DailyDose

మహీంద్రాను మైమరిపించిన ఇస్త్రీపెట్టె ఐడియా-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Mahindra Praises Iron Box Cashier

* కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే వైద్య, పోలీస్‌, బ్యాంకింగ్‌తో సహా కొన్ని అత్యవసర సేవలకు ఈ లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల నుంచి తీసుకునే నగదు, చెక్‌ల ద్వారా కరోనా వ్యాపించకుండా ఉండేందుకు ఒక బ్యాంక్‌ ఉద్యోగి చేసిన పని సామాజిక మాథ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వివరాల్లోకి వెళితే బ్యాంక్ ఆఫ్‌ బరోడాకు చెందిన క్యాషియర్‌ ముక్కుకు మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించి ఖాతాదారుల నుంచి నగదు, చెక్కులు స్వీకరిస్తుంటాడు. అయితే కరోనా వైరస్‌ ప్రమాదం పొంచి ఉన్న కారణంగా ముందు జాగ్రత్త చర్యగా ఖాతాదారుల నుంచి తీసుకున్న చెక్కులు, నగదును ఐరస్ బాక్సుతో ఇస్త్రీ చేసిన తర్వాత లావాదేవీలు జరుపుతుంటారు. అలా వేడి వస్తువుతో కాగితాలపై రుద్దడం వల్ల క్రిములు చనిపోతాయని అలా చేస్తుండంతో ఆయన తెలివికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

* కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయతాండవం ఆర్థిక వ్యసస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టివేస్తుందన్న అంచనాల మధ్య వెలువడిన ఓ నివేదిక భారత బ్యాంకింగ్‌ రంగాన్ని మరింత కలవరపెడుతోంది. 2020లో బ్యాంకుల నిరర్థక ఆస్తులు భారీగా పెరగనున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ నివేదిక స్పష్టం చేసింది. అలాగే బ్యాంకుల రుణ వ్యయం మరింత భారం కానుందని అంచనా వేసింది.

* కరోనా వైరస్‌ కట్టడికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ సామాన్యుడి నుంచి కుబేరుడి వరకు అందరిపైనా ప్రభావం చూపిస్తోంది. తాజాగా భారత కుబేరుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన సంపదలో 28 శాతం కోల్పోవడంతో ఆయన నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత రెండు నెలల్లో స్టాక్‌ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంబానీ మార్చి 31 నాటికి రోజుకి 300 మిలియన్‌ డాలర్ల సంపద కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. దీంతో ఆయన మొత్తంగా 19 బిలియన్‌ డాలర్ల మేర సంపదను కోల్పోయి అంతర్జాతీయ ర్యాంకింగ్‌లో ఎనిమిదో స్థానానికి పడిపోయినట్లు హురున్ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌ అనే సంస్థ వెల్లడించింది. ఇక మరో భారత్ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ 37 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్‌ నాడార్ 26 శాతం, ఉదయ్‌ కొటక్‌ 28 శాతం మేర సంపదను కోల్పోయినట్లు సదరు సంస్థ వెల్లడించింది. దీంతో వీరంతా టాప్‌ 100 జాబితాలో స్థానాన్ని కోల్పోయారని హురున్‌ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ మాత్రమే టాప్‌ 100 జాబితాలో కొనసాగుతున్నారు. కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా స్టాక్‌మార్కెట్లలో షేర్ల అమ్మకాల ఒత్తిడి ఉండటంతో గత రెండు నెలల్లో 25 శాతం మేర మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి.

* కొవిడ్‌-19తో చనిపోయిన వారి క్లైమ్స్‌ను అత్యంత వేగంగా పరిష్కరించాలని బీమా సంస్థలకు జీవిత బీమా మండలి సోమవారం స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పరిష్కార ప్రక్రియను వేగంగా చేపట్టాలని సూచించింది. కొవిడ్‌-19 డెత్‌ క్లైమ్స్‌కు ‘ఫోర్స్‌ మెజర్‌’ (Fఒర్చె ంఅజెరుఎ) నిబంధన వర్తించదని వెల్లడించింది.

* ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన వంతు సాయం అందిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 2 కోట్ల మాస్కులు అందించామని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ వెల్లడించారు. అలాగే ప్రస్తుత వైద్య అవసరాల నిమిత్తం కస్టమ్ ఫేస్‌ షీల్డ్స్‌ తయారీ మీద దృష్టి సారించినట్లు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ సంస్థ చేపడుతోన్న చర్యలను ట్విటర్‌ వీడియో ద్వారా ఆయన వివరించారు.

* కరోనా వైరస్‌ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాల్లో భారీ కోతలు ఉంటాయని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సీఐఐ) స్పష్టం చేసింది. గతవారం 200 మందికిపైగా సీఈఓలతో ఆ సంస్థ చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాక్‌డౌన్‌ కాలం పూర్తయ్యాక అనేక రంగాల్లో ఉద్యోగ కోతలు ఉంటాయని 52 శాతం మంది సీఈఓలు చెప్పారని సీఐఐ పేర్కొంది. ‘కొవిడ్‌ 19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో పరిశ్రమలపై ప్రభావం – సీఈఓల స్నాప్‌ పోల్‌’ పేరిట సీఐఐ గతవారం ఓ సర్వే నిర్వహించింది. ఆదివారం వాటి ఫలితాలు ప్రకటించడంతో ఉత్పాదక రంగాల్లోని ఉద్యోగులు కలవరపాటుకు గురౌతున్నారు.