సినిమా జనాలు ‘శివ’కి ముందు.. ‘శివ’ తరువాత అని మాట్లాడుకుంటుంటారు. ఆ సినిమా అంతగా భారతీయ చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపించింది. అలాంటి ట్రెండ్ సెట్టర్‌ని తీసిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మనే
దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాల్ వర్మ.. డైరెక్టరా ఖర్మ’ అంటూ తనపైన తానే సెట్టైర్ వేసుకున్నాడు. సంచలన విజయాల్ని అందుకొన్న ఆయనే… అంతకు రెట్టింపు స్థాయిలో ఫ్లాప్ సినిమాలు కూడా తీశాడు. కానీ… సక్సెస్‌ఫుల్ సినిమాకీ, ఫ్లాప్ సినిమాకీ నేను పడే కష్టం ఒకటే అని చెబుతుంటాడు వర్మ. మరో అడుగు ముందుకేసి నా సక్సెస్‌లన్నీ అనుకోకుండా వచ్చినవే అని కూడా చెబుతారాయన. ఆయన ఏ కథ ఎంచుకొన్నా ఒక సంచలనమే. ఆయన సినిమాలు సెట్స్‌పైకి వెళ్లడానికి ముందే వార్తల్లో నిలుస్తుంటాయి. తెలుగులో ‘శివ’ చిత్రంతో ప్రయాణం మొదలుపెట్టిన వర్మ ఆ తరువాత హిందీ, కన్నడ భాషల్లో సినిమాలు తీశారు. ముఖ్యంగా తెలుగు, హిందీ భాషల్లో ఆయన సంచలన విజయాల్ని సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగానే కాకుండా, రచయితగా, నిర్మాతగా కూడా ఆయన చిత్ర పరిశ్రమలో ప్రయాణం చేశాడు. రామ్ గోపాల్ వర్మ 1962, ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో కృష్ణంరాజు, సూర్యమ్మ దంపతులకు జన్మించాడు. విజయవాడ నగరంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాడు. చిన్నప్పట్నుంచే పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకున్న ఆయన క్రమంగా సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. విడుదలైన ప్రతి సినిమానీ చూసి, స్నేహితులతోనూ, మావయ్యతోనూ వాటిలోని తప్పొప్పుల్ని విశ్లేషించేవారట. ఇంజినీరింగ్ తరువాత కొంతకాలం వీడియో దుకాణం నడిపాడు. తరువాత ‘రావుగారిఇల్లు’ అనే తెలుగు చిత్రానికి సహాయక నిర్దేశకునిగా అవకాశం వచ్చింది.
ఆ చిత్రం ద్వారా వర్ధమాన తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను కలిసే అవకాశం వచ్చింది. మొదట ‘రాత్రి’ సినిమా తీయాలనుకున్నా… దానిపై ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ‘శివ’ కథను సిద్ధం చేసి నాగార్జునకు వినిపించి ఒప్పించారు. ఆ సినిమా చేయడానికి నాగార్జున, ఆయన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం వెనక కథ గురించి ఆయన ‘నా ఇష్టం’ పుస్తకంలో క్షుణ్ణంగా రాసుకొచ్చారు. ఎట్టకేలకి ‘శివ’ కోసం నాగ్‌ని ఒప్పించి, ఆ సినిమాని పూర్తి చేసిన ఆయన ఘన విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్రం గురించి పొరుగు చిత్ర పరిశ్రమలు సైతం మాట్లాడుకున్నాయి. ఇప్పటికీ ‘శివ’ సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటుంటారు. అందులో సాంకేతికత, కథ, చిత్రాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచింది. యువత ‘శివ’ స్టైల్‌కు ఫిదా అయిపోయింది. తాను కళాశాల చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఘటనలకు ఈ సినిమా ద్వారా దృశ్య రూపమిచ్చారు వర్మ. కథ, కథనం అంతా కొత్తగా ఉండటం ప్రతీ ఒక్కరినీ ఆకర్షించింది. వర్మ ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును అందుకున్నారు. ఈ ఒక్క సినిమాతో చాలా పాపులర్ అయిపోయారు వర్మ. ‘శివ’ సినిమాతో తనదైన ముద్రవేసిన వర్మ ఆ తరువాత ‘క్షణ క్షణం’ తీశారు. వర్మ టేకింగ్ స్టైల్‌కు చిత్ర పరిశ్రమ మరోసారి ఫిదా అయిపోయింది. కీరవాణి స్వరపరిచిన ‘జామురాతిరి జాబిలమ్మ..’ పాట మార్మోగిపోయింది. ఆ తరువాత ‘అంతం’తో మరోసారి తన మార్కును చూపించారు. ఈ దశలోనే తాను మొదట అనుకున్న ‘రాత్రి’ సినిమాను తీసి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చారు. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందుకుంది. జగపతిబాబుతో తీసిన ‘గాయం’ కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. నిర్మాతగా వర్మ అందించిన ‘మనీ’.., ‘మనీ మనీ’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టాయి. ‘శివ’తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన వర్మ బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాడు. దర్శకుడిగా, నిర్మాతగా పలు చిత్రాలను రూపొందించాడు. ‘రంగీలా’ బాక్సాఫీస్ వద్ద చక్కని విజయాన్ని నమోదు చేసింది. ప్రేమకథా, యాక్షన్ చిత్రాలు రాజ్యమేలుతున్న సమయంలో వర్మ తీసిన సినిమాలు నిజజీవితానికి దగ్గరగా ఉండటం, విషయాన్ని లోతుగా అన్వేషించి చెప్పడం బాలీవుడ్‌కు బాగా నచ్చింది. తీసే ప్రతీ చిత్రంలో తనదైన మార్కును చూపేవారు వర్మ. ‘సత్య’, ‘జంగిల్’, ‘కంపెనీ’, ‘భూత్’, ‘నాచ్’, ‘సర్కార్’, ‘సర్కార్ రాజ్’, ‘డిపార్ట్‌మెంట్’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ తదితర చిత్రాలతో బాలీవుడ్‌లో వర్మ మంచి పేరుతెచ్చుకున్నారు. వర్మ తొలి నుంచి చేసిన చిత్రాల్లో ఎక్కువ సినిమాలు వాస్తవ ఘటనల ఆధారంగా తీసినవే. ఏ విషయంపైనైనా సినిమా చేయాలనుకున్నప్పుడు వాటిని అధ్యయనం చేసిన తనదైన శైలిలో వెండితెరపై ప్రెజెంట్ చేస్తారు వర్మ. ‘రక్త చరిత్ర’, ‘ది అటాక్స్ ఆఫ్ 26/11’ ‘వీరప్పన్’, ‘వంగవీటి’ చిత్రాలు అందుకు కొన్ని ఉదాహరణలు. ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెరకెక్కించారు. వివాదాలకి కేరాఫ్‌గా నిలుస్తుంటాడు వర్మ. ట్విట్టర్‌లో ఆయన చేసే వ్యాఖ్యలు వార్తల్లో నిలుస్తుంటాయి. వర్మ సినిమాలకే కాదు… ఆయన ఆలోచనలకి కూడా అభిమానులున్నారు. రామూయిజం అంటూ ఆ ఆలోచనల్ని పిలుచుకుంటుంటారు ఆయన అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ యేటా ఇచ్చే నంది అవార్డును రామ్ గోపాల్ వర్మని మూడుసార్లు వరించింది.