* న్యూజెర్సీలో మందు బిళ్లల కొరత. అమెరికాలో అత్యధిక కొరోనా కేసులు కలిగిన న్యూజెర్సీలో మందుల కొరత వేధిస్తోంది. ఈ మందులు తయారీ కూడా చైనాలోనే ఉండటం వలన వీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
* లాక్‌డౌన్‌తో స్థిరాస్తి రంగం దెబ్బతిన్నప్పటికీ ఉద్యోగులను తొలగించబోమని డీఎల్‌ఎఫ్ సంస్థ తెలిపింది. కొన్ని స్థాయిల వరకు ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు చేపడతామని వెల్లడించింది. ‘ఎవరినీ తొలగించం. ఎల్ 3 స్థాయి వరకు డీఎల్‌ఎఫ్ ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు చేపడతాం’ అని ఆ సంస్థ ప్రకటించింది.
* జలుబు, పొడి దగ్గు, తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడం కరోనా లక్షణాలు. వీటిలో ఏది వచ్చినా వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకొని మహమ్మారి సోకిందా లేదా అని నిర్ధారణకు వస్తున్నారు. అయితే కేరళలోని పథనంతిట్ట జిల్లాలో ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండానే పరీక్ష ఫలితాల్లో పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన 60 ఏళ్ల వృద్ధుడికి, దిల్లీ నుంచి వచ్చిన 19 ఏళ్ల యువతికి లక్షణాలు లేకుండానే కొవిడ్-19 పాజిటివ్ తేలిందని జిల్లా ఉన్నతాధికారి తెలిపారు.
* మహబూబ్‌నగర్‌లో మరో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన ఈ కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనా వైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రెండు రోజుల క్ర్రితం పసికందు తండ్రితో పాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి వైరస్ సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
* కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ అందరి వేళ్లూ ఇప్పుడు ఓ చిన్న జీవి వైపు చూపిస్తున్నాయి. చాలా వైరస్‌లకు అతిథ్యం ఇస్తున్న చీకటి జీవి గబ్బిలం నుంచే ఇది వ్యాపించి ఉండొచ్చన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి(దీన్ని పూర్తిస్థాయిలో ధ్రువీకరించాల్సి ఉంది). గతంలో ప్రపంచాన్ని చుట్టుముట్టిన ఎబోలా.. సార్స్.. మెర్స్‌లతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గబ్బిలాలకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రతి గబ్బిలంలో కనీసం రెండు రకాల వైరస్‌లు ఆశ్రయం పొందుతాయి. కొన్నిసార్లు నేరుగా గబ్బిలం నుంచి, మరికొన్నిసార్లు మరో జీవిలోకి చేరి అక్కడి నుంచి మనిషిలోకి ప్రవేశిస్తున్నాయి. ఇప్పుడు ఇలానే కరోనా వైరస్‌కు కారణమైనట్లు భావిస్తున్నారు. ఇంతటి ప్రమాదకరమైన వైరస్‌లకు గబ్బిలాలు ఎలా ఆతిథ్యం ఇస్తున్నాయి? చీకటి గుహల్లో, గదుల్లో జీవిస్తూ.. మనుషుల మధ్య సంచరించే ఈ జీవులు వైరస్ వ్యాప్తికి ఎంతమేరకు దోహదపడుతున్నాయి? వీటివల్ల మనిషికి కీడా? మేలా? అనేవి ఆసక్తికర అంశాలు.
* టిక్‌టాక్‌లో అవగాహనలేమితో చేసిన ఓ వీడియో ఓ కుటుంబం ప్రాణాలపైకి తీసుకొచ్చింది. కరోనా మహమ్మారిని ఓ చెట్టు కాయల సాయంతో తరిమికొట్టవచ్చని టిక్‌టాక్‌లో ఉన్న వీడియో చూసి ఆచరించిన ఓ కుటుంబంలోని ఎనిమిది మంది ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె మండలపరిధిలోని ఆలపల్లె గ్రామానికి చెందిన కుటుంబం నల్ల ఉమ్మెత్త చెట్టు కాయలను నీళ్లలో వేసి తాగితే కరోనా పోతుందని టిక్‌టాక్‌లో వైరల్ అవుతున్న వీడియోను చూశారు. అనంతరం వీడియోలో ఉన్న విధంగా నల్ల ఉమ్మెత్త కాయలను నీటిలో కలుపుకొని కుటుంబంలోని 8 మంది తాగేశారు. తాగిన కొద్ది సేపటి తర్వాత వారు ఒక్కొక్కరుగా స్పృహ కోల్పోవడం మొదలైంది. ఇది గమనించిన ఇరుగుపొరుగువారు వెంటనే 108కి సమాచారం అందించారు. హుటాహుటిన వారిని పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
* కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సాధారణ జ్వరం వచ్చినా ప్రజలు భయపడుతున్నారని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వైద్యులు సమరం అంటున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా ఇబ్బంది పడుతోన్న పేదలకు సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానంతోపాటు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేసి మాస్కులు, శానిటైజర్, సబ్బులు అందజేస్తూ.. కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే కరోనాను అరికట్టవచ్చని కృష్ణా జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ డా. సమరం సూచించారు.
* దేశంలో కరోనా కేసుల పెరుగుతున్న దృష్ట్యా లాక్‌డౌన్ పొడిగించాలంటూ పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు అందుతున్నాయి. రాష్ట్రాల విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ గడువు ఏప్రిల్ 14తో ముగుస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాలతో పాటు నిపుణులు సైతం పొడిగించాలంటూ తమ అభిప్రాయాలు తెలపడంతో లాక్‌డౌన్ కొనసాగించాలా?ముగించాలా? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.
* రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు సీఎంకు వివరించారు. అందరికీ వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. దానికి అనుగుణంగా టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని..రెండు జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సరిపడా టెస్టింగ్ కిట్లు తెప్పించుకోవాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
* కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల సరఫరా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్రంగా పరిగణించారు. తమ విజ్ఞప్తిని భారత్ మన్నించకపోతే ప్రతీకారం ఉండొచ్చన్న ఆయన తీరును విమర్శించారు. ‘అంతర్జాతీయ వ్యవహారాలను కొన్ని దశాబ్దాలుగా గమనిస్తున్నాను. కానీ ఈ తీరుగా ఏ దేశాధినేత మరొక దేశాన్ని భయపెట్టాలని ప్రయత్నించడం చూడలేదు. మిస్టర్ ప్రెసిడెంట్.. భారత్ మీకు వాటిని అమ్మాలనుకుంటేనే మీకు సరఫరా అవుతాయి’ అని ట్విటర్‌లో ఘాటుగానే స్పందించారు.
* కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తూ విలయ తాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా అందర్ని బాధితులుగా మార్చేస్తుంటే.. రష్యాలోని ఓ నగల వ్యాపారి ఆ వైరస్ ఆకృతిని ఆభరణంగా మార్చేసింది. ఆమె చేసిన ఆభరణానికి ఎంత ఆదరణ లభిస్తుందో.. విమర్శల వర్షం కూడా అంతే ఉంది. రష్యాకి చెందిన డాక్టర్ వొరొబెవ్.. ఓ ‘మెడికల్ జ్యువెలరీ ’నగల వ్యాపారి. మెడికల్ జ్యువెలరీ అంటే.. వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారీ చేసే ఆభరణాలు. ఎక్కువగా వెండితో తయారు చేస్తారు. వెండికి సూక్ష్మక్రిములను అడ్డుకునే తత్వం ఉంది. అందుకే వైద్య రంగంలో పనిచేసేవారు ఈ మెడికల్ జ్యువెలరీని ధరిస్తున్నారు.
* రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి రాష్ట్రం ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అథారిటీకి సబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు ఆసుపత్రి పనులను ఇవాళ పరిశీలించారు.
* కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. దేశంలో నానాటికీ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య, అబద్ధపు వార్తలు కరోనా వైరస్ కన్నా వేగంగా వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా కరోనాపై మీమీస్, జోక్స్, ఫేక్ న్యూస్ వాట్సాప్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఒక సందేశం చూసి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు వణికిపోతున్నారు. ఏదైనా గ్రూప్‌లో వాట్సాప్ ఫేక్‌న్యూస్ ఉన్నట్లు గుర్తిస్తే ఆ గ్రూప్ అడ్మిన్‌పై సెక్షన్ 68, 10, 188 కింద న్యాయపరమైన చర్యలు తప్పవని, అందుకు రెండు రోజుల పాటు వాట్సాప్ గ్రూప్ మూసేయాలని గత రెండు, మూడు రోజులుగా ఓ సందేశం వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు భయాందోళనకు గురవుతున్నారు.
* మహారాష్ట్రలో పెరుగుతున్న కరోనా వైరస్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నిజాముద్దీన్ ఘటన అనంతరం రాష్ట్రంలో వైరస్ తీవ్రత మరింత పెరిగింది. తాజాగా రాష్ట్రంలో 23కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 891కి చేరింది. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 110 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అత్యంత జనసాంద్రత ఉండే ధారావి ప్రాంతంలో నమోదవుతున్న కేసుల సంఖ్య కలవరపెడుతోంది. ఈ ప్రాంతంలో తొలుత వైరస్ సోకి మరణించిన వ్యక్తినుంచి అతని తండ్రి, సోదరునికి కరోనా సోకినట్లు అధికారులు తాజాగా గుర్తించారు.
* లాక్‌డౌన్ నేపథ్యంలో.. విద్యార్థులకు ప్రాంగణ నియామకాల(క్యాంపస్ సెలక్షన్) ద్వారా ఇచ్చిన ఉద్యోగావకాశాలను వెనక్కి తీసుకోవద్దంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆయా సంస్థల యాజమాన్యాలను కోరింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన ఐఐటీ, ఐఐఎంలలో చదివిన విద్యార్థులు కొందరు కరోనా లాక్‌డౌన్ అనిశ్చితి కారణంగా ఉద్యోగావకాశాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ విధంగా స్పందించింది.
* కరోనాకు రాజు, పేద తేడా తెలియదు అని అంటున్నారు నటి మాధవీ లత. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ను ఉద్దేశించి ఆమె టిక్‌టాక్ వీడియో చేశారు. జీవితంలో ఎన్ని సాధించినా చివరికి మనతో ఏదీ రాదనే సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు.‘మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా.. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో.. ఇంట్లో ఉండండి.. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ వీడియోను 4.4 లక్షల మందికిపైగా వీక్షించారు. 35 వేల మంది లైక్ చేశారు. ‘ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు, చాలా బాగా చెప్పారు, మీ కవిత చాలా బాగుంది..’ అని పలువురు కామెంట్ల రూపంలో ప్రశంసిస్తున్నారు.
* కరోనా (కొవిడ్-19) వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కరోనాపై మరింత సమర్థవంతంగా పోరు కొనసాగించేందుకు అవసరమైన నిధుల సమీకరణకు ప్రధాని మరింత కఠినంగా వ్యవహరించాలని లేఖలో పేర్కొన్నారు. అందులో భాగంగా పార్లమెంట్ భవనంతోపాటు, సెంట్రల్ విస్టా, మంత్రులకు సంబంధించిన కాంపోజిట్ కాంప్లెక్స్ ఆధునీకరణ ప్రాజెక్టును నిలిపివేసి అందుకు కేటాయించిన రూ. 20 వేల కోట్ల నిధులను కరోనాపై పోరులో భాగంగా కొత్త ఆస్పత్రుల నిర్మాణానికి, వైద్య సిబ్బంది వ్యక్తిగత రక్షణకు ఉపయోగించే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పీపీఈ) కిట్ల కొనుగోలుకు ఉపయోగించాలని కోరారు.