తన క్రికెట్ కెరీర్‌లో టీమ్‌ఇండియా సారథుల్లో సౌరవ్ గంగూలీనే అందరి కంటే ఎక్కువ మద్దతు ఇచ్చాడని భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో పోలిస్తే దాదా కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన కెరీర్ ఉత్తమంగా సాగిందని తెలిపాడు. ‘‘సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఆడినప్పుడు దాదా నుంచి నాకు ఎంతో మద్దుతు లభించింది. ఆ తర్వాత ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఇద్దరిలో ఎవరు అత్యుత్తమమని చెప్పడం కాస్త కష్టం. అయితే గంగూలీ మద్దతుగా నిలిచిన సమయంలోనే నా కెరీర్‌లో మధురానుభూతులు ఉన్నాయి. అతడు ఎంతో అండగా నిలిచాడు. ధోనీ, కోహ్లీ నుంచి నాకు అలాంటి మద్దతు లభించలేదు’’ అని యవీ వెల్లడించాడు. శ్రీలంక స్పిన్నర్ ముత్తయ మురళీధరన్, ఆసీస్ పేసర్ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడ్డానని యువీ వెల్లడించాడు. అయితే దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ సలహాతో స్వీప్ షాట్లు ఆడటంతో మురళీధరన్ బౌలింగ్‌ను మెరుగ్గా ఎదుర్కొన్నాని తెలిపాడు. టెస్టు జట్టులో ఎక్కువగా చోటు దక్కకపోవడంతో మెక్‌గ్రాత్‌ను ఎదుర్కొనే అవకాశాలు పెద్దగా రాలేదని అన్నాడు. మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బలితీసుకోవడం హృదయవిదారకంగా ఉందని యువీ వెల్లడించాడు. ‘‘ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకంగా ఉంది. ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది. ప్రజలు ఎక్కువ భయపడకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో మహమ్మారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి’’ అని పేర్కొన్నాడు. 2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన యువీ.. 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడాడు.
ధోనీకి ఆ బుద్ధి లేదు
Related tags :