DailyDose

వ్యాక్సిన్ కావాలంటే $8బిలియన్లు ఇవ్వండి-వాణిజ్యం

Telugu Business News Roundup Today-G20 Countries Ask For 8Billion To Make Vaccine

* ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో కరోనాపై పోరాటానికి ఆర్థిక సాయం చేయాలని జీ20 దేశాలకు అంతర్జాతీయ ప్రముఖులు, మాజీ నాయకులు విజ్ఞప్తి చేశారు. మహమ్మారి కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ను తయారుచేయడానికి అత్యవసరంగా 8 బిలియన్ల డాలర్లను ఇవ్వాలని కోరారు. ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్న దేశాలను ఆదుకోవడానికి జీ20 దేశాలు, నాయకులు, మంత్రులు, శాస్త్రవేత్తలు సాయం చేయాలని అన్నారు. ఆ దేశాల కోసం 35 బిలియన్ల డాలర్లు ఇవ్వాలని సూచించారు.

* కరోనా ప్రభావంతో గతవారం భారీ నష్టాల్ని మూటగట్టుకున్న మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాల దిశగా సాగుతున్నాయి. అమెరికన్‌ మార్కెట్లు సైతం సోమవారం భారీగా లాభపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుండడం మదుపర్ల సెంటిమెంటును పెంచింది. మరోవైపు ఐరోపాలో వైరస్‌కు కేంద్రంగా ఉన్న ఇటలీ, స్పెయిన్‌ సహా మరికొన్ని దేశాల్లో తీవ్రత గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం ఆశలు రేకెత్తించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం 9:40 గంటల ప్రాంతంలో సెన్సెక్స్‌ 1,217 పాయింట్లు లాభపడి 28,818 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 344 పాయింట్లు ఎగబాకి 8,434 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76 వద్ద కొనసాగుతోంది.

* ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో కార్యకలాపాలను నిలిపివేసిన సూక్ష్మ రుణ సంస్థలు(ఎమ్‌ఎఫ్‌ఐ) సమీప భవిష్యత్‌లో వృద్ధిపై ఆందోళన చెందుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలను రక్షించడంపైనే దృష్టి సారిస్తున్నట్లు ఎమ్‌ఎఫ్‌ఐలు చెబుతున్నాయి. చాలా వరకు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశమూ ఉందని మైక్రోఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ నెట్‌వర్క్‌(ఎమ్‌ఎఫ్‌ఐఎన్‌) ఛైర్‌పర్సన్‌ మనోజ్‌ కుమర్‌ నంబియార్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ ఎపుడు ఎత్తేస్తారన్నదానిపై ఆధారపడి ఎమ్‌ఎఫ్‌ఐల పనితీరు ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు. తొలి త్రైమాసికంలో మాత్రం ప్రభావం కచ్చితంగా కనిపిస్తుందని.. మారటోరియం వల్ల ఏప్రిల్‌, మేలో వసూళ్లు తగ్గవచ్చని చెబుతున్నారు. విస్తరణ ప్రణాళికలను ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయొచ్చని అన్నారు.

* ఔషధం లేని మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ ప్రజలను వణికిస్తోంది. దీని గురించి సరైన సమాచారం తెలియక, అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం నిజమైందో కాదో నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌-19కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆపేందుకు వాట్సాప్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తమ యాప్‌లో తరచుగా షేర్‌ అయ్యే మెసేజ్‌లను ఇకమీదట ఒకసారి ఒక్కరికి మాత్రమే షేర్‌ చేయగలిగే విధంగా వాట్సాప్‌ కట్టుదిట్టం చేసింది. ఇప్పటి వరకూ ఇలాంటి మెసేజ్‌లను ఒకేసారి ఐదుగురికి షేర్‌ చేయగలిగే వీలు ఉంది. తాజా చర్యతో యూజర్లు వాట్సాప్‌లో మెసేజ్‌లను ఫార్వర్డ్‌ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది.

* బుల్‌ రంకెలేసింది. భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం లాభాల్లో తడిచి ముద్దయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 2,476 పాయింట్ల లాభంతో 30వేల మార్కును దాటేసింది. పెరుగుదల శాతం పరంగా తీసుకుంటే 2009, మే తర్వాత ఒకరోజు సెన్సెక్స్‌ ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ కలిసి రావడం, ఆసియా మార్కెట్లు లాభాల్లో ఆరంభమవ్వడం ఇందుకు దోహదం చేసింది.