Movies

స్టైల్ యుగాన్ని సైగల్ యుగంగా మార్చిన నటుడు

Remembering Kundal Lal Saigal On His Birth Anniversary

టాకీ యుగం ప్రారంభమైన 1932 నుండి 1946 మధ్య కాలాన్ని హిందీ చలనచిత్ర రంగం ‘సైగల్‌ యుగం’గా గుర్తించింది. హిందీ చిత్రపరిశ్రమ కలకత్తా నగరంలో పరిఢవిల్లిన రోజుల్లో సూపర్‌ స్టార్‌ హోదా సాధించిన ప్రధమ చలనచిత్ర కళాకారుడు కుందన్‌ లాల్‌ సైగల్‌. ఆయన తరువాతే రాజేష్‌ ఖన్నా, అమితాబ్‌ బచన్‌లు ఆ హోదా పొందగలిగారు. మహమ్మద్‌ రఫీ, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ వంటి పేరున్న గాయకులకే గాయకుడు సైగల్‌. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ లేకుండా పుట్టుకతోనే తన గాత్ర మాధుర్యంతో సంగీత ప్రియులను కట్టిపడేసి అనతికాలంలోనే సంగీత సామ్రాజ్యానికి రారాజుగా ఎదిగిన కుందన్‌ లాల్‌ సైగల్‌ ఒక మహానుభావుడు. సిల్కు బట్టలా, మఖమల్‌ వస్త్రంలా సుతిమెత్తని మంద్రస్వరానికి ఉచ్ఛస్వరానికి మధ్యలో మెలిగే సున్నితమైన స్వరంతో సైగల్‌ ఆలపిస్తుంటే జోలపాడినట్లుండేది. తలత్‌ మహమూద్, ముఖేష్, కిషోర్‌ కుమార్‌ వంటి ఎంతోమంది భావితరం గాయకులకు ఆయన ఒక బెంచ్‌ మార్క్‌గా భాసిల్లారు. సాంకేతిక లేని ఆ రోజుల్లో అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన సైగల్‌ పాటలు ఈ రోజుల్లో కూడా వింటూ ఆనందించే సంగీత ప్రియులు ఎందరున్నారో లెక్కకట్టలేం. అప్పటిదాకా తన గాత్రంతో అఖండ భారతాన్ని ఉర్రూతలూగించిన సైగల్‌ నటుడుగా పరకాయ ప్రవేశం చేసి ‘దేవదాసు’ వంటి పాత్రను అద్భుతంగా పోషించి మంచి నటుడు కూడా అనిపించు కున్నారు. అంతటి మహనీయుని 116వ జయంతి ఈరోజు.