Politics

ఆయనకు ఆ రకం వైరస్ పట్టింది

YSRCP Minister Counters Chandrababu Comments

ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని.. కరోనాపై కాకుండా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రపంచానికి కోవిడ్ 19 మహమ్మారి సోకితే.. తెదేపా అధినేత చంద్రబాబుకు రాజకీయ వైరస్ సోకిందని ఎద్దేవా చేశారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే మాస్కులు, కిట్లు లేవని నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో N-95 మాస్కులు అందుబాటులో లేవని తెదేపా నేతలతో పాటు డాక్టర్‌ సుధాకర్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. రాష్ట్రంలో N-95 మాస్కుల కొరత లేదని.. ఒక్కొక్క మాస్కు 20 నుంచి 25 రోజులు వాడొచ్చన్నారు. ప్రస్తుతం ఆపత్కాలంలో ఒక డాక్టర్‌గా వైద్యులు, వైద్య సిబ్బంది చేస్తున్న సేవలకి బాసటగా నిలవాల్సిన సుధాకర్‌ అనవసర ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 వేల కోట్లను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. ప్రతి కుటుంబానికీ రూ.వెయ్యి నగదు, బియ్యం, చక్కెర తదితర నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేసినట్టు చెప్పారు. దేశంలోనే మెచ్చుకునే విధంగా గ్రామ వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని.. అలాంటి ప్రభుత్వంపై బురద చల్లాలని ఏవేవో ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి సురేశ్‌ వ్యాఖ్యానించారు.