కరోనా వైరస్ (కోవిడ్-19) సామాన్యులకే కాదు.. అపర కుబేరులకూ చుక్కలు చూపిస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు వీరి నిర్వహణలోని కంపెనీల షేర్ల ధరలు కుప్పకూలుతున్నాయి. ఆ ప్రభావం వీరి సంపదపైనా కనిపిస్తోంది. గత రెండు నెలల్లో భారత స్టాక్ మార్కెట్ 26 శాతం వరకు నష్టపోయింది. దీంతో వంద కోట్ల డాలర్ల కంటే ఎక్కువ సంపద ఉన్న దేశీయ బిలియనీర్ల సంపద భారీగా కరిగిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ సంపదే ఇందుకు ఉదాహరణ. ఈ ఏడాది జనవరి నెలాఖరుకు 6,700 కోట్ల డాలర్లు ఉన్న ముకేశ్ అంబానీ సంపద.. కరోనా దెబ్బతో మార్చి నెలాఖరుకు 28 శాతం తగ్గి 4,800 కోట్ల డాలర్లకు చేరింది. గత రెండు నెలల్లోనే అంబానీ సంపద రూ.1.44 లక్షల కోట్లు (1,900 కోట్ల డాలర్లు) ఆవిరై పోయింది. అంటే రోజుకు రూ.2,280 కోట్లు నష్టపోయారు. దీంతో జనవరి నెలాఖరు నాటికి ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ, మార్చి నెలాఖరుకు 17వ స్థానానికి పడిపోయారు. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల ఆస్తుల వివరాలను ప్రకటించే ‘హురన్ గ్లోబల్’ సంస్థ తన తాజా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.
**ఇతరులదీ అదే పరిస్థితి
దేశంలోని మిగతా బిలియనీర్లదీ ఇదే పరిస్థితి. ఇదే కాలంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద 600 కోట్ల డాలర్లు (37 శాతం), హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ సంపద 500 కోట్ల డాలర్లు (26 శాతం), ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కోటక్ సంపద 400 కోట్ల డాలర్లు (28 శాతం) తుడిచి పెట్టుకుపోయింది. మార్కెట్ పతనంలో వీరి ముగ్గురి పేర్లు టాప్-100 ప్రపంచ బిలియనీర్ల జాబితా నుంచీ గల్లంతయ్యాయి. ప్రస్తుతం భారత్ నుంచి ముకేశ్ అంబానీ పేరు మాత్రమే ఈ జాబితాలో ఉంది. స్టాక్ మార్కెట్ పతనంతో పాటు గత రెండు నెలల్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 5.2 శాతం పడిపోవడం.. భారత కుబేరుల ఆస్తులకు భారీగా గండి పడిందని హురన్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రహ్మాన్ చెప్పారు.
***ప్రపంచంలో 10 మంది బిలియనీర్ల సంపద
పేరు కంపెనీ సంపద విలువ మార్పు
జెఫ్ బెజోస్ అమెజాన్ 13,100 – 900
బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ 9,100 – 1,500
వారెన్ బఫెట్ బెర్క్‌షైర్ హాత్‌వే 8,300 – 1,900
బెర్నార్డ్ అర్నాల్ట్ ఎల్‌వీఎంహెచ్ 7,700 – 3,000
మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్ 7,100 – 1,300
అమాన్సియా ఒటెగే ఇండిటెక్స్ 6,400 – 1,700
స్టీవ్ బామర్ మైక్రోసాఫ్ట్ 6,000 – 750
అలిస్ వాల్టన్ వాల్‌మార్ట్ 5,800 – 100
జిమ్ వాల్టన్ వాల్‌మార్ట్ 5,600 – 100
సెర్జీ బిన్ గూగుల్ 5,550 – 1,250
కొరోనా ప్రవాహంలో కొట్టుకుపోయిన సంపద
Related tags :