దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్-19 వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్, ఎన్‌సీపీ నేత శరద్ పవార్ దీనికి హాజరయ్యారు.
వైరస్ కట్టడికి, లాక్‌డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కేంద్ర వైద్య, హోమ్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పార్టీ నేతలకు వివరించారని తెలిసింది. వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ సామగ్రి (పీపీఈ) కొరత గురించి నేతలు సమావేశంలో లేవనెత్తారని సమాచారం. పార్లమెంటు నూతన భవన నిర్మాణాన్ని ఆపేయాలని మరికొందరు పేర్కొన్నారని తెలిసింది.
దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడగించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం.
ఈ సమావేశంలో కేశవరావు (తెరాస), విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి (వైకాపా), రామ్‌గోపాల్‌యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ), సతీశ్ మిశ్రా (బహుజన్ సమాజ్ పార్టీ), చిరాగ్ పాసవాన్ (లోక్ జన్‌శక్తి పార్టీ), టీఆర్ బాలు (డీఎంకే), సుఖ్‌బీర్ సింగ్ బాదల్ (శిరోమణీ అకాలీదళ్), రాజీవ్ రంజన్‌సింగ్ (జనతాదళ్ యునైటెడ్), పినాకి మిశ్రా (బిజూ జనతాదళ్), సంజయ్ రౌత్ (శివసేన) సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట్లో తృణమూల్ నిరాకరించినప్పటికీ అనంతరం సుదీప్ బందోపాధ్యాయ హాజరయ్యారు. బుధవారం ఉదయానికి భారత్‌లో 5,194 మందికి కొవిడ్-19 సోకింది. 149 మంది మృతిచెందారు.