Politics

కందిపప్పు లేదు. శనగపప్పు తీసుకోండి.

Andhra Minister Kodali Nani Speaks On Ration Groceries To Poor

ఈ సారి కందిపప్పు స్థానంలో శనగపప్పు: మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే రెండవ విడత ఉచిత రేషన్ కు ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. ఈ నెల 13వ తేదీ నాటికి గోదాముల నుండి రేషన్ షాపులకు నిత్యవసర సరుకులను సరఫరా చేస్తామన్నారు.

గత నెల 29వ తేదీ నుండి మొదటి విడత రేషన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటివరకు ఒక కోటి 18 లక్షల ఒక వెయ్యి 827 రేషన్ కార్డులకు నిత్యావసరాలను సరఫరా చేశామని, ఈనెల 14వ తేదీ వరకు పంపిణీ జరుగుతుందన్నారు. 15 వ తేదీ నుండి జరిగే రెండో విడత రేషన్ పంపిణీలో కార్డులోని ప్రతి ఒక్కరికి ఐదు కేజీల చొప్పున బియ్యం, ఈసారి కందిపప్పు స్థానంలో ప్రతి రేషన్ కార్డుకు కేజీ శనగపప్పును ఉచితంగా అందజేస్తామన్నారు.

రేషన్ షాపుల్లో రద్దీ నియంత్రణకు ఈసారి అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాలంటీర్ల ద్వారా కూపన్ లను జారీ చేస్తామన్నారు. కూపన్ ల వారిగానే రేషన్ షాపుల్లో కార్డుదారులు నిత్యావసర వస్తువులను తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెడ్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులను సరఫరా చేస్తామన్నారు. పేద ప్రజల ఆకలి బాధలను తీర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రి కొడాలి నాని చెప్పారు.