంటిలేటర్లు ఉన్నాయి. అయితే వైద్య నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొవెడ్ – 19 రోగుల ప్రాణాలు కాపాడుకోవాలంటే, ప్రతి 10 వేల మంది రోగులకూ 2.1 వెంటిలేటర్లు అవసరం అవుతాయి. దీన్ని బట్టి ప్రస్తుతం మన దేశానికి 70 వేల వెంటిలేటర్ల తక్షణ అవసరం ఉంది. అయితే అతి తక్కువ సమయంలో నెలకు నాలుగు నుంచి ఐదు వేల వెంటిలేటర్ల చొప్పున వెంటిలేటర్లను ఏర్పాటుచేసుకోగలిగితే కరోనా రోగుల ప్రాణాలను కాపాడుకోవచ్చు అని అంటున్నారు వైద్య నిపుణులు.
వెంటిలేటర్‌కు కొరోనాకు సంబంధం ఏమిటి?
Related tags :