DailyDose

కరోనా వలన కారులోనే నివాసం-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Man makes his car his living home

* క్వారంటైన్‌ ముగియగానే తబ్లిగీ జమాత్‌ ప్రధాన నేత మౌలానా సాద్‌ ఖాందల్వి విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. సాద్‌ సహా ఏడుగురిపై దిల్లీ పోలీసు నేర విభాగం మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు వ్యక్తిగత దూరం పాటించలేదని నిజాముద్దీన్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ ఫిర్యాదు చేశారు.

* నల్లబజార్లలతో నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరలు పెంచడం వంటి కార్యక్రమాలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని.. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. డీలర్లపై నిఘా పెంచడంతోపాటు వారి అకౌంట్లను నిత్యం పరిశీలించాలన్నారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. దీనికిగానూ ఏడేళ్ల జైలు శిక్ష ఉన్నట్లు గుర్తు చేశారు. జూన్‌ 30 వరకు నిత్యావసరాల చట్టం అమలులో ఉంటుందని.. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టంగా ప్రచారం చేయాలన్నారు. ఆహార, నిత్యావసర ఉత్పత్తి సంస్థల్లోని కార్మికుల కొరత, ముడి సరకు సరఫరాపై దృష్టి సారించాలని కోరారు.

* ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య మరింత పెరిగింది. ఈరోజు ఉదయం 9 తర్వాత నిర్వహించిన పరీక్షల్లో 19 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న సాయంత్రం 6 నుంచి ఈ ఉదయం 9 గంటల మధ్య 15 కేసులు నమోదవగా.. తాజా 19 కేసులతో కలిపి ఈ ఒక్కరోజే 34 కేసులు పాజిటివ్‌గా తేలినట్లయింది. వీటితో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 348కి చేరుకుంది. కొత్తగా గుంటూరులో 8, అనంతపురం 7, ప్రకాశం 3, పశ్చిమగోదావరిలో ఒక్క కేసు నమోదయ్యాయి. విశాఖలో కోలుకున్న ముగ్గురిని డిశ్చార్జి చేసినట్టు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 9కి చేరింది.

* లాక్‌డౌన్‌ సమయంలో పేద ప్రజల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పి. చిదంబరం ఆరోపించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు చేస్తామన్న నగదు పంపిణీని చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

* తెలంగాణలో ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం సరైందేనని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు (వీహెచ్‌) అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని వీహెచ్‌ ప్రభుత్వానికి సూచించారు. గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ పొడగిస్తే సరకులు బ్లాక్‌ చేసి మరింత ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉందని.. అలా జరగకుండా ధరల పట్టికను ప్రతి దుకాణం ముందు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న నేపథ్యంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించకూడదనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని వీహెచ్‌ ఆక్షేపించారు. పరిమితంగా ప్రజలకు అనుమతి ఇచ్చి నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాలని కోరారు.

* కరోనావైరస్‌తో వృద్ధులే కాకుండా చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌-19 బారిన పడి 14 నెలల శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన శిశువుకు ఏప్రిల్‌ 5న కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం శిశువు మృతి చెందింది. అయితే శిశువు తల్లిదండ్రులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. వారికి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

* కరోనా నియంత్రణ చర్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు గౌతమ్‌రెడ్డి, ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్‌-19 ర్యాపిండ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను సీఎం పరిశీలించారు. కరోనా పరీక్షల కోసం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను ఏపీలోనే తయారు చేశారు.

* దేశంలో వేగంగా వ్యాపిస్తున్న కొవిడ్‌-19 వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను అఖిలపక్షానికి ప్రధాని నరేంద్రమోదీ వివరించారు. పార్లమెంటులో ప్రతిపక్షాలు, ఇతర పార్టీల ముఖ్య నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ రాజ్యసభా పక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఎన్‌సీపీ నేత శరద్‌ పవార్‌ దీనికి హాజరయ్యారు. ఏప్రిల్‌ 14 తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని మోదీ అన్నారని తెలిసింది. కొవిడ్‌-19 తర్వాత జీవితం అంతకుముందులా ఉండకపోవచ్చని ఆయన తెలిపారు. పరిస్థితి కరోనా ముందు, కరోనాకు తర్వాత అన్నట్టుగా మారుతుందని వెల్లడించారు. ‘వ్యక్తిగత, ప్రవర్తన, సామాజిక మార్పులు ఎన్నో జరగాల్సి ఉంది’ అని నేతలతో మోదీ పేర్కొన్నారని సమాచారం.

* కరోనా వైరస్‌ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇక ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అమెరికాలో అత్యధిక జనాభా ఉన్న న్యూయార్క్‌లో నిన్న ఒక్కరోజులో 731 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో ఆ మహానగరంలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 4000కు చేరుకుంది. కాగా, ఇది నాటి 9/11 ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్య కంటే అధికంగా ఉండటం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది.

* ప్రపంచంపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరులో వైద్యులే యోధులుగా మారుతున్నారు. వృత్తిధర్మంలో భాగంగా తమ ప్రాణాలను పణంగాపెట్టి బాధ్యతలు నిర్వర్తిస్తుండడం ఎంతోమందిని కదిలిస్తోంది. ఇలాంటి అత్యయిక పరిస్థితుల్లో ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా వారి కుటుంబాలకే దూరంగా ఉంటున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనే తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది. కరోనా వైరస్ బాధితులకు చికిత్స అందిస్తోన్న ఓ వైద్యుడు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి కారులోనే నివాసమున్న ఘటన అందర్నీ ఆకర్షిస్తోంది.