WorldWonders

₹15లక్షలకు బ్లాక్‌మెయిల్ చేసిన సత్తుపల్లి సూర్యా విలేఖర్లు

Khammam District Sattupalli Surya Reporters Jailed For Bribery

ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వ విజయ్ బాబు పై నిరాధారమైన కథనాలను రాయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డ సూర్య పత్రిక విలేకరులను నేడు పోలీసులు అరెస్టు చేశారు. గత కొద్ది రోజులుగా విజయ్ బాబుపై సూర్య పత్రికలో కొన్ని కథనాలు వెలువడ్డాయి.తనపై ఇలా ఎందుకు రాస్తున్నారని ఆయన ప్రశ్నించగా 30 లక్షల రూపాయలు ఇస్తే రాయడం ఆపేస్తామని సూర్య పత్రిక విలేకరులు సమాధానమిచ్చారు. తాను నిజాయితీగా పని చేశానని, తనపై నిరాధారంగా రాస్తున్నారని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు సరికదా మరింతగా బెదిరించారని విజయ్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కనీసం 15 లక్షల రూపాయలు అయినా ఇస్తే తాము కథనాలు రాయడం నిలిపి వేస్తామని వారు చెప్పినట్లు విజయ్ బాబు తెలిపారు. అయితే తాను అంత ఇవ్వలేని ఆయన స్పష్టం చేశారు. చివరకు ఐదు లక్షల రూపాయల నగదు, 500 సూర్య పత్రికలకు సంవత్సర చందా కట్టే విధంగా ఒప్పందం కుదిరింది.డబ్బులు తీసుకోవడానికి సూర్య పత్రిక ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మూర్తి, జిల్లా ఇన్చార్జి సత్యనారాయణ, సత్తుపల్లి రిపోర్టర్ నిమ్మగడ్డ శ్రీకాంత్ విజయ్ బాబు ఇంటికి వెళ్లారు. గురువారం సాయంత్రం విజయబాబు ఇంటికి వెళ్ళిన ఈ ముగ్గురు ఆ సమయంలో ఆయన అక్కడ లేకపోవడంతో ఆయన భార్య తో దురుసుగా ప్రవర్తించి ఆమెను దుర్భాషలాడారు.గెస్ట్ హౌస్ లో విజయబాబు ఉన్నట్లు తెలుసుకుని అతని వద్దకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో ఆయన అన్ని విషయాలపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తుపల్లి సీఐ రమాకాంత్ సిబ్బందితో వచ్చి వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఆ తర్వాత విజయ్ బాబు మీడియాతో మాట్లాడుతూ తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళతానని చెప్పారు. తాను ఎంతో నిజాయితీగా పని చేసినా కూడా తనను విలేకరులు వేధించడం అసత్య కథనాలు రాయడం బాధ కలిగించిందని తెలిపారు. ఖమ్మంలో ఎడిషన్ ఉన్నా సూర్య పత్రిక ప్రింట్ కాదని, కేవలం డిజిటల్ పేపర్ పెట్టుకుని దాన్ని వాట్సప్ లలో అందరికి పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.

Sathupally Town - YouTube