Politics

నిమ్మగడ్డ తొలిగింపు నేను ఒప్పుకోను

Chandrababu Questions Governor Via Email From Hyderabad

ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగి ఉండగా దొడ్డిదారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకొచ్చిందని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరించందన్‌కు ఈమెయిల్‌ ద్వారా ఆయన లేఖ పంపారు. ప్రత్యేక ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌ఈసీని తొలగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని నిబంధన 243(కె) ప్రకారం 2016లో ఐదేళ్ల కాలపరిమితికి రమేశ్‌కుమార్‌ ఎస్‌ఈసీగా నియమితులైనట్లు చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడి మధ్యంలో నిలిచిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి సమయంలో అర్ధాంతరంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను మార్చడం అనైతికం, చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. ఎలాంటి నిబంధనలైనా ప్రస్తుతం కమిషనర్‌ పదవీకాలం ముగిసిన తర్వాతే అమలు చేయాలని తేల్చి చెప్పారు. అప్పటి వరకు తాజా ఆర్డినెన్స్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని గవర్నర్‌కు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.