కరోనా (కొవిడ్-19) వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనాపై మరింత సమర్థవంతంగా పోరు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రధాని మరింత కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా పార్లమెంట్ భవనంతోపాటు, సెంట్రల్ విస్టా, మంత్రులకు సంబంధించిన కాంపోజిట్ కాంప్లెక్స్ ఆధునీకరణ ప్రాజెక్టును నిలిపివేసి అందుకు కేటాయించిన రూ. 20 వేల కోట్ల నిధులను కరోనాపై పోరులో భాగంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు, గవర్నర్లు, ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ సోమవారం కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె సమర్థించారు. కరోనాపై మరింత సమర్థవంతంగా పోరాడేందుకు సూచనలు చేయాలని ప్రతిపక్ష పార్టీలను ప్రధాని మోదీ కోరిన నేపథ్యంలో సోనియా ఈ లేఖ రాసినట్లు తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం టి.వీ., ప్రింట్, ఆన్‌లైన్ మీడియాలకు ఇచ్చే అడ్వర్‌టైజ్‌మెంట్‌లలో కరోనా సంబంధిత సమాచారానికి సంబంధించినవి మినహా మిగతా అన్ని యాడ్స్‌ను రెండు సంవత్సరాలపాటు నిలిపివేయాలని సూచించారు.
మోడీజీ…మీ నిర్ణయాన్ని మేము సమర్థిస్తున్నాం
Related tags :