* కరోనాకు పుట్టిల్లు అయిన చైనాలో ఈ కేసుల కలకలం వీడటం లేదు. ఇప్పుడు అక్కడ ఓ ప్రమాదకర పరిస్థితి కన్పిస్తోంది. అసలు కరోనా లక్షణాలు ఏమీ పైకి కన్పించకోయినా పరీక్షల్లో మాత్రం కేసులు వెలుగుచూస్తున్నాయి. ఇది అక్కడి ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచం అంతా సోకిన ఈ మహమ్మారి చైనాలో చాలా వరకూ తగ్గుముఖం పట్టిందని..అక్కడ చాలా వరకూ ఆంక్షలు కూడా తొలగించారు. గత వారం నుంచి మళ్ళీ చైనాలో కరోనా కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. శని, ఆదివారాల్లోనే అక్కడ ఏకంగా అరవైకి పైగా కొత్త కేసులు వచ్చాయి. అయితే అందులో కరోనా కేసుల లక్షణాలేమీ కన్పించకుండానే ఇతర సమస్యలతో ఆస్పత్రికి వచ్చిన వారికి చేసిన పరీక్షల్లో ఈ లక్షణాలు వెల్లడయ్యాయి. కరోనా లక్షణాలు లేకుండా నిర్ధారణ అయిన కేసులు 78 వరకూ ఉన్నట్లు చైనా జాతీయ ఆరోగ్య మిషన్ తెలిపింది. హుబే ప్రాంతం నుంచే ఇతర ప్రాంతాలు ఈ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలా వైరస్ లక్షణాలు గుర్తించిన 750 మందిని ఓ చోట ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వెలుగులోకి వచ్చాక చైనాలో ఇప్పటివరకూ 81,708 కేసులు రాగా..అందులో 3330 మంది మరణించినట్లు చైనా అధికారికంగా వెల్లడించింది. కానీ అనధికారిక అంచనాల ప్రకారం చైనాలో కేసుల సంఖ్య, మృతుల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుందనే అనుమానాలు ఉన్నాయి.
* రోజురోజుకి ప్రపంచవ్యాప్తంగా విస్తృతమవుతున్న కరోనా (కొవిడ్-19) వైరస్ బారి నుంచి బయటపడేందుకు అన్ని దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12 లక్షల కరోనా కేసులు నమోదుకాగా దాదాపు 70 వేల మంది మృత్యువాతపడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ఈ వైరస్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు విస్తరించడమే కాకుండా అమెరికా, యూరోపియన్ దేశాలైన ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీల్లో దీని తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడని దేశాలు ఉన్నాయి. ఫసిఫిక్ తీరంలోని చిన్న ఐలాండ్ దేశాలైన సాల్మన్ ఐలాండ్, వనౌతు, సమోవా, కిరిబాతి, మైక్రోనేషియా, టోంగా, ది మార్షల్ ఐలాండ్ పలవౌ, టువాలు, నౌరు వంటి దేశాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదని అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీనికి కారణం ఆ దేశాలు దూర ప్రాంతాల్లో ఉండటమే కాకుండా ప్రయాణాలపై ఉన్న పరిమితుల వల్ల ఇప్పటి వరకు ఆయా దేశాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు.
* దేశంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా నిజాముద్దీన్ మర్కజ్ ఘటన అనంతరం దీని తీవ్రత పెరిగింది. 9 రాష్ట్రాల్లోని 12 జిల్లాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. దేశవ్యాప్తంగా 284 జిల్లాలు ఈ మహమ్మారి బారిన పడ్డాయి. ఇప్పటి వరకు దేశం మొత్తమ్మీద నమోదైన కేసుల్లో మూడో వంతు కేసులు ఈ జిల్లాల్లో నమోదు కావడం గమనార్హం.
* ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తల్లి కృష్ణవేణి (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుదిశ్వాస విడిచారు. రెండు నెలలుగా తన తల్లి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారని తమ్మారెడ్డి భరద్వాజ మీడియాకు చెప్పారు. తన మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్లు చేస్తున్నారని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నందున తనను పరామర్శించడానికి ఎవరూ ఇంటికి రావద్దని ఆయన కోరారు.
* ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ కనిపించనున్న సంగతి తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జక్కన్న-అజయ్ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్టు ఇది. ‘ఈగ’ సినిమాను హిందీలో విడుదల చేయాలని రాజమౌళి అనుకున్నప్పుడు అజయ్, కాజోల్‌ను కలిశారు. హిందీ వెర్షన్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఇద్దరు వెంటనే ఒప్పుకొన్నారు. ఇన్నేళ్లకు ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం మళ్లీ చేతులు కలిపారు.
* కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో రోగులకు చికిత్స అందించే వైద్యులు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తాజాగా ఔరంగబాద్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని జూనియర్ వైద్యులు తమకు కరోనా వైరస్ సోకకుండా అవసరమైన పీపీఈ(పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్), ఎన్ 95 మాస్కులను అందించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ధర్నా చేశారు. ఆస్పత్రిలోని ఇద్దరు రోగులు, సిబ్బంది ఒకరికి ఇటీవలే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిలో ఆందోళన మరింత ఎక్కువైంది. దీనికి సంబంధించి వైద్య కళాశాల డీన్‌కు మెమొరాండం సమర్పించారు.
* అమెరికాలో కొవిడ్-19తో నలుగురు భారతీయులు మృతిచెందారని మలయాళ సంఘం తెలిపింది. కరోనా వైరస్‌తో అలెయమ్మ కురియకోస్ (65), తనకచన్ ఎంచెనట్టు (51), అబ్రహం శామ్యూల్ (45), ష్వాన్ అబ్రహం (21) న్యూయార్క్‌లో మరణించారని ఉత్తర అమెరికా కేరళ సమాఖ్య (ఎఫ్‌ఓకేఎన్‌ఏ) వెల్లడించింది.
* కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19పై పోరాడేందుకు నిధుల కొరత ఉండకూడదన్న ఉద్దేశంతో ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత విధించారు. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం కేబినెట్ భేటీ జరిగింది. అనంతరం కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు.
* చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను పట్టి పీడిస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో నమోదవుతున్న కేసులు భారీస్థాయిలో తగ్గడంతో సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షలను సడలిస్తున్నారు. కరోనా వైరస్‌ను కట్టడిచేయడంలో చైనా తీసుకున్న చర్యలపై సానుకూల స్పందన వ్యక్తమైంది. ఇదిలాఉంటే, తాజాగా చైనాలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే ఈసారి వ్యాధి నిర్ధారణ అవుతున్నప్పటికీ లక్షణాలు కనిపించకపోవడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది.
* కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు. ‘‘రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేస్తే గానీ పూటగడవని ఎంతోమంది పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. దిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. అలాగే, ఏపీలో కూడా పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలి.’’ అని చంద్రబాబు కోరారు.
* కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అమెరికా భారీ సాయం ప్రకటించింది. 2.9 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు అగ్రరాజ్యం వెల్లడించింది. యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఏఐడీ) ద్వారా ఈ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్ ఓ ప్రకటన చేశారు. కొవిడ్-19ను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సాయం భారత్‌కు ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా మహమ్మారిని తిప్పికొట్టేందుకు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ), యూఎస్‌ఏఐడీ వంటి సంస్థలు భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
* కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సామాజిక బాధ్యతగా కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గ సమన్వయకర్త అనిరుధ్ రెడ్డి తన సొంత ఖర్చుతో ప్రజలకు శానిటైజర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. శానిటైజర్లు తీసుకెళ్తున్న వాహనాలను గాంధీభవన్ వద్ద ఉత్తమ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తాము ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తిలో కొందరు మతాన్ని వేలెత్తి చూపుతున్నారని.. అది సరైంది కాదని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.
* కొవిడ్-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని సూచించింది. కొవిడ్-19 డెత్ క్లైమ్స్‌కు ‘ఫోర్స్ మెజర్’ (Fఒర్చె ంఅజెరుఎ) నిబంధన వర్తించదని వెల్లడించింది. ముందుగా తెలియని, నియంత్రించలేని పరిస్థితులకు ‘ఫోర్స్ మెజర్’ను అమలు చేస్తారు. కరోనాకు దీనిని వర్తింపజేయడం లేదని జీవిత బీమా మండలి తెలిపింది.
* కరోనావైరస్‌పై చేస్తున్న పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తామని నటుడు సాయికుమార్ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని రూపొందించి ప్రజలతో పంచుకున్నారు. ‘జై భారత్. నా తోటి భారతీయులకు నమస్కారం. మీలో ఒక్కడినైనందుకు గర్వపడుతున్నాను. మన ప్రియతమ ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ అంటే పాటించాం. లాక్‌డౌన్ అంటే లాక్ అయ్యాం. చప్పట్లు కొట్టమంటే కొట్టాం. దీపాలు వెలిగించమంటే వెలిగించాం. ఇది ఒక ఈవెంట్ కాదు.. మూవ్‌మెంట్. ఇది ప్రజల ఉద్యమం. మనం చేసింది, చేస్తోంది మోదీ కోసం కాదు.. మన కోసం.’ అని సాయి కుమార్ పేర్కొన్నారు.
* కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా, భారత ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు ఈ నెల 14తో ముగుస్తుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటనే విషయంపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా విభాగం విడుదల చేసిందంటూ లాక్‌డౌన్ తేదీల జాబితా ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. కొవిడ్-19 నివారణకు భారత్‌లో ఆరు అంచెల్లో లాక్‌డౌన్ అమలు జరుగుతుందంటూ ఈ ప్రకటన తెలియజేస్తోంది. కాగా ఈ సమాచారం అసత్యమని ప్రభుత్వ మీడియా సంస్థ ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ (పీఐబీ) ప్రకటించింది.
* కరోనా కట్టడి కోసం ఓ వైపు అధికార యంత్రాంగం నిరంతం శ్రమిస్తుంటే.. మరోవైపు ఆకతాయిల చేష్టలు వారిని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. కరోనాపై పోరాటానికి నిధుల కోసమంటూ పలువురు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఐక్యతా విగ్రహాన్ని (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ఓఎల్‌ఎక్స్‌లో అమ్మకానికి పెడుతున్నట్లు ప్రకటన ఉంచారు. ఆస్పత్రుల ఏర్పాటు, వైద్య పరికరాల కొనుగోళ్ల కోసం దీన్ని రూ.30,000 కోట్లకు విక్రయిస్తున్నామంటూ ఆకతాయిలు ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన ఐక్యతా విగ్రహం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.