* కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా యూకే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100కి పైగా జాతీయ ఆరోగ్య సేవ (ఎన్హెచ్ఎస్) ట్రస్ట్ ఆస్పత్రులకు భారీ రుణమాఫీని ప్రకటించింది. మహమ్మారిపై మరింతగా పోరాడేందుకు గాను ఆయా ఆస్పత్రులకు ఉన్న 13.4 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ. లక్షా పాతిక వేల కోట్ల) రుణాలను మాఫీ చేసింది.
* దేశవ్యాప్తంగా కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్డౌన్ వివిధ రంగాలను ప్రభావితం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజువారీ కూలీల నుంచి సంపన్న వ్యాపారవేత్తల వరకు ఎంతో మంది ఆదాయవనరులు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్మార్కెట్లు ఒడిదొడుకులకు లోను కావడంతో అపరకుబేరులు సైతం నష్టాలను చవిచూశారు. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ తన సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్నారు ఆయనే ప్రముఖ డి-మార్ట్ రిటైల్ దుకాణాల అధినేత రాధాకిషన్ దమానీ. తాజాగా ఆయన ఆధ్వర్యంలోని అవెన్యూ సూపర్ మార్ట్ లిమిటెడ్ ఈ ఏడాది 5 శాతం (10.2 బిలియన్ డాలర్లు) ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. 12 మంది భారత బిలియనీర్లలో దమానీ ఒక్కరే ఈ సంవత్సరం ఆదాయ వృద్ధిని నమోదు చేసినట్లు బ్లూబర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ఒక నివేదికలో పేర్కొంది. దీంతో ఈ ఏడాది అవెన్యూ సూపర్మార్ట్స్ నికర ఆస్తుల విలువ 18 శాతం మేర పెరిగినట్లు వెల్లడించింది.
* ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పింఛన్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమంటూ సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను తెలంగాణ హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. సీనియర్ న్యాయవాదులు సత్యంరెడ్డి, జంధ్యాల రవిశంకర్ రాసిన లేఖలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్నాథ్ ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. దీనిపై ఈనెల 17లోపు వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
* దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఉత్పత్తిని భారీగా తగ్గించింది. మార్చి నెల తయారీలో 32.05 శాతం కోత పెట్టినట్లు వెల్లడించింది. నెల మొత్తంలో 92,540 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు తెలిపింది. అదే గత సంవత్సరం మార్చిలో 1,36,201 యూనిట్లను తయారు చేసినట్లు పేర్కొంది. 2019 మార్చిలో 1,35,236 యూనిట్ల ప్యాసెంజర్ వాహనాలు ఉత్పత్తి చేసిన సంస్థ దాన్ని ఈయేడు 91,602కు పరిమితం చేసింది. అలాగే మినీ, కాంపాక్ట్ సెగ్మెంట్ కార్లయిన ఆల్టో, ఎస్-ప్రెస్సో, వేగనార్, సెలెరియో, ఇగ్నిస్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ల ఉత్పత్తిని 98,602 నుంచి 67,708కి కుదించింది. యుటిలిటీ వాహనాలైన విటారా బ్రెజా, ఎర్టిగా, ఎస్-క్రాస్ తయారీని కూడా 14.19 శాతం తగ్గించింది. ఫిబ్రవరిలో మొత్తం ఉత్పత్తిని 5.38 శాతం తగ్గించిన విషయం తెలిసిందే.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ (కొవిడ్-19)పై జరుగుతున్న యుద్ధానికి మద్దతుగా ట్విటర్ సీఈఓ జాక్ డోర్సీ భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ మహమ్మారి వ్యాప్తిని నిరోధించే చర్యలకు చేయూతగా 1 బిలియన్ డాలర్లను ఇస్తున్నట్టు తెలిపారు. తన ఆన్లైన్ ఆర్థిక సేవల సంస్థ ‘స్క్వేర్’ నుంచి ఈ మొత్తాన్ని ఇస్తున్నట్టు జాక్ డోర్సీ వివరించారు. కాగా ఈ మొత్తం జాక్ సంపదలో 28 శాతం కావటం గమనార్హం.