నూట నాలుగు సంవత్సరాలు జీవించడం గొప్ప విషయమే. అసాధ్యమైతే కాదు. అయితే చివరి వరకూ ఆ జీవితాన్ని సాఫల్యం చేసుకున్నవారు అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి దాదీ జానకి. బ్రహ్మకుమారీస్ సంస్థలకు అధిపతిగా, ఆరుదైన ఆధ్మాత్మికవేత్తగా ప్రపంచం మొత్తం గౌరవించిన వ్యక్తి ఆమె. సమావేశాలలో మాట్లాడేటప్పుడు దాదీ జానకి తరచూ మూడు ప్రశ్నలు వేసేవారు. నేను ఎవరిని? నేను ఎవరికి చెందిన వ్యక్తిని? ఈ సమయంలో నేను చేయాల్సిందేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తరువాత చెప్పుకోవచ్చు. ఆలోచించి చూస్తే… దాదీ జానకి నిండు నూరేళ్ళ పైచిలుకు జీవితంలో ఎక్కువ భాగాన్ని ఈ ప్రశ్నలే నడిపించినట్టు కనిపిస్తుంది.అవిభక్త భారతదేశంలోని సింధ్ ప్రాంతంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) 1916లో దాదీ జానకి జన్మించారు. వారిది ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్న కుటుంబం. ఆమె తండ్రి శాకాహారం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు వివరిస్తూ ఉండేవారు. ఆయనతో పాటు గుర్రం మీదా, బగ్గీలో జానకి కూడా వెళుతూ ఉండేవారు. వయోధికులు, అనారోగ్యంతో ఉన్నవారితో మాట్లాడుతూ ధైర్యం నింపేవారు. సింధ్ ప్రాంతంలోని హైదరాబాద్‌లో 1936లో దాదా లేఖ్‌రాజ్ ఈశ్వరీయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేశారు. తదనంతర కాలంలో ఆయన ప్రజాపిత బ్రహ్మగా పేరు పొందారు. ఆధ్యాత్మిక పురోగతిని కోరుకున్న జానకి 1937లో ఆ విశ్వవిద్యాలయంలో చేరారు. బ్రహ్మకుమారీస్‌గా ప్రాచుర్యం పొందిన ఈ సంస్థ ప్రారంభం నుంచి మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. ప్రపంచంలో మహిళలే నడిపే అతి పెద్ద ఆధ్యాత్మిక సంస్థగా రూపుదిద్దుకుంది. సుమారు 83 ఏళ్లు ఆ సంస్థే తన లోకంగా గడిపిన దాదీ జానకి కూడా ఈ క్రమంలో తనదైన, ఘనమైన పాత్ర పోషించారు. దేశ విభజన తరువాత రాజస్థాన్‌లోని మౌంట్ అబూను బ్రహ్మకుమారీస్ ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. ఆ తరువాత అంతర్జాతీయంగా తమ సందేశాన్ని ప్రచారం చెయ్యాలనే ఆలోచన చేసినప్పుడు, ఆ బాధ్యతలను దాదీ జానకి స్వీకరించారు. 1974లో లండన్ వెళ్ళి బోధనలు ప్రారంభించారు. ఇంతకీ ఆమె చిన్నప్పుడు బడిలో చదువుకున్నది మూడేళ్ళే! ఇంగ్లీష్ అసలే రాదు. అయినా బ్రహ్మకుమారీల వాణిని విశ్వవ్యాప్తం చెయ్యాలన్న సంకల్పంతో ఆమె లండన్‌లో అడుగుపెట్టారు. ఆంగ్ల అనువాదకుల సాయంతో ప్రచారం సాగించారు. ఆమె సారథ్యంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రపంచమంతటా విస్తరించింది. ్రహ్మకుమారీస్ అంతర్జాతీయ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. 110కి పైగా దేశాల్లో 8వేల పైచిలుకు శాఖలు నడుస్తున్నాయి. పది లక్షల మందికి పైగా విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. 2007లో దాదీ ప్రకాశ్‌మణి భౌతిక లోకాన్ని విడిచిపెట్టడంతో బ్రహ్మకుమారీస్ పూర్తి బాధ్యతలను దాదీ జానకి స్వీకరించారు. అప్పటికి ఆమె వయసు 91 సంవత్సరాలు. ఆ తరువాత పదమూడేళ్ళ పాటు సంస్థ నిర్వహణలో దాదీ జానకి పాలుపంచుకున్న తీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. వందేళ్ళు దాటినా ధాటిగా ఉపన్యాసాలు ఇచ్చేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఆమె చురుగ్గా ఉండేవారు. సందేహాలకు సమాధానాలు కూడా సహాయకుల ద్వారా అందించేవారు. ‘స్వచ్ఛ భారత్’ లాంటి కార్యక్రమాల్లో సైతం పాలుపంచుకున్నారు. ఆధ్యాత్మిక పయనంలో ‘నేను ప్రశాంతమైన ఆత్మను’, ‘నేను దేవుడికి చెందిన వ్యక్తిని, కాబట్టి దివ్యమైన పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలి’, ‘ఆత్మ చైతన్యాన్ని పెంచుకొనే తరుణం ఇదే కాబట్టి, ఈ సమయంలో దానికోసం ప్రయత్నిస్తూ ఉండాలి’ అని తెలుసుకున్నారు. ఆ ఎరుకనే ప్రజలకు తెలియజెప్పడానికి ప్రశ్నల రూపంలో వేసేవారు. సమాధానాలూ తానే చెప్పేవారు. ఈ మార్చి 27న ఆమె భౌతిక దేహాన్ని విడిచి ఆ పరమాత్మ చైతన్యాన్ని అందుకున్నారు.
నాది ప్రశాంతమైన ఆత్మ
Related tags :