ఓ వైపు వింబుల్డన్ రద్దయినా ఆల్ ఇంగ్లండ్ క్లబ్ సంపూర్ణ బీమా గొడుగు కింద నష్టాల నుంచి గట్టెక్కగా… మరోవైపు ఐపీఎల్ రద్దయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం భారీగానే మూల్యం చెల్లించుకోనుంది. ఐపీఎల్–2020 సీజన్ జరగకపోతే బోర్డుకు భారీ నష్టం రానుంది. కోవిడ్–19 నుంచి రక్షణ పొందే కవరేజి లేకపోవడంతో సాధారణ బీమా వర్తించదు. దీంతో ఈ ఏడాది లీగ్ రద్దయితే రూ. 3800 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఓ నివేదిక తెలిపింది. ఇందులో సింహభాగం నష్టం బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కే వస్తుంది. ఏకంగా రూ. 3200 కోట్లు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌కు వాటిల్లుతుంది. అయితే లీగ్ జరగలేదు కాబట్టి ప్రసారహక్కుల కోసం తాము చెల్లించాల్సిన భారీ మొత్తంనుంచి భారీ మినహాయింపు ఇవ్వాలని స్టార్ కచ్చితంగా బోర్డును కోరుతుంది. ఇరు పక్షాల ఒప్పందంలో ఇలాంటి నిబంధన ఉంటుందని క్రికెట్ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇక మిగతా రూ. 600 కోట్లు స్టేక్హోల్డర్లకు వస్తుందని నివేదిక వెల్లడించింది. అంటే బోర్డుతో పాటు, ఫ్రాంచైజీలు, ఆతిథ్య వేదికల రాష్ట్ర క్రికెట్ సంఘాలు, లాజిస్టిక్స్, హోటల్స్, స్థానిక సంస్థలు, అలాగే పన్ను రూపేణా ఆయా ప్రభుత్వాలకు ఈ నష్టం ఎదురవుతుంది. ఇప్పటి వరకైతే ఈ సీజన్‌ను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసిన బీసీసీఐ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. లాక్డౌన్ పొడిగింపు అనివార్యమైన ప్రస్తుత తరుణంలో ఇక 14 తర్వాత కూడా టోర్నీ జరిగే అవకాశమైతే లేదు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తేసే ఆలోచన లేదని సూచనప్రాయంగా చెప్పేసింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలైతే కేంద్రానికి ముందే ఈ నెలాఖరుదాకా లాక్డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో లాక్డౌన్ ఉంటే మ్యాచ్‌లకేం అవకాశముంటుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న బీసీసీఐకి కూడా ఏప్రిల్ 15 తర్వాత ఆటకు అవకాశం లేదని తెలుసు. అయితే రద్దా లేక ఈ ఏడాది ఆఖరుకల్లా నిర్వహించే ప్రత్యామ్నాయాల్ని బోర్డు పరిశీలిస్తుంది. అయితే సాధ్యాసాధ్యాల్ని పరిశీలించాకే ప్రకటన చేస్తే బాగుంటుందని బోర్డు ఆఫీస్ బేరర్లు భావిస్తున్నారు. అందువల్లే బీసీసీఐ నుంచి ప్రకటన ఆలస్యమవుతుందనే వార్తలు వస్తున్నాయి.
సన్‌రైజర్స్ సహాయం రూ. 10 కోట్లు
కోవిడ్–19ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో ప్రభుత్వానికి తమ వంతు ఆర్థిక సహాయం అందించేందుకు ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుకు వచ్చింది. సన్‌రైజర్స్ టీమ్ (సన్ టీవీ గ్రూప్) తరఫున కరోనా సహాయ నిధికి రూ. 10 కోట్లు ఇస్తున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దీనిపై హర్షం వ్యక్తం చేశాడు. ‘ఎంతో మంచి నిర్ణయం. వెల్డన్ సన్‌రైజర్స్’ అని వార్నర్ ట్వీట్ చేశాడు.