ScienceAndTech

GoodNews: పొగాకు నుండి కొరోనా వ్యాక్సిన్

British American Tobacco Announces COVID19 Vaccine News

నేడు ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తోన్న భయానక కరోనా వైరస్‌కు పొగాకు మొక్కల నుంచి వాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు బెన్సన్‌ అండ్‌ హెడ్జెస్, లక్కీ స్ట్రైక్‌ లాంటి ప్రముఖ బ్రాండ్ల సిగరెట్లను తయారు చేస్తోన్న ప్రముఖ ‘బ్రిటీష్‌ అమెరికన్‌ టొబాకో (బీఏటీ)’ కంపెనీ గురువారం ప్రకటించింది. బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి సహకారం లభించినట్లయితే జూన్‌ నెల నుంచి వారానికి 30 లక్షల డోసుల వాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తామని కంపెనీ యాజమాన్యం ప్రకటించింది.

దాదాపు 62 లక్షల కోట్ల విలువైన తమ కంపెనీ కరోనా మహమ్మారికి ఎలాగైనా వాక్సిన్‌ను కనుగొనాలనే లక్ష్యంతో తమ అనుబంధ సంస్థ ‘కెంటకీ బయో ప్రాసెసింగ్‌ (కేబీపీ)’ ముందుగా పొగాకు మొక్కలతో ప్రయోగాలు నిర్వహించి విజయం సాధించిందని, ప్రస్తుతం వైట్‌హాల్‌గా వ్యవహరిస్తోన్న తమ వాక్సిన్‌ను జంతువులపై ప్రయోగించి చూస్తున్నామని, ఆ తర్వాత క్రమపద్ధతిలో మానవులపై ప్రయోగాలు నిర్వహించి, ఆ తర్వాత వాక్సిన్‌ను తయారు చేయాలంటే చాలా సమయం పడుతుందని, ఈ విషయంలోనే తమకు ప్రభుత్వ సహకారం అవసరమని, అది ఉంటే వచ్చే జూన్‌ నుంచే వాక్సిన్‌ను తయారు చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

తాము ఇంతవరకు నిర్వహించిన ప్రయోగాలు, వాటి ఫలితాలను ఏమాత్రం లాభం లేకుండా ప్రభుత్వానికి విక్రయించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని లండన్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం బీఏటీ లాంటి సిగరెట్ల కంపెనీలతో బ్రిటన్‌ ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలు చేసుకోవడానిని వీల్లేదు. ఈ కారణంగా ఈ విషయంలో తాము ప్రపంచ ఆరోగ్య సంస్థతో కూడా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. ఈ వాక్సిన్‌ గురించి తాము ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ సోషల్‌ కేర్‌’ను, అమెరికాకు చెందిన ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ సంప్రతించినట్లు తెలిపింది.