అదను చూసి వల విసిరిన సైబర్ నేరగాళ్లు… మోసపోయిన హైదరాబాద్ వాసి
దేశవ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ విధించడంతో మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్ లో ప్రముఖ మద్యం దుకాణంగా పేరుగాంచిన ‘బగ్గా వైన్స్’ పేరిట ఆన్ లైన్ లో మోసానికి తెరలేపారు. ఆన్ లైన్ లో నగదు ట్రాన్స్ ఫర్ చేస్తే మద్యాన్ని నేరుగా ఇంటికే తీసుకువస్తామని మోసగాళ్లు ఇచ్చిన ప్రకటనకు గౌలిపురాకు చెందిన రాహుల్ స్పందించాడు.
‘బగ్గా వైన్స్’ పేరుతో ఆ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ పంపగా, దాని ఆధారంగా రాహుల్ రూ.51 వేలు ఆన్ లైన్ లో పంపాడు. డబ్బు పంపినా మద్యం రాకపోవడంతో తాను మోసపోయానన్న విషయం రాహుల్ కు బోధపడింది. చేసేది లేక సైబర్ క్రైమ్ పోలీసులకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. కాగా, తమ దుకాణం పేరుతో సైబర్ మోసాలు జరుగుతున్నట్టు ‘బగ్గా వైన్స్’ యాజమాన్యం ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది.