DailyDose

వూహాన్‌లో అప్పుడే పెళ్లిళ్ల సందడి ప్రారంభమైంది-తాజావార్తలు

Telugu Breaking News Roundup Today-Weddings Started In Wuhan

* భారత్‌కు WHO క్షమాపణలు తెలిపింది. సామాజిక వ్యాప్తి కాకుండా కేవలం ఒక ప్రాంతంలోనే కరోనా వ్యాప్తి ఉందని తన నివేదికలో స్పష్టం చేసింది.

* 6761కు జేరిన భారత్ కరోనా కేసులు. నేడు ఒక్కరోజే 33 మంది మరణించి రికార్డు నెలకొల్పారు.

* కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత పటిష్ఠంగా అమలు చేసేందుకు త్రిముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రాంతాలను గుర్తిస్తున్నట్లు చెప్పారు. జనం రద్దీ, వాహనాలు రహదారులపైకి రావడానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 30 రెడ్‌జోన్లు గుర్తించారు. కర్నూలు (22), కృష్ణా(16), గుంటూరు(12), పశ్చిమ గోదావరి(12), ప్రకాశం(11),విశాఖ పట్నం(6) జిల్లాలో ఎక్కువ రెడ్‌జోన్లు ఉన్నాయి. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య 365కు చేరింది. కరోనాతో కోలుకుని ఇప్పటివరకు 10 మంది డిశ్చార్జ్ కాగా.. ఆరుగురు చనిపోయారు.

* ఆగమని అడిగిన పోలీసును 50మీటర్ల మేర బైకుపై లాకెళ్లిన ముంబయి యువకుడు

* కరోనా సంక్షోభ సమయంలో 5వేల మంది అవసరార్థులకు సాయం చేసేందుకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముందుకొచ్చాడు. నెల రోజుల పాటు 5వేల మందికి నిత్యావసరాలు అందించేందుకు గాను అప్నాలయ అనే స్వచ్ఛంద సంస్థకు మాస్టర్ చేయూతనిచ్చాడు. దీంతో సచిన్​కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సంస్థ ట్వీట్ చేయగా.. మాస్టర్​ స్పందించాడు. “అవసరార్థులు, ఇబ్బందుల్లో వారికి సేవలను కొనసాగించేందుకు అప్నాలయకు మరింత మంచి జరగాలని కోరుకుంటున్నా. మంచి పనిని కొనసాగించండి” అంటూ సచిన్ ట్వీట్ చేశాడు.

* త‌మిళ‌నాడులో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య శ‌ర‌వేగంగా పెరుగుతున్న‌ది. కొత్త‌గా మ‌రో 77 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు 834గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య సాయంత్రానికి 911కు చేరింది. దీంతో దేశంలో రాష్ట్రాల వారీగా న‌మోదైన కేసుల సంఖ్యప‌రంగా రెండో స్థానంలో ఉంది. మొద‌టి స్థానంలో కొన‌సాగుతున్న మ‌హారాష్ట్రలో ఇప్ప‌టివ‌ర‌కు 11,00కు పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కాగా, త‌మిళ‌నాడులో న‌మోదైన పాజిటివ్ కేసుల‌లో అత్య‌ధికంగా ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల‌కు హాజ‌రైనవారే ఉన్నార‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వ చీఫ్ సెక్రెట‌రీ సీఎస్ ష‌ణ్ముగం వెల్ల‌డించారు.

* జ‌న‌వ‌రి 23 నుంచి ఏప్రిల్ 7 వ‌ర‌కు వూహాన్ ప్ర‌జ‌లు లాక్‌డౌన్‌లో ఉన్నారు. ఏప్రిల్ 7న ఒక్క కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డంతో త‌ర్వాతి రోజు లాక్‌డౌన్‌ను తొల‌గించింది చైనా ప్ర‌భుత్వం. దీంతో వుహాన్ ఊపిరి పీల్చుకున్న‌ది. ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో వూహాన్‌లో ఒక్క వివాహం కూడా జ‌రుగ‌లేదు. ఎప్పుడైతే లాక్‌డౌన్ తీసేస్తున్నార‌ని తెలిసిందో ఒక్క‌సారిగా వివాహ జంట‌లు పెండ్లికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు.

* ఉదయ్ కోటక్ తన జీతాన్ని ఏడాదికి ఒక రూపాయిగా మార్చుకున్నారు.

* చైనాకు ఇండియా ఐరాస సమావేశంలో కౌంటర్ ఇచ్చింది. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది.

* మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రేని ఎమ్మెల్సీగా నియమించాలని అక్కడి ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. ఈ మేరకు ఓ తీర్మానాన్ని రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదాపడిన నేపథ్యంలో ఆయనను ఎమ్మెల్సీగా నియమించాలని కోరింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధవ్‌ ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.

* దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌ మంగళవారం ముగియనుండటంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం సమావేశం అయ్యాక ఆయన ప్రసంగం ఉంటుందని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా సూచనలు చేశాయి. అయితే ఈ సారి ఎన్నో మార్పులు చేస్తారని తెలుస్తోంది. నిత్యావసరాల రవాణా మినహాయించి రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతాయి. పాఠశాలలు, కళాశాలలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తర్వాతి ఉత్తర్వులు వచ్చేవరకూ మూసేస్తారు. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో కఠిన సోషల్‌ డిస్టెన్స్‌ అమలు చేస్తూ కొన్ని రంగాలకు సడలింపులు ఇచ్చే అవకాశం ఉంది.

* కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదంటూ ఓ అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మాస్కులు తొలగించాక చేతులను శానిటైజర్‌ లేదా సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది.

* భారతదేశంలో సమూహవ్యాప్తి లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (వ్హో) స్పష్టం చేసింది. గురువారం విడుదల చేసిన ‘పరిస్థితి నివేదిక’లో వైరస్‌ సమూహవ్యాప్తి దశలో ఉందని రాయడం పొరపాటేనని అంగీకరించింది. భారత్‌లో ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని వివరించింది. శుక్రవారం మధ్యాహ్నానికి భారత్‌లో 6,412 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 199 మంది మృతిచెందారు. చివరి 24 గంటల్లో 33 మంది మరణించారు. దేశంలో కొవిడ్‌-19 మూడో దశలో లేదని ఇంతకు ముందే నొక్కిచెప్పింది. ఎవరి నుంచి వైరస్‌ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే సమూహ వ్యాప్తిగా పేర్కొంటారు.

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోనే రూ.77 వేల కోట్లు అప్పు చేసి ప్రజల్ని నిండా ముంచిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. జగన్‌ సర్కార్‌ వచ్చాక ఏపీ ప్రజల భవిష్యత్తు, రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలు ఆగిపోయాయని ఆయన మండిపడ్డారు.

* రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు, కొవిడ్‌ ఆసుపత్రుల వైద్యులతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘‘ కరోనాపై యుద్ధంలో అందిస్తున్న సేవలు చాలా ప్రశంసనీయం. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌, పారిశుద్ధ్య సిబ్బంది హృదయపూర్వకంగా సేవలందిస్తున్నారు. రిస్క్‌ ఉంటుందని తెలిసీ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. భయం ఉన్నా వైద్య సేవలు అందిస్తున్నందుకు సెల్యూట్‌ చేస్తున్నా. దిల్లీ నుంచి వచ్చిన వారి కారణంగానే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. వారందరినీ గుర్తించి క్వారంటైన్‌, ఐసోలేషన్‌లో ఉంచాం.’’ అని సీఎం తెలిపారు.

* రోడ్డుపై కరెన్సీ నోట్లు పడి ఉంటే ఎవరైనా ఏం చేస్తారు.. ఎవరూ చూడకుండా వెంటనే తీసి జేబులో వేసుకుంటారు. లేదా అవి ఎవరివో అని ఆరా తీస్తారు. అయితే లఖ్‌నవూలో మాత్రం అలా జరగలేదు. రోడ్డుపై పడి ఉన్న రెండు రూ.500 నోట్లను తీసుకునేందుకు స్థానికులు ముందుకు రాలేదు సరికదా.. భయంతో దూరంగా జరిగారు కూడా. దీనికి కారణం ఏంటో తెలుసా.. కరోనావైరస్‌ భయం.

* అంతర్జాతీయ శాంతిభద్రతలకు కరోనా వైరస్‌ మహమ్మారి పెను ముప్పుగా మారే అవకాశముందని ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక అశాంతి అల్లర్లకు దారితీసి, దాని మీద పోరాడే సామర్థ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని ఐరాస భద్రతా మండలిని ఆయన హెచ్చరించారు. కొద్ది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న ఈ మహమ్మారిపై ఐరాసలో కీలక విభాగమైన భద్రతామండలి ఇంతవరకు నోరు మెదపలేదు.

* దేశీయ విపణికి సరిపడా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కొరత ఏర్పడకుండా అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని వెల్లడించింది. మలేరియా, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌, లూపస్‌కు ఈ మందును వినియోగిస్తారన్న సంగతి తెలిసిందే. కొవిడ్‌-19పై పోరాడేందుకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను చాలాదేశాలు ‘గేమ్‌ ఛేంజర్’గా భావిస్తున్నాయి. అమెరికా, బ్రెజిల్‌, కొన్ని ఐరోపా దేశాలు తమకు ఈ ఔషధం కావాలని భారత్‌ను కోరుతున్న సంగతి తెలిసిందే.

* కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి దేశంలో వేగం విస్తరిస్తున్న నేపథ్యంలో… ఈ మహమ్మారిని నివారించేందుకు ఉపయోగించే వైద్య పరికరాల ధరలను తగ్గించే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా నివారణ, చికిత్సలో వాడే వెంటిలేటర్లు, మాస్కుల వంటి వైద్య సామగ్రి లభ్యతను పెంచేందుకు వీలుగా కస్టమ్స్‌, ఆరోగ్య సుంకాలను రద్దు చేసింది. ఈ రాయితీ సదరు వైద్యపరికరాల ముడి సామగ్రి దిగుమతులపై కూడా వర్తిస్తుంది.