NRI-NRT

బ్రిటన్‌లో కొరోనా కష్టాలు

Britain On The Verge Of Political Turmoil Due To COVID19

కరోనా వ్యాప్తితో భీతిల్లివున్న తన ప్రజలను ఉద్దేశించి ఆదివారం క్వీన్‌ ఎలిజబెత్‌ చేసిన ప్రసంగం బ్రిటిషర్ల ప్రశంసలు అందుకుంది. రాజరికం నచ్చనివారు సైతం ఈ కష్టకాలంలో ఆమె చేసిన ప్రసంగం స్ఫూర్తిదాయకంగా ఉన్నదని మెచ్చుకున్నారు. కరోనా కారణంగా ప్రజలు ఎదుర్కొటున్న కష్టాలను స్మరిస్తూనే, సంఘటితంగా సాగిస్తున్న ఈ పోరాటంలో మనమంతా కచ్చితంగా విజయం సాధిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. ఇటువంటి కష్టాలు అనేకం నెగ్గుకొచ్చాం, ఇదీ ఒకటి అన్నారామె. ఆత్మీయులను కోల్పోవడమన్నది భరించలేనిదే అంటూ, ఈ పోరాటం గురించి మనమంతా కచ్చితంగా భావితరాలకు చెప్పుకుంటామని భరోసా ఇచ్చారు. మనం మన స్నేహితులను, కుటుంబ సభ్యులను కలుసుకొనే మంచిరోజులు వస్తాయి, కచ్చితంగా మళ్ళీ కలుసుకుంటాం అంటూ ప్రసంగాన్ని ముగిస్తూ ఆమె చెప్పిన మాటలు అనేకమందిని కన్నీటిలో ముంచెత్తిందట. కరోనా వ్యాధిలక్షణాలతో పదిరోజులు క్వారంటైన్‌లో ఉన్న ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఆసుపత్రిలో చేరిపోయిన సందర్భంలో, బ్రిటిష్‌ రాణి ఈ వీడియో ప్రసంగం చేయడం అనేక మందికి ధైర్యాన్నిచ్చి ఉంటుంది.
*యాభైవేల కేసులతో, ఐదువేల మరణాలతో సతమతమవుతున్నది బ్రిటన్‌. నిజానికి బోరిస్‌ శుక్రవారం హోం క్వారంటైన్‌ నుంచి బయటకు వచ్చి విధుల్లో చేరాలి. కానీ, రోగ లక్షణాలు ఉపశమించని కారణంగా ఆయనను ఆస్పత్రికి తరలించవలసి వచ్చింది. బోరిస్‌ ఎంత కాలం ఆస్పత్రిలో ఉండాల్సివస్తుందన్నది అటుంచితే, మూడేళ్ళపాటు బ్రెగ్జిట్‌ భయాల్లో మునిగిన బ్రిటన్‌ ఇటీవలే కాస్తంత తేరుకుంది. బ్రెగ్జిట్‌కు ఇద్దరు ప్రధానులు బలైన తరువాత, బోరిస్‌ పార్టీలోనే కాక, దేశంలోనే ఓ బలమైన నాయకుడిగా ముందుకొచ్చాడు. దేశాన్ని ఒడ్డునపడేసే ఆ ప్రక్రియ కాస్తంత ముందుకుపోతున్న తరుణంలో ఇప్పుడు కరోనా వచ్చి కొత్త కల్లోలాన్ని సృష్టించింది. బోరిస్‌ సమీపకాలంలోనే ఆస్పత్రినుంచి బయటకు వచ్చినా, ఆయన పూర్తిగా తేరుకోవడానికీ, గతంలో మాదిరిగా అంతే శక్తిమంతంగా పనిచేయడానికీ ఎంతకాలం పడుతుందో తెలియదు. అందువల్లనే, అంతవరకూ దేశాన్ని నడిపించే నాయకుడెవరన్న చర్చ ఇప్పుడక్కడ విస్తృతంగా సాగుతోంది. అధ్యక్షుడు బాధ్యతలు చక్కబెట్టగలిగే స్థితిలో లేనప్పుడు ఉపాధ్యక్షుడికి అధికారాలు దఖలు పరచాలని అమెరికా రాజ్యాంగం చెబుతోంది. కానీ, మంత్రివర్గ పాలన ఉన్న బ్రిటన్‌లో ఆ రకమైన ఏర్పాటు సహజంగానే ఉండదు. ఆస్పత్రి నుంచే తాను పనిచేస్తానని బోరిస్‌, ఆయనే పాలకుడని ప్రభుత్వమూ చెబుతున్నప్పటికీ, ప్రధాని పరోక్షంలో విదేశాంగ మంత్రి డొమినిక్‌ రాబ్‌ అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ‘ఫస్ట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌’ హోదాలో ఈయన ‘డీ ఫ్యాక్టో’ ప్రధాని అయినప్పటికీ, కరోనా వ్యతిరేక పోరాటంలో ముందువరుసలో ఉన్న కొందరు మంత్రుల మాదిరిగా ఆయనకు ప్రజల్లో పెద్ద పేరు లేదు, మిగతా మంత్రివర్గ సహచరుల్లో ఆయన పట్ల విశ్వాసమూ లేదు.
*కరోనాను ఎదుర్కొనే వ్యూహం విషయంలో మంత్రివర్గంలో తీవ్ర విభేదాలున్నాయి. రక్షణ కవచాలు సరిపడా లేవనీ, అవసరమైన సంఖ్యలో పరీక్షలు జరపడం లేదన్న విమర్శలతో పాటు, లాక్‌డౌన్‌ తెచ్చిన తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎలా ఎదుర్కోగలమన్న భయాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో, కరోనాకు తగిన జవాబు అంటూ బ్రిటన్‌ ఆర్థికమంత్రి రిషి సునక్‌ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అనేమంది ఆర్థికవేత్తల ప్రశంసలు అందుకుంది. ముప్పై బిలియన్‌ పౌండ్ల ప్రత్యేక కరోనా ప్యాకేజీతో బ్రిటన్‌ కచ్చితంగా ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందని ఆయన భరోసా ఇచ్చారు. యూరోపియన్‌ యూనియన్‌తో సభ్యత్వాన్ని తెగదెంపులు చేసుకున్న తరువాత, యాభైయేళ్ళ అనంతరం దేశవ్యాప్తంగా లక్షలాది పౌండ్లతో అన్ని రంగాలకు భారీ కేటాయింపులు జరపడం, నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ఆర్థిక రంగానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది. ఈ భారీ బడ్జెట్‌తో ప్రజల్లో కూడా సునక్‌ పాపులారిటీ బాగా పెరిపోయింది. ఒక సర్వేలో ఆయన మిగతా మంత్రులకంటే పై స్థాయిలో ఉండటమే కాక, ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కంటే రెట్టింపు స్కోరు సాధించారు. వారం క్రితం ఒక ప్రముఖ ఆంగ్లపత్రిక నిర్వహించిన సర్వేలో సైతం బోరిస్‌ ప్రధాని బాధ్యతలు నిర్వహించలేని పక్షంలో, సునక్‌ ఆ స్థానానికి నూరుపాళ్ళూ అర్హుడంటూ మెజారిటీ ఓట్లతో బ్రిటిషర్లు తేల్చేశారు. ఇప్పుడు పరోక్షంగా ప్రధాని బాధ్యతలు నిర్వహిస్తున్న డొమినిక్‌ రాబ్‌ ప్రజల ఎంపికలో చివరిస్థానంలో ఉండటం విశేషం. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు బ్రిటిష్‌ ప్రధాని కాగలడా? అన్నది అటుంచితే, పలు కష్టాల్లో ఉన్న బ్రిటన్‌ను రిషి సునక్‌ ఒడ్డునపడేయగలిగితే సంతోషించాల్సిందే.

UK coronavirus deaths up 20% in one day, lockdown expected through May

UK coronavirus death toll rises by 621 to 4,934 - Reuters