ఎక్కడెక్కడ రామనామం వినబడుతుందో అక్కడక్కడ ఆనందాశ్రువులు కారుస్తూ, శిరసువంచి హనుమంతుడు వుంటాడు. హనుమంతుని స్మరణవల్ల మనకు బుద్ధి, బలం, కీర్తి, ధైర్యం, భయరహిత స్థితి, బద్దక రాహిత్యం, చక్కగా మాట్లాడే శక్తి లభిస్తాయి. ‘ధీమంతుడైన హనుమంతుని వెంట ప్రతినిత్యం ఒక గంట నడవండి, మీ బుద్ధి వికసించి మాట్లాడే విధానం అలవడుతుంది’ అంటారు ఉషశ్రీ. ఈ హనుమజ్జయంతి వేళ ఆ భక్తాగ్రేసరులోని ప్రత్యేకతలు, వారి ఆరాధనవల్ల లభించే ప్రయోజనాలు తెలుసుకొందాం.
*చైత్రశుద్ధ పౌర్ణమినాడు హనుమంతుని జననంగా కొందరు చెబితే, వైశాఖ బహుళ దశమినాడు జన్మించాడని మరికొందరు అంటారు. ఏది ఎలా ఉన్నా, చైత్రశుద్ధ పౌర్ణమినాడు ‘హనుమత్ జయంతి’ని జరుపుకోవడం ఆచారంగా వస్తున్నది. అతి పవిత్రమైన తిరుమలకొండపై వానర జంటయైన కేసరి, ఆంజనల పుత్రునిగా రామాయణంలో దర్శనమిస్తాడు హనుమ. నిజానికి ప్రతీ వ్యక్తిలోని నిద్రాణమైన ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా లేదా మహత్తరమైన ఉదాహరణగా మారుతి కనిపిస్తాడు. ప్రతీ వ్యక్తిలో పశుప్రవృత్తి నిద్రాణమై ఉంటుంది. అలాగే, ‘అనంతమైన ఆనందమూ’ ఉంటుంది. దానినే ‘ఆధ్యాత్మికత’ అంటాం. ఆ ప్రవృత్తీ సుప్తావస్థలోనే ఉండటం గమనార్హం. ‘ఎవరిలోనైనా పశుప్రవృత్తి అచేతనమై, పవిత్రమైన దివ్యశక్తి వెలుగుచూడాలి’ అంటే ‘అలాంటి వారిలో శివపార్వతుల శక్తులు చైతన్యవంతం కావాలి’. కానీ, తీవ్రమైన వ్యామోహంతో, కామేచ్ఛతో సంచరించే వారిలో ఈ శక్తులు జాగృతమవడం దాదాపు అసంభవం.
*హనుమంతుని తల్లి అంజనాదేవి ఒక గొప్ప దివ్యత్వానికి ప్రతీక. ఆమె నిరంతర సాధనాదీప్తి అంతచ్ఛేతనలో సుప్తమైన అనంత చైతన్యాన్ని జాగృత పరిచింది. ఫలితంగానే శివపార్వతుల శృంగారక్రీడలో సైతం ఉత్తేజితమైన అద్భుతశక్తి వాయు సంగృహీతమైంది. ఫలితంగా, ఆమె గర్భం ద్వారా ఆంజనేయుని రూపంలో ప్రాకృతిక జగత్తులో బిడ్డ ఆకృతిని పొందింది. తదుపరి కాలంలో శివాంశయైన హనుమంతుడు బ్రహ్మవల్ల వరాలు పొందాడు. అంతటితో ఆగలేదు. విష్ణుసేవలో తరించి పోయాడు. ఈ విశేష గుణాలవల్లే హనుమ మనకు ‘త్రిమూర్తిత్వ’ భావనకు ప్రతీకగా నిలుస్తాడు. అలాగే, హనుమంతుడు, సూర్యోపాసన ద్వారా సూర్యతేజస్సును(సువర్చల) తన వామాంకాన నిలుపుకున్నాడు. అనితర సాధ్యాలైన అష్టసిద్ధులూ (అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశిత్వం, వశిత్వం) అతని వశమయ్యాయి.
*‘హ‘ కారం ఆకాశానికి ప్రతీక. సృష్టి స్థితి లయాత్మకమైన అనంత చైతన్యతత్త్వానికీ అది ప్రతీకగానూ నిలుస్తుంది. ‘ను‘ కారం ఉపాసనకు ప్రతీక. ఏదైతే జీవితాలను ప్రకాశవంతం చేస్తుందో, జీవితాలలో ప్రకాశాన్ని నింపుతుందో దానికి ప్రతీకగా ఈ అక్షరం నిలుస్తుంది. ‘మాన్” అన్నది మనస్సుకు ప్రతీక. మనసుతోపాటు హృదయానికీ (రెంటికి) సంబంధించింది అది. దీనర్థం ఆలోచనకు ప్రతీక. ‘హనుమాన్” అంటే ‘ఏ అనంత చైతన్యమైతే మన జీవితాలలో ప్రకాశాన్ని నింపుతుందో.. ఆ చైతన్యాన్ని గురించి ఆలోచించే వాడు’ (హనుమంతుడు) అనర్థం.
*ప్రతీ వ్యక్తిలో ప్రచ్ఛన్నంగా ఉండే అనంత చైతన్యాన్ని జాగృతం చేసుకునే సాధకుడు హనుమంతుడు. సీతాదేవి అనంత చైతన్యానికి ప్రతీక. రావణుడు అహంకారానికి ప్రతీక. ‘సీత’ అనే చైతన్యం రావణుడనబడే ‘అహంకారాని’కి బంధీ అయింది. అహంకారాన్ని రాముని సేవలో (సేవా భావనతో) నిగ్రహించుకోవడం వల్ల సీత అనబడే చైతన్యాన్ని జాగృతం చేసుకోగలిగిన ఉత్తమ సాధకుడుగా హనుమంతుని చూడాలి. రాముడు సీతాన్వేషణకు హనుమను పంపినప్పుడు తన అంగుళీయాన్ని మాత్రమే ఇస్తాడు. హనుమ సీతను ఇదివరకు చూడలేదు. ఆమెనెలా గుర్తించడం? హనుమకా శంకయే లేదు. ‘అథవాకృత కార్యోహం‘. ‘తప్పక సాధించగలననే’ నమ్మకం, ఆత్మ విశ్వాసం మాత్రమే తనను నడిపించాయి.
*హనుమంతుడు ప్రజ్ఞాపూర్ణ నాయకుడు. విజ్ఞులు ప్రజ్ఞను ‘శ్రుతమయి, చింతామయి, భావనామయి’ అని మూడు రకాలుగా పేర్కొంటారు. వేద ప్రమాణంతో నిర్ణయించేది శ్రుతమయి, బుద్ధితో విచారించి యుక్తితో చెప్పేది చింతామయి. కాగా, సమాధినిష్ఠలో దర్శించి పేర్కొనేది భావనామయి. ఈ మూడు శక్తులనూ ధరించిన ఆంజనేయుని ఆరాధన ముక్తి ప్రదాయకం. జరిగిన దానిని చెప్పేది ‘స్మృతి‘. జరుగనున్న దానిని చెప్పేది ‘మతి‘. భూత-భవిష్యత్-వర్తమానాలను విశదీకరించే విశేషం బుద్ధి‘. ఈ మూడింటినీ తనను ఉపాసించే భక్తులకు అనుగ్రహించే హనుమంతుడిని జ్ఞాపకం చేసుకోవడం, స్మరించడం వల్ల ప్రశాంత మనస్సు కలుగుతుందనడంలో సందేహం లేదు.
*ఆలోచనా దీప్తి
వాల్మీకి రామాయణం చదువుతున్న సమయంలో హనుమ అత్యున్నత వ్యక్తిత్వ పరిణతి, జాగృత స్థితి, శాస్త్ర ప్రావీణ్యత, వినయం, అవసరానికి ఆదుకోగలిగిన వ్యక్తిత్వం, నిజమైన మైత్రీ స్ఫూర్తి, దూరదృష్టి, సేవాసక్తి, నమ్మకమైన అనుచరుని లక్షణాలు, దౌత్య నిర్వహణా సామర్థ్యం, నిర్వహణా నైపుణ్యం, సానుకూల దృక్ఫథం, సకారాత్మక వైఖరి, ఆత్మవిశ్వాసం, కష్ట సహిష్ణుత, బాధ్యతతో వ్యవహరించే నైజం, ఏకమార్గ గతమైన దృష్టి, అంకితభావం, సహచరులతో కలసిపోయే తత్త్వం, బృందంతో కలసి పనిచేయగలిగిన సామర్థ్యం, త్వరగా సరైన నిర్ణయాలు తీసుకోగలిగిన ఆలోచనా దీప్తి, సమయ స్ఫూర్తి, త్వరగా కార్యరంగంలోకి దుముకే తత్వం, భయరహిత మానసిక స్థితి, వ్యూహాత్మకంగా ఆలోచించగలిగిన నేర్పు, పరిస్థితులను త్వరగా అర్థం చేసుకోగలిగిన మనస్సు, దేనినైనా సాధించగలిగిన ఉత్సాహం, సమర్థత, మార్పును ఆహ్వానించ గలిగిన చైతన్యం.. లాంటి ఎన్నో ఐహిక ఆధ్యాత్మిక అంశాలను మనం గమనించవచ్చు.
బుధవారం హనుమజ్జయంతి
Related tags :