ప్రపంచం మొత్తం కరోనా వైరస్ దెబ్బతో గడగడలాడిపోతుంటే.. హాంకాంగ్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ దెబ్బతో తమ వ్యాపారం గాడిన పడిందని సంబరపడుతున్నారు. అక్కడి ప్రజలు తాజా ఆహారపదార్థాల వైపు మొగ్గు చూపడంతో తమ వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో హాంకాంగ్ సూపర్ మార్కెట్లలో తాజా ఆహార పధార్థాల కొరత ఏర్పడిందని చెబుతున్నారు. చైనాలోని హాంకాంగ్ నగరం ఒకప్పుడు స్థానిక వ్యవసాయ ఉత్పత్తులపైనే ఎక్కువగా ఆధారపడేది. 1960, 70వ దశకాల్లో ఆ నగరం వేగంగా అభివృద్ధి చెందడంతో అక్కడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. పట్టణీకరణ నేపథ్యంలో అక్కడి వ్యవసాయం దెబ్బతిని.. 98 శాతం ఆహార పదార్థాలను ఇతర ప్రాంతాల నుంచే దిగుమతి చేసుకునేది. వైరస్ కట్టడిలో భాగంగా ఇతర దేశాలు తమ సరిహద్దులను మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. అది హాంకాంగ్‌పైనా ప్రభావం చూపడంతో స్థానిక వ్యవసాయ ఉత్పత్తుల గిరాకీ పెరిగింది. అక్కడి ప్రజలు తాజా ఆహార పదార్థాలవైపు మెగ్గుచూపుతున్నారు. అలా ఒక్కసారిగా స్థానిక మార్కెట్ల బాట పట్టడంతో డిమాండ్‌కు తగ్గ సప్లయ్ చేయలేకపోతున్నామని మాపొపొ వ్యవసాయ మార్కెట్ స్థాపకురాలు బెకీ ఏయూ అన్నారు. ఈ మహమ్మారి కారణంగా ఇక్కడి ప్రజల్లో చైతన్యం పెరిగిందని, సొంతంగా తామే హాంకాంగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం పండించాలనే విషయంపై ఆలోచిస్తున్నారని స్థానిక రైతుల ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్న మాండీటాంగ్ అన్నారు. పెద్ద పెద్ద భవంతులు తమని సంతోషపెట్టవనే విషయాన్ని అక్కడి వారికి.. ఈ కరోనా వైరస్ గుర్తు చేసిందని చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్‌లో వ్యవసాయ పరిశోధకుడిగా పనిచేస్తున్న లాహోయ్ లంగ్ చెప్పారు. హాంకాంగ్ తన పాత పద్ధతిని విస్మరించి సొంత వనరులపై దృష్టిసారించాలని ఆయన హితవు పలికారు.
కరోనా పుణ్యామా అని…హాంకాంగ్ రైతులకు బంగారు దశ పట్టింది
Related tags :