DailyDose

నెల్లూరులో ఇద్దరి డాక్టర్లకు కరోనా-TNI కథనాలు

TNILIVE Special Coronavirus Stories-Two Nellore Doctors Tested Positive

* నెల్లూరులో ఇద్దరు డాక్టర్లకు కరోనా పాజిటివ్ అని తేలడంతో హాస్పిటళ్ళకు నిలయమైన పొగతోట, బృందావనం ప్రాంతాలు వణికాయి. తొలిసారిగా ప్రయివేట్ డాక్టర్లకు కారోనా వైరస్ సోకిందని తెలియడంతో మిగతా డాక్టర్లలో కలవరం మొదలైంది. ఆ డాక్టర్లతో కలిసినవారు ఎవరికి వారు క్వారంటైన్ కి వెళ్ళిపోతున్నారు. వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని భయంతో ఆసుపత్రులు మూసేసుకుని వెళ్లిపోయారు. నెల్లూరులో డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది అన్న వార్త సంచలనం కలిగించింది. కరోనా పాజిటివ్ అనితేలిన ఆర్ధోపెడిక్ డాక్టరుగా పని చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటరుపై ఉన్నారు.దీంతో ఆ డాక్టరుకు సంఙదించిన వారిని క్వారంటైన్ కు పంపేశారు. కొద్దిరోజుల క్రితం ఆర్ధోపెడిక్ డాక్టర్నగరంలోని వైద్యులందరికీ ఓ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకి నగరానికి చెందిన చాలామంది డాక్టర్లు హాజరయ్యారు.ఈ నేపధ్యంలో ఆర్ధోపెడిక్ డాక్టర్ కి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఫంక్షన్ కి వచ్చిన డాక్టర్లు, ఆయనతో సన్నిహితంగా వున్న వ్యక్తులు భయంతో వణికిపోతున్నారు. అందరిలోనూ ఒకటే టెన్షన్ మొదలైంది. తమలో ఎవరికైనా వైరస్ సోకిందా అని ఆందోళన చెందుతున్నారు. ఆయన పని చేస్తున్న ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్లు, ఫంక్షన్ కి వెళ్ళిన వైద్యులంతా పరీక్షలు చేయించుకుంటున్నారు. క్వారంటైన్ వార్డుకి వెళ్ళి నిర్ధారణ పరీక్షలకు చేయించుకుంటున్నారు. ఇక ఈ వార్త బైటికి రావడంతో మిగిలిన డాక్టర్లంతా ఇళ్ళకే పరిమితమవుతున్నారు. బైటికి వచ్చేందుకు కూడా సంకోచిస్తున్నారు.

* లాక్‌డౌన్‌ను పొడిగించాలని రాష్ట్రాలు కోరుతున్నాయనీ.. వారి ప్రతిపాదనలపై ఆలోచిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.దేశంలో కరోనా పరిస్థితిపై దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడుతూ…లాక్‌డౌన్‌ పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.దీనిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దన్నారు.

* మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్‌ 15 నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఈశాన్య రాష్ట్రం పేర్కొంది. ప్రైవేటు వాహనాల రాకపోకలకు అనుమతినిస్తామని.. అయితే విద్యా సంస్థలను మాత్రం ఏప్రిల్‌ 30 వరకు మూసివేస్తామని వెల్లడించింది. ప్రాణాంతక వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే మేఘాలయలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 15 నుంచి పాక్షికంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

* ఏపీలో కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆదుకోవడానికి పలువురు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలను అందించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా ముందుకొచ్చింది. కరోనాపై పోరాటానికి రూ. 19 కోట్ల విరాళం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో చిత్తూరు జిల్లాకు రూ. 8 కోట్ల సాయాన్ని అందిస్తున్నామని… మిగిలిన రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వానికి అందిస్తామని తెలిపింది.

  • దేశంలో కరోన బాధితుల సంఖ్య 4789కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.4312 మందికి కొనసాగుతున్న చికిత్స.కరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 352మంది బాధితులు.కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 124 మంది మృతి.సాయంత్రం 6.00 గంటల వరకు వివరాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ.గడచిన 24 గంటల్లో 508 పాజిటివ్ కేసులు నమోదు కాగా 13మంది మృతి.