ప్రపంచవ్యాప్తంగా వేల ప్రాణాలు బలి తీసుకుంటున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ఆస్ట్రేలియా ప్రీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రాథమిక దశ పరీక్షలు నిర్వహించడం ప్రారంభించామని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దశ పూర్తికావడానికి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీని తర్వాత అత్యంత సవాళ్లతో కూడుకున్న దశలను ఎదుర్కోవాల్సి ఉందని అభిప్రాయపడింది. పరిశోధనలు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ వచ్చే ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ముందుగానే ప్రకటించినట్లుగా వ్యాక్సిన్‌ను 18 నెలల్లో తయారు చేస్తామనే మాటకు కట్టుబడి ఉన్నామని కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఆర్ఓ) డైరక్టర్ గ్రెన్‌ఫెల్ పేర్కొన్నారు. ఈ వైరస్‌పై పరిశోధనలు ప్రారంభించిన కేవలం ఎనిమిది వారాల్లోనే ప్రీ-క్లినికల్ దశకు చేరుకున్నామని తెలిపారు. సాధారణంగా ఈ దశకు చేరడానికి రెండు సంవత్సరాలు పడుతుందన్నారు. దీనికోసం శాస్త్రవేత్తలు నిరంతర కృషి చేస్తున్నారని గ్రెన్‌ఫెల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వాక్సిన్ అభివృద్ధి చేయడంలో అనేక దేశాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. వీటిలో ఆస్ట్రేలియా ముందంజలో ఉందనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే, ప్రపంచవ్యాప్తంగా 205 దేశాలకు పాకిన ఈ కరోనా వైరస్ బారిన పడినవారి సంఖ్య 9లక్షలకు చేరుకోగా 47వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
హమ్మయ్యా….ఆస్ట్రేలియాలో కొరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు ప్రారంభం

Related tags :