DailyDose

కరోనాకు మందు కనుగొన్న కాలిఫోర్నియా వైద్యుడు-తాజావార్తలు

California Doctor Announces Medicine For COVID19-Telugu Breaking News Roundup Today

* చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్ల తగ్గింపు సరైన చర్య కాదని, ఇది ఎవరో ఇచ్చిన చెత్త సలహా ఆధారంగా తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పీ చిదంబరం అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఆపద సమయంలో ప్రజల జీవితాలను కాపాడటం ముఖ్యమని, జీడీపీ లెక్కలు కాదని చిదంబరం హితవు పలికారు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు చెత్త సలహాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటాయనే విషయం తనకు తెలుసని, అయితే ఇంత చెత్త సలహా పట్ల తాను ఆశ్చర్యపోతున్నానని వ్యాఖ్యానించారు.

* కరోనా వైరస్‌ బాధితులను రక్షించేందుకు మందు కనిపెట్టామని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె ప్రకటించారు. సార్స్‌ వైరస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన ‘యాంటీ బాడీస్‌’నే ఉపయోగించి తన బృందం కరోనా వైరస్‌పై విజయం సాధించిందని ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’ ల్యాబ్‌కు సీఈవోగా వ్యహరిస్తున్న ఆయన చెప్పారు. ఐదుగురుతో కూడిన తన బృందం ఐదు యాంటీ బాడీస్‌ను తీసుకొని లోతుగా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. సార్స్‌ను నిర్వీర్యంచేసే యాంటీ బాడీస్‌తోనే తమ ప్రయోగం ఫలించిందని పాండిమిక్‌ నెట్‌ఫ్లిక్స్‌ తీసిన డాక్యుమెంటరీలో కనిపించిన డాక్టర్‌ జాకబ్‌ వివరించారు.

* కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉచిత బియ్యా్న్ని పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు హైదరాబాద్‌ ముఖ్య రేషనింగ్‌ అధికారి బాలమయా దేవి తెలిపారు. నగరంలో 675 చౌక ధరల దుకాణాలు ఉండగా.. 5.80 లక్షల మంది కార్డుదారులు ఉన్నారని తెలిపారు. ఒక్కో దుకాణంలో రోజుకు 100 కూపన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కూపన్లు ఉన్నవాళ్లే నిర్దేశించిన సమయంలో రావాలని సూచించారు. సామాజిక దూరం పాటించేలా తగిన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. చౌకధర దుకాణం వద్ద శానిటైజర్లు, మంచినీరు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి బియ్యం అందిస్తామనీ.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ రోజు కేవలం నగరంలో 54 దుకాణాలు మాత్రమే తెరిచినట్టు చెప్పారు. ఈ నెల 3వ తేదీ వరకు అన్ని చౌకధరల దుకాణాలు తెరిచి బియ్యం పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు.

* కరోనా వైరస్‌ భయంకరంగా వ్యాపిస్తోందని, ఏపీలో ఇవాళ ఒక్కరోజే 17 కేసులు నమోదయ్యాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కరోనా నివారణకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని, కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని చెప్పారు. కరోనా గురించి అనేకమంది నిపుణులతో చర్చించానని, కరోనా పాజిటివ్‌ వ్యక్తి తాకిన వస్తువును మరొకరు తాకితే వ్యాధి వస్తుందని చెప్పారు. దీనిపై ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుంటే కొంతవరకు కరోనా నుంచి కాపాడుకోవచ్చని చెప్పారు. ప్రతిరోజూ వేడినీటితో ఆవిరిపడితే ఆరోగ్యానికి చాలా మంచిదని సూచించారు. తరచూ వేడి నీరు పుక్కిలించాలన్నారు. నిల్వ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ప్రాణాయామం, యోగా, వ్యాయామం, ఎండలో ఉండటం లాంటివి చేయాలని కోరారు. బయటకి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలన్నారు. సీ-విటమిన్‌ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలన్నారు.

* కరోనా వైరస్‌ వల్ల తెలంగాణలో ఆరుగురు చనిపోవడం ఎంతగానో కలవరపెట్టిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నప్పటికీ ఇది సరైన సమయం కాదని ఎత్తిచూపడం లేదన్నారు. ఈ మేరకు రేవంత్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

* కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల కార్మికులు, కూలీలు ఉపాధి కోల్పోయారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యాన, ఆక్వా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, కార్మికుల, రైతుల సమస్యలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. మార్కెట్లు మూతపడి అరటి రైతులు చాలా నష్టపోయారని, రైతుల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని పవన్‌ డిమాండ్‌ చేశారు.

* తెలంగాణ నుంచి 1000 మందికి పైగా దిల్లీలోని మర్కజ్‌కు వెళ్లారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వీరిలో 160 మంది మినహా అందరినీ గుర్తించామని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కరోనా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్‌ జరగలేదన్నారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మందికి ఇవాళ నెగటివ్‌ వచ్చిందని.. మరోమారు వారిని పరీక్షించి డిశ్చార్జ్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఇద్దర్ని డిశ్చార్జ్‌ చేసినట్లు చెప్పారు. డిశ్చార్జ్‌ అయినవారు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటారన్నారు. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో ఆరుగురు మృతిచెందారని మంత్రి తెలిపారు.

* ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జస్టిస్‌ చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇరాన్‌లో 850 మంది భారత యాత్రికులు చిక్కుకున్నారని.. వారిని వెనక్కి తీసుకురావాలని పిటిషనర్‌ కోరారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ అక్కడ చిక్కకున్న వారిలో సుమారు 250 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని, వారికి సరైన వైద్యం అందడం లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు స్పందిస్తూ అక్కడ ఉన్నవారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వెనక్కి తీసుకొచ్చే అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

* కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత బియ్యం పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. హైదరాబాద్‌ నగరంతో పాటు పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు ఉచిత బియ్యా్న్ని పంపిణీ చేశారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఒక్కొక్కరికి 12కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు హైదరాబాద్‌ ముఖ్య రేషనింగ్‌ అధికారి బాలమయా దేవి తెలిపారు. నగరంలో 675 చౌక ధరల దుకాణాలు ఉండగా.. 5.80 లక్షల మంది కార్డుదారులు ఉన్నారని తెలిపారు. ఒక్కో దుకాణంలో రోజుకు 100 కూపన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. కూపన్లు ఉన్నవాళ్లే నిర్దేశించిన సమయంలో రావాలని సూచించారు.

* సబ్సిడీ పరిధిలోకి రాని వంట గ్యాస్‌ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు నేడు వెలువడిన ప్రకటన మేరకు దేశవ్యాప్తంగా వంటగ్యాస్‌ ధర రూ.61-65 వరకూ తగ్గనుంది. గృహోపయోగ గ్యాస్‌ ఇంధనం ధర క్షీణించటం ఇటీవలి కాలంలో ఇది రెండవసారి. గత నెలలో కూడా వంట గ్యాస్‌ ధరలు తగ్గిన సంగతి తెలిసిందే. కాగా, నూతన ధరలు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానున్నాయి.

* మానవాళికే ముప్పుగా తయారైన కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు దీనిబారిన పడ్డారు. దీనంతటికీ కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం చైనా వైపు వేలెత్తి చూపక తప్పదు. ఇలాంటి వైరస్‌కి కారణం అక్కడి ఆహారపు అలవాట్లేననే ఆరోపణలున్నాయి. అక్కడి మాంసం విక్రయశాలలు దీనికి ప్రధాన కేంద్రబిందువని భావిస్తున్నారు. అయితే స్వల్ప కాలంలోనే వేల మందిని బలితీసుకున్న ఈ వైరస్‌ కారణంగా చైనా అక్కడి జంతు, సముద్రపు జీవుల విక్రయశాలలను మూసివేసింది. ఈ సమయంలో అక్కడ మళ్లీ మాంసం విక్రయశాలలకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో గబ్బిలాలు, పిల్లులు, కుక్కల మాంసం విక్రయాలు ఊపందుకున్నాయి.

* మత ప్రార్థనలకు వచ్చిన విదేశీయులను వారి స్వస్థలాలకు పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. వారిని తనిఖీ చేసి వీలైనంత త్వరగా వారిని దేశం నుంచి పంపించివేయాలని ఆదేశించింది. వీరిలో ఎవరికైనా కొవిడ్‌-19 ప్రభావం ఉంటే చికిత్స అందజేయాలని సూచించింది. మిగిలిన వారిని అందుబాటులో ఉన్న విమానానికి పంపించాలని ఆదేశించింది. విమానం లేని పక్షంలో వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించాలని తెలిపింది. వారిని తీసుకొచ్చిన సంస్థలే ఖర్చులు భరించేలా చూడాలని హోంశాఖ స్పష్టం చేసింది.

* ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనా వైరస్‌ భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ వైరస్ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1637కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరిలో 38మంది మరణించగా 1466 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రకటించింది. మరో 133మంది కొవిడ్‌-19 నుంచి కోలుకున్నారని తెలిపింది. కేవలం గత 12గంటల్లోనే దేశవ్యాప్తంగా 240కరోనా పాజిటీవ్‌ కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది.

* కరోనా మహమ్మారిపై పోరాటంలో ఒకవేళ ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. కొవిడ్‌-19పై పోరులో వారి సేవలు సైనికుల కంటే తక్కువేమీ కాదని కొనియాడారు. ఈ మేరకు దిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కరోనా బాధితులకు చికిత్స అందించే క్రమంలో వైద్యులు, నర్సులు, పారిశుధ్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి సేవలకు గుర్తింపుగా వారి కుటుంబాలకు కోటి రూపాయలు అందిస్తాం. వారు ప్రభుత్వ లేదా ప్రైవేటు రంగం అనే దాంతో సంబంధం లేకుండా ఈ మొత్తం అందదజేస్తాం’’ అని కేజ్రీవాల్‌ వెల్లడించారు.

* దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ కొందరు ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అత్యవసర పనులు లేకున్నా వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారికోసం తాత్కాలిక జైళ్లను ఏర్పాటుచేశారు లుథియానా అధికారులు. ఇలా 6వేల మందికి సరిపోయే నాలుగు ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేశామని లుథియానా పోలీస్‌ కమిషనర్‌ రాకేష్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మంగళవారం ఒక్కరోజే నిబంధలను ఉల్లంఘించిన 200మందిని ఈ జైళ్లకు తరలించామని పేర్కొన్నారు.