ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి వదిలి పోవాలి.. లాక్‌డౌన్ ఎత్తివేసి అందరూ మళ్లీ సాధారణ జీవితాన్ని పొందాలి అని కోరుకుంటుంటే కొందరు మాత్రం ఎప్పటికి తమ ఇంట్లో కరోనా, లాక్‌డౌన్ ఉండాలని కోరుకుంటున్నారు. అదేంటి అలా ఎవరు కోరుకుంటారు అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్‌లోని దొయిరా జిల్లాలోని కుకుండు గ్రామంలో పుట్టిన ఒక బాబుకు అతని తల్లిదండ్రులు ‘లాక్‌డౌన్’ అని నామకరణం చేశారు.
ఈ విషయం పై బాబు తండ్రి పవన్ మాట్లాడుతూ ‘మా అబ్బాయి లాక్‌డౌన్ కాలంలో పుట్టాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో లాక్‌డౌన్ విధించి ఎంతో మంది ప్రాణాలు కాపాడినందుకు మేం ప్రధాని నరేంద్రమోదీని అభినందిస్తున్నాం. జాతి ప్రయోజనం కోసం లాక్‌డౌన్ విధించారు. అందుకే మేం మా బాబుకి ఆ పేరు పెట్టాం’ అని తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…లాక్‌డౌన్ కారణంగా నవ శిశువును చూడటానికి తమ ఇంటికి ఇప్పుడు ఎవ్వరూ రావొద్దని, లాక్‌డౌన్ సమయంలో అందరూ ఇంటికే పరిమితం కావాలని కోరారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాతే తమ బాబును చూడాలని కోరారు.
ఇదిలా ఉండగా జనతాకర్ఫ్యూ విధించిన సమయంలో జన్మించిన అడ శిశువుకు ఉత్తరప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్ జిల్లాలో ఉంటున్న ఆమె మేనమామ ‘కరోనా’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మేనమామ నితీష్ త్రిపాఠి మాట్లాడుతూ ‘కరోనా వైరస్ అందరిని ఒక్కటి చేసి పోరాడేలా చేస్తోంది. కరోనా వైరస్ ప్రమాదకారి అనడంలో సందేహం లేదు, దాని కారణంగా చాలా మంది చనిపోయారు కూడా. కానీ కరోనా వైరస్ మనకి చాలా మంచి అలవాట్లను నేర్పించింది. అందరినీ దగ్గర చేసింది. ఈ పాప చెడుకు వ్యతిరేకంగా ఐకమత్యంగా చేసే పోరాటానికి ప్రతీక’ అని ఆయన పేర్కొన్నారు.